జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనతో బీజేపీకి కలిగే ప్రయోజనాలేంటి?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మోదీ ప్రభుత్వం జమ్ము-కశ్మీర్ ఆర్టికల్ 370, 35ఎ రద్దు చేసింది. దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమైంది.
ఈ ప్రక్రియ కొన్ని వారాల తర్వాత ప్రారంభం కానుంది. దీని గురించి త్వరలో ఒక ప్రకటన చేయచ్చు.
దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, హోం కార్యదర్శి రాజీవ్ గౌబా, అదనపు సెక్రటరీ(కశ్మీర్) జ్ఞానేష్ కుమార్, రా, ఐబీ అధ్యక్షులు, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్స్ సహా చాలా మంది అధికారులు పాల్గొన్నారు.
దీనిపై మాట్లాడిన ఎన్నికల సంఘం బీబీసీతో "ఆ దిశగా సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం వేచిచూస్తున్నాం" అని తెలిపింది.

హోంమంత్రిత్వశాఖ వివరాల ప్రకారం జమ్ము-కశ్మీర్ పునర్వవస్థీకరణ చట్టం 2019ని అక్టోబర్ నుంచి అమలు చేయనున్నారు.
ఆలోపు జమ్ము-కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉంటుంది. కొత్తగా ఎన్నికలు జరిగేలోపు నియోజకవర్గాల పుర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలి.
జమ్ము-కశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన డిమాండ్ ఎన్నో ఏళ్లనుంచీ ఉంది.
ముఖ్యంగా జమ్ములో భారతీయ జనతా పార్టీ దానికి బలంగా డిమాండ్ చేస్తోంది. అక్కడ దానికి మిగతా పార్టీల కంటే చాలా ఎక్కువ పాపులారిటీ ఉంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ డిమాండ్ వెనుక చాలా ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో జమ్ము ప్రాతినిధ్యం కశ్మీర్ లోయతో పోలిస్తే తరచూ తక్కువగా ఉంటుందనేది వాటిలో ఒకటి.
కశ్మీర్ లోయతో పోలిస్తే జమ్ము డివిజన్‌లో అభివృద్ధి పనులు చాలా తక్కువగా జరిగాయని కూడా జమ్మూలో ఉన్న నేతలు చెబుతున్నారు.
ఆర్టికల్ 370ని రద్దుతో ఇప్పటికే కోలుకోలేని దెబ్బ తిన్న కశ్మీర్ లోయలోని పార్టీలకు నియోజకవర్గాల పునర్విభజన మరో షాక్‌గా మారచ్చు.
ప్రస్తుతం కశ్మీర్ లోయలో దాదాపు అగ్రనేతలందరూ గృహనిర్బంధంలో ఉన్నారు. కానీ ఆగస్టు 5న 370ని రద్దును ప్రకటించడానికి ఒక్క రోజు ముందు శ్రీనగర్‌లో జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తితో ఆటలాడద్దని కేంద్ర ప్రభుత్వం కశ్మీరీ నేతలను కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కల
బీజేపీ జమ్ము-కశ్మీర్‌ను విభజించే ప్రయత్నాలు చేస్తోందని కొందరు జిల్లా స్థాయి నేతలు బీబీసీతో అన్నారు.
సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ ప్రాంతంలో సీట్ల సంఖ్య పెరుగుతుంది. అవి కశ్మీర్ లోయలోని స్థానాలకంటే పెరుగుతాయి.
అలా జరిగితే, జమ్మూలో అతిపెద్ద పార్టీగా అవతరించే బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభం అవుతుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో(2014) జమ్మూలోని 37 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. ఐదు కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెరి మూడు స్థానాలు లభించాయి. ఒక సీటులో ఇండిపెండెంట్ గెలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
అటు కశ్మీర్ లోయలోని 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీడీపీ 28 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లలో విజయం సాధించాయి. కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచింది.
రాజ్యంలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, పీడీపీ మూడేసి సీట్లు గెలుచుకున్నాయి.
కశ్మీర్ లోయలో 46 సీట్లు, మూడు ఎంపీ స్థానాలు ఉంటే, జమ్ములో 37 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు, లద్దాఖ్‌లో ఒక స్థానం ఉన్నాయి.
పాక్ అధీనంలోని కశ్మీర్‌లో 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనేది కూడా గుర్తుంచుకోవాలి.
జమ్ము-కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం జమ్ము-కశ్మీర్‌లో మొత్తం 114 అసెంబ్లీ స్థానాలు ఉండబోతున్నాయి. వీటిలో పాక్ అధీనంలోని కశ్మీర్ 24 స్థానాలు కూడా ఉన్నాయి.
జమ్ము-కశ్మీర్‌లో చివరగా 1995లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దేశవ్యాప్తంగా చివరి నియోజకవర్గాల పునర్విభజన 2002లో జరిగింది.

ఫొటో సోర్స్, FACEBOOK/AMIT SHAH
అందుకే డీలిమిటేషన్ కమిటీ సభ్యుల్లో భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ గోపాలస్వామి కూడా ఉన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ "జమ్ము-కశ్మీర్‌లో నియోజకవర్గాలను మళ్లీ విభజించాలంటూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని చెప్పారు. అది డీమిలిటేషన్ కమిటీలాగే పనిచేస్తుందని" అన్నారు.
"డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ సమయంలో జరుగుతుంది" అని ఆయన చెప్పారు.
2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన తర్వాత జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావించిన గోపాలస్వామి ఆ పనిని ఎన్నికల కమిషనే చేసిందని చెప్పారు.
"డీమిలిటేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. ఆ జనాభా లెక్కల ప్రకారం జమ్ము డివిజన్ జనాభా 54 లక్షలు. ఈ డివిజన్ 26,200 చదరపు కిలోమీటర్లలో ఉంది. కశ్మీర్ లోయలోని జనాభా 69 లక్షలు. ఇది 15,900 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఉంది. అంటే ఏరియాను బట్టి జమ్ము పెద్దది. కశ్మీర్ అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?లోయ దానికంటే చాలా చిన్నది. కానీ జనాభా పరంగా కశ్మీర్, జమ్మూ కంటే చాలా పెద్దది" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పునర్విభజన ఎలా
జమ్ములోని 37 అసెంబ్లీ స్థానాలలో ఏడు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు. కశ్మీర్ లోయలోని 46 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఒక్క స్థానం కూడా రిజర్వ్ చేయలేదు.
అందుకే, లోయలో ప్రతిసారీ ఎక్కువ స్థానాలు గెలవడం వల్ల అక్కడివారే ముఖ్యమంత్రి అవుతున్నారని జమ్మూ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
కానీ, జమ్మూలో ఉన్న కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భసీన్ జమ్మూపై వివక్ష ఉన్నట్లు బలమైన ఆధారాలేవీ లేవన్నారు.
"జమ్మూలో స్థానికులకు ఒక విధంగా తమపై వివక్ష చూపుతున్నారని, కశ్మీర్ నాయకుల ఆధిపత్యం ఉండడం వల్ల ఎక్కువ అభివృద్ధి కశ్మీర్‌లో జరిగిందని ఒక భావన ఉంది. కానీ, దానికి బలమైన ఆధారాలు చూపించడం కష్టం" అని భసీన్ న్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందుకే, త్వరలో జరగబోయే డీలిమిటేషన్‌లో కేవలం జనాభానే కాకుండా ఏరియాను కూడా దృష్టిలో పెట్టుకోవాలని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
"సగటున జమ్మూలో ఒక అసెంబ్లీ స్థానం, కశ్మీర్ లోయలోని ఒక స్థానం ఏరియాతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. అందుకే అక్కడి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పనులు చేయాలంటే చాలా కష్టపడాలి. జమ్ము-కశ్మీర్ అసెంబ్లీలో లెక్కలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు చూసినా కశ్మీర్ లోయలోని పార్టీలదే పైచేయిగా ఉంటుంది. అందుకే జమ్ము, లద్దాఖ్‌కు ఎప్పుడూ తగిన ప్రాతినిధ్యం లభించలేదు. అందుకే జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రి కూడా కశ్మీర్ లోయ నుంచే అవుతుంటారు" అని బీజేపీ నేతలు అన్నారు.
"ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. సీట్లు పెరిగితే అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాల రాజకీయాలకు దాదాపు తెరపడుతుంది. దానితోపాటు వేర్పాటువాద శక్తులు కూడా బలహీనం అవుతాయి" అన్నారు.
కానీ, జమ్ములోని పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీమ్ సింగ్ జమ్ము డివిజన్‌లో బీజేపీకి భిన్నంగా అభిప్రాయాలు ఉన్న నేతలు కూడా ఉన్నారని చెప్పారు. కానీ వారిని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్బంధంలో ఉంచింది.

ఫొటో సోర్స్, Getty Images
భీమ్ సింగ్ బీబీసీతో "కశ్మీర్ లోయతోపాటూ జమ్ములో కూడా చాలామంది నేతలను గృహనిర్బంధంలో ఉంచారు, అదుపులో తీసుకున్నారు. మా పాంథర్స్ పార్టీ చీఫ్‌ను జైల్లో పెట్టారు. మాలో చాలా మంది అభిప్రాయం బీజేపీకి భిన్నంగా ఉంటుంది. కానీ ఎవరైనా వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే ప్రభుత్వం వారిని గృహనిర్బంధంలోకి తీసుకుంటుంది" అన్నారు.
కానీ డీమిలిటేషన్ మొదలైతే, వారి పార్టీలకు గుర్తింపు ఉంటుందా?
దానికి ఆయన నేరుగా "అక్టోబర్ 31 ఇంకా చాలా దూరం ఉందిగా" అన్నారు.
కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధా భసీన్ "బీజేపీ విపక్షాలకు రాజకీయంగా స్పేస్ ఇవ్వకూడదని అనుకుంటోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేలా జమ్మూలో ఎక్కువ సీట్లు ఉండాలని కోరుకుంటోంది" అన్నారు.
బీజేపీ దృష్టిలో ఇప్పటివరకూ కశ్మీరీ లోయలోని నేతల హవా నడిచింది.
ఆ పార్టీ నేత ఒకరు "ఇప్పుడు జమ్ము-కశ్మీర్ రెండు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి సమయం వచ్చింది" అన్నారు.
జమ్ము కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తారని స్థానిక నేతలు కొందరు ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 15న స్వయంగా ప్రధాన మంత్రే తన ప్రసంగంలో ఆ భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్‌పై ట్రంప్ ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు?
- "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం"
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








