కశ్మీర్‌లో ఆర్టికల్ 370 సవరణ తరువాత ఎక్కడ ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
భారత పార్లమెంటు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని సవరించిన మరుసటి రోజు కూడా కశ్మీర్‌లో సమాచార వినిమయం అత్యంత కష్టంగా ఉంది.
ఈ నెల 4న ఆదివారం సాయంత్రం నుంచి నిలిపివేసిన టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది. మరోవైపు వేల మంది భద్రతా దళాలు వీధుల్లో పహారా కాస్తున్నారు.
ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపుతో కశ్మీర్‌లో పెద్దయెత్తున ఆందోళనలు చెలరేగుతాయని ఇంతకుముందు భావించారు. ఈ చర్యపై కశ్మీరీ ప్రజలు ఎలా స్పందించారనే సమాచారం తెలియడం లేదు.
స్థానిక నాయకులను కూడా అధికార యంత్రాంగం నిర్బంధంలో ఉంచింది. ఆదివారం రాత్రి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధంలో ఉంచారు.

ఫొటో సోర్స్, LSTV
జమ్మూకశ్మీర్ భూభాగంలో ఎక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదని, ప్రజలు ఆందోళనతో ఉన్నారని శ్రీనగర్‌లోని బీబీసీ ప్రతినిధి అమీర్ పీర్‌జాదా సోమవారం చెప్పారు.
కశ్మీర్‌లో సమాచార వ్యవస్థలపై ఆంక్షల నేపథ్యంలో అక్కడున్న తమవారి యోగక్షేమాలు తెలియక ఆందోళన, భయం కలుగుతున్నాయని భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలు చెబుతున్నారు.
తన కుటుంబం గురించి తెలుసుకొనేందుకు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసేందుకు కూడా ప్రయత్నించానని, కానీ ఫలితం లేదని దిల్లీలో ఉండే కశ్మీరీ విద్యార్థి 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు తెలిపారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
భారత్‌లో కశ్మీర్ భాగంగా ఉండేందుకు ఆర్టికల్ 370నే ప్రధాన ప్రాతిపదికగా కశ్మీర్‌లోని చాలా మంది భావిస్తారని, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీని రద్దుతో కశ్మీర్ ప్రాంతంతో భారత్ సంబంధాన్ని పునరుద్ధరించడానికి వీల్లేనంతగా మార్చేసిందని బీబీసీ ప్రతినిధి గీతా పాండే చెప్పారు.
ఆర్టికల్ 370పై పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన తర్వాత ప్రభుత్వం కశ్మీర్‌లో అదనపు బలగాలను మోహరించింది.
సమాచార సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే సంకేతాలేవీ లేవు. కశ్మీర్‌లోకి వ్యక్తులను అనుమతిస్తున్నారని స్థానిక మీడియా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370 సవరణతో ఏం జరుగుతుంది?
1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినపుడు జమ్మూకశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని తొలుత భావించారు. తర్వాత కొన్ని షరతులతో భారత్‌లో విలీనమయ్యేందుకు సమ్మతించారు.
ఆ తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 కింద జమ్మూకశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. దీని ప్రకారం రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ అంశాలు మినహా ఏ అంశానికి సంబంధించి చట్టం చేయాలన్నా, అమలు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక జెండా కూడా ఉంటుంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు ఉంటుంది. అధికరణ 370 సవరణతో ఈ ప్రత్యేక ఏర్పాట్లన్నీ తొలగిపోతాయి.
ఆర్టికల్ 370 కింద జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ప్రధానమైన నిబంధనలను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్‌లో భూమి కొనుక్కోవచ్చు’
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్‌లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








