కశ్మీర్‌పై పాకిస్తాన్ వాదనను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) వింటుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియా పిళ్లై
- హోదా, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల అంశాల్లో న్యాయవాది, బీబీసీ కోసం
కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను ఆశ్రయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పాకిస్తాన్ బహిరంగంగా సంకేతాలు ఇస్తోంది.
కశ్మీర్‌కు సంబంధించి ఐసీజేకు వెళ్లడానికి పాకిస్తాన్ చెబుతున్నట్లుగా భావిస్తున్న ప్రధాన కారణాలివే...
- భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి, రాజ్యాంగపరంగా కశ్మీర్‌కు దక్కిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం.
- ఆ తర్వాత కశ్మీర్‌కు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా సమాచార వ్యవస్థను కట్ చేయడం.
- కశ్మీర్ లోయ నుంచి చాలా తక్కువ వివరాలు మాత్రమే బయటి ప్రపంచాన్ని చేరడం.
ఐసీజేకు రావచ్చని భావిస్తున్న కేసు గురించి ప్రస్తుతం కొన్ని వివరాలు అందుతున్నాయి. దానిపై మాట్లాడుకోడానికి ముందు, దానితో సంబంధమున్న కొన్ని అంశాల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, ICJ/ WEBSITE
ఐసీజే విచారణ
ముందుగా, అసలు ఈ న్యాయస్థానానికి ఎవరు వెళ్లవచ్చు, వెళ్లాలంటే దానికి ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి.
ఐసీజే ఒక అంతర్జాతీయ న్యాయస్థానం. అంటే ఇది దేశాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరిస్తుందని దాని పేరును బట్టే తెలుస్తుంది. అంటే ఒక దేశం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినపుడు మరో దేశం దానిని ఈ కోర్టు దృష్టికి తీసుకురావచ్చు.
కానీ, ఇది మానవహక్కులకు సంబంధించిన కోర్టు కాదు. అంటే వ్యక్తిగతంగా ఎవరూ ఐసీజేను ఆశ్రయించడం సాధ్యం కాదు. కేవలం దేశాలు మాత్రమే ఆ పనిచేయగలవు.
ఒక కేసుపై ఐసీజేలో విచారణలు జరిగే ముందు, ఎన్నో దశలు ఉంటాయి. వాటిలో మొదటిది.. అది అంతర్జాతీయ న్యాయస్థానం అధికార పరిధిలో ఉందా అనేది చూడాలి.
అంటే ఐసీజేకు ఆ కేసును విచారించే సామర్థ్యం, పరిధి ఉన్నాయో లేదో చూడాలి. అది ఎలా జరగచ్చు అనే దానికి సాధారణంగా రెండు మార్గాలు ఉంటాయి.
మొదటిది అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్న తప్పనిసరి అధికార పరిధి. ఇది చట్టంలోని ఆర్టికల్ 36(2) కింద ఉంటుంది. అంటే వివాదం రెండు దేశాల మధ్య ఏర్పడితే, ఆ రెండూ ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
అయితే ఈ ఆర్టికల్‌పై భారత్, పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అంటే, అవి కోర్టు జోక్యాన్ని ఆమోదిస్తే తప్ప, వాటి మధ్య ఉన్న వివాదాన్ని న్యాయస్థానం పరిష్కరించడం సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీజేకు వెళ్లే రెండో పద్ధతిలో, చట్టంలోని ఆర్టికల్ 36(1)కు అనుగుణంగా ఒక నిర్దిష్ట ఒప్పందాన్ని ఉల్లంఘించినపుడు, అది ఆ వివాదాన్ని పరిష్కరించాల్సింది అంతర్జాతీయ న్యాయస్థానమే అనేది తప్పక సూచిస్తుంది.
జాధవ్ కేసులో భారత అధికారులు ఈ రెండో పద్ధతినే ఉపయోగించారు. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్‌కు పాకిస్తాన్ కాన్సులర్ సదుపాయం కల్పించకపోవడంతో భారత్ ఐసీజేను ఆశ్రయించింది.
ఆర్టికల్ 36 కింద ఉన్న మొదటి మార్గం ప్రకారం ఐసీజే తప్పనిసరి అధికార పరిధిని భారతదేశం అంగీకరించే అవకాశం లేదు.
అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనే మార్గంలోనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది.
అలాంటప్పుడు పాకిస్తాన్ ఈ కేసుకు ఏ ఒప్పందం ఎంచుకుంటుంది అనేది వేచిచూడాలి.
ఇటీవలి జాధవ్ కేసునే కాకుండా, గత చరిత్రను తిరగేస్తే.. ఇంతకు ముందు కూడా ఐసీజేలో భారత్-పాక్ మధ్య వాదనలు జరిగాయి.
ఐసీఏఓ కౌన్సిల్ (భారత్-పాకిస్తాన్ మధ్య) అధికార పరిధి, యుద్ధ ఖైదీల విచారణ (భారత్-పాకిస్తాన్ మధ్య)కు సంబంధించిన వివాదాలను పాకిస్తాన్ విత్‌డ్రా చేసుకోవడంతో ఈ రెండు కేసులు ప్రాథమిక దశను దాటి వెళ్లలేదు.
1999 ఆగస్టు 10న పాక్ విమానాన్ని భారత మిగ్-21 కూల్చేసిన ఘటన ఐసీజే అధికార పరిధిలో లేనట్లు గుర్తించడంతో ఆ విచారణ రద్దైంది.

ఫొటో సోర్స్, Reuters
కుల్‌భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే తీర్పు ఇచ్చిన దాదాపు నెలకే, కొత్త కేసుగా చెబుతున్న ఇది బయటికొచ్చింది. 2019 జులై 17న జాధవ్ కేసులో కోర్టు నిర్ణయం భారత్‌కు అనుకూలంగా వచ్చింది.
అప్పుడు పాకిస్తాన్ మొదట్లో తను కోర్టు ఆదేశాలకు లోబడి ఉంటానని సూచించింది. కానీ ప్రస్తుత సంక్షోభంతో ఆ కేసును ఇప్పుడు పక్కకుపెట్టినట్లు కనిపిస్తోంది.
ఐసీజేను సంప్రదించడంలో చిక్కులు
ఐసీజేను సంప్రదించడంలో న్యాయపరమైన పర్యవసానాలు, వాటితోపాటు ఈ న్యాయపరమైన చర్యల వల్ల వచ్చే అంతర్జాతీయ చిక్కులు కూడా ఉన్నాయి.
న్యాయపరంగా చూస్తే, ఐసీజేను ఆశ్రయించాలంటే పైన సూచించిన ప్రత్యేక పద్ధతుల ఆధారంగానే వెళ్లాలి.
పాకిస్తాన్ ఇక్కడ ఏ వాదన వినిపించబోతోందో ఇంకా బయటపెట్టకపోయినా, అది ఆ ప్రాంతంలోని మానవ హక్కుల ఉల్లంఘన, దేశాలపై అంతర్జాతీయ చట్టాల బాధ్యతలను బట్టి ఉంటుంది.
అక్కడ సమాచార వ్యవస్థను స్తంభింపజేయడం, వేల మందిని నిర్బంధించడం లాంటి చర్యలు కొనసాగినంతవరకూ, వాటితోపాటు ఉల్లంఘన ఆరోపణలు ఉన్నంతవరకూ ఈ కేసు బలంగా ఉంటుంది.
చివరకు, తమ అధికార పరిధిలో లేదని కోర్టు ఇందులో జోక్యం చేసుకోడానికి నిరాకరించినా, ఐసీజేకు వెళ్లడం అనేది రెండు దేశాల మధ్య వివాదం మరింత రాజుకునేలా చేస్తుంది.

ఫొటో సోర్స్, ICJ
అందరి దృష్టి రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ శాంతిభద్రతలపై ఉన్నప్పుడు, కశ్మీర్‌లోని సామాన్యుల పరిస్థితిపై దృష్టి పెట్టడం సాధ్యం కాదు.
గత రెండేళ్లలో మొట్ట మొదటిసారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ హైకమిషనర్ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై నివేదికలు జారీ చేశారు.
ప్రస్తుతం కశ్మీర్‌లోని పరిస్థితి గురించి ఎన్నో అంతర్జాతీయ వేదికలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కొన్నిరోజుల క్రితం ఒక రహస్య సమావేశం నిర్వహించింది. ఇది తర్వాత అధికార చర్చగా మారలేదు.
ఏదేమైనా, ఇప్పటివరకూ ఇది ఒక ముఖ్యమైన అడుగే, ఎందుకంటే ఈ ప్రాంతంపై చర్చలు జరిగి 40 ఏళ్లకు పైనే అయ్యింది.
మొత్తానికి, ఐసీజే కేసు అధికార పరిధి దాటిందా, అనేదానికి సంబంధం లేకుండా ఇది దానికదే విస్తరించడం గమనార్హం.
దీనిని అంతర్జాతీయీకరణ చేసే చర్యలు కూడా కొనసాగుతూ, హక్కుల ఉల్లంఘన జరగచ్చనే ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో, ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా ఉండొచ్చు.
(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం)
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం"
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








