భారత ఉత్పత్తులు బహిష్కరించాలి అంటూ పాక్ సోషల్ మీడియాలో ప్రచారం... కౌంటర్లు వేస్తున్న భారత నెటిజన్లు..

పాకిస్తాన్ అమ్మాయిలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

#BoycottIndianProducts

పాకిస్తాన్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. #BoycottIndianProducts అంటే భారత్‌లో తయారయ్యే వస్తువులను బహిష్కరించడం.

ఇటీవల ఆర్టికల్ 370పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... పాకిస్తాన్ సోషల్ మీడియా వినియోగదారులు ఈ హ్యాష్‌ట్యాగ్‌‌తో పోస్టులు పెడుతున్నారు.

అందుకు భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు కూడా అదేస్థాయిలో కౌంటర్లు విసురుతున్నారు. "మీరు మా వస్తువులను బహిష్కరించాలనుకుంటే, ముందుగా మా దేశం నుంచి మీకు వచ్చే నీటిని వాడుకోవడం మానేయండి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ అంశం దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉంది. ఆర్టికల్ 370 కింద జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇరు దేశాల మధ్య వాతావరణం మరోసారి వేడెక్కింది.

కశ్మీర్‌లో భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, AFP

భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా వినియోగదారులు పాక్ ప్రజలను కోరుతున్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను కొనవద్దని సూచిస్తున్నారు.

"మీరు భారతీయ వస్తువులను కొనుగోలు చేస్తే, ఆ డబ్బుతో భారత ప్రభుత్వం ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. కశ్మీరీలను అణచివేసేందుకు వాటిని వినియోగిస్తుంది" అంటూ కొందరు పాకిస్తానీ సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు.

#BoycottIndianProducts తో ట్విటర్, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు.

భారత్ నుంచి వచ్చే వస్తువులనే కాదు, భారతీయ సినిమాలు, పాటలు, టీవీ సీరియళ్లను కూడా చూడొద్దని పాకిస్తానీయులను వారు కోరుతున్నారు.

ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

"ఒక పాకిస్తానీ పౌరుడిగా, మన తోటి కశ్మీరీలకు సంఘీభావం తెలిపేందుకు భారతీయ వస్తువులను బహిష్కరించడం మన బాధ్యత" అంటూ పాకిస్తానీ ట్విటర్ వినియోగదారుడు ఎం. సిద్దిఖీ ట్వీట్ చేశారు.

సిద్దిఖీ ఒక చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. అందులో "పాకిస్తానీగా ఉండండి, పాకిస్తానీ సినిమాలనే చూడండి" అన్నట్లుగా ఉంది.

ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

"భారత విమానాలకు మన గగన తలాన్ని ఇంకా మూసివేయలేదు. భారత ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించడం మన దేశ బాధ్యత. ఏదైనా వస్తువును కొనేముందు అది ఎక్కడ తయారైందో పరిశీలించండి. భారత్‌లో తయారైన దానిని కొనకండి" అంటూ బిలాల్ షాహిద్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

"బాలీవుడ్ సినిమాలను, పాటలను బహిష్కరించండి. మీ ప్లేలిస్టు నుంచి బాలీవుడ్ పాటలను తొలగించండి. భారత బ్రాండ్ ఉన్నవి కొనకండి. భారతీయ సెలబ్రెటీలను అన్‌ఫాలో చేయండి" అని మరో పాకిస్తానీ వ్యక్తి ట్వీట్ చేశారు.

ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

పాకిస్తానీలు ఏ ఉత్పత్తులను బహిష్కరించాలో తెలుపుతూ ఇమాన్ అనే పాకిస్తానీ ట్విటర్ యూజర్ ఒక జాబితాను పోస్టు చేశారు.

  • భారత్‌ నుంచి వచ్చే బియ్యం
  • మసాలాలు
  • పిండి
  • పండ్లు
  • బట్టలు
  • నూనె
  • పప్పులు
  • కూరగాయలు
  • భారతీయ టీవీ ఛానెళ్లు
  • సినిమాలు
  • భారత్‌కు ప్రయాణాలు
  • భారత్‌లో తయారయ్యే టైర్లు
  • కంప్యూటర్లు
ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

'భారత్‌ నుంచి నీళ్లను తీసుకోవద్దు, ఉర్దూ మాట్లాడొద్దు'

#BoycottIndianProdcuts హ్యాష్‌ట్యాగ్‌తో పాకిస్తానీ సోషల్ మీడియా వినియోగదారులు పెడుతున్న పోస్టులకు, భారత నెటిజన్లు అదే స్థాయిలో కౌంటర్లు విసురుతున్నారు.

"మీరు నిజంగా భారత వస్తువులను బహిష్కరించాలనుకుంటే, ముందుగా భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు వచ్చే నీటిని బహిష్కరించండి" అంటూ అనిల్ పాటిల్ అనే భారత ట్విటర్ యూజర్ రాశారు.

ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

"కశ్మీర్ మాది. కశ్మీరీలు మా ప్రజలు. మీరు భారత వస్తువులను బహిష్కరించాలనుకుంటే, భారత్‌లో మూలాలు ఉన్న ఉర్దూ భాషను కూడా బహిష్కరించండి. మీరు నిత్యం భారత్‌ గురించే మాట్లాడతారు ఎందుకు? ముందు మీ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోండి" అంటూ సంధ్య ట్వీట్ చేశారు.

ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశం గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంటులోనూ మాట్లాడారు.

కశ్మీరీలకు మద్దతుగా భారత్‌కు వ్యతిరేకంగా గళమెత్తేందుకు పాకిస్తానీ పౌరులు రోజూ కనీసం అరగంట సమయం వెచ్చించాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

అదే సమయంలో, పాకిస్తాన్ తీరుపట్ల భారత రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... "ఒకవేళ పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాత్రమే జరుగుతాయి" అని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో హింసకు పాకిస్తానే ఆజ్యం పోస్తోందని ఆయన ఆరోపించారు.

"చాలా విషయాలలో ప్రభుత్వంతో విభేదిస్తాను. కానీ, నేను ఈ విషయాన్ని స్పష్టం చెబుతున్నాను: కశ్మీర్ అనేది భారత అంతర్గత సమస్య. ఇందులో పాకిస్తాన్‌ లేదా మరే ఇతర దేశమూ జోక్యం చేసుకునేందుకు స్థానం లేదు" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)