కశ్మీర్: మోదీ చారిత్రక తప్పిదం చేశారు.. కశ్మీర్ కోసం ఎంత వరకైనా వెళ్తాం- పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక తప్పిదం చేశారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆరోపించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయాల వల్ల మోదీ ఈ అంశంపై పాకిస్తాన్‌తో చర్చలకు రాకుండా వెనకడుగు వేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని ఆర్‌ఎస్ఎస్ యత్నిస్తోందని ఆరోపించారు.
కశ్మీర్‌పై చర్చలు జరిపేందుకు భారత్ వెనకాడుతోందని, ఇకపై భారత్‌తో పాకిస్తాన్ చర్చలు జరపడంలో అర్థం లేదని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
మోదీ చేసిన తప్పిదం వల్ల కశ్మీరీల స్వాతంత్ర్య సాధనకు ఒక పెద్ద అవకాశం లభించిందని పాక్ ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ తాజా చర్యల వల్ల కశ్మీర్ అంతర్జాతీయ అంశంగా మారిందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కశ్మీరీలకు సాయం చేస్తుందా లేదా అని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
కశ్మీర్ వివాదం యుద్ధం దిశగా సాగితే, ఉభయ దేశాలకూ (పాకిస్తాన్, భారత్‌లకు) అణ్వస్త్రాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
అణు యుద్ధంలో ఎవ్వరూ విజేతగా నిలవరని ఆయన చెప్పారు. అణు యుద్ధం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని తెలిపారు.
ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలకు (సూపర్ పవర్స్‌కు) బృహత్తర బాధ్యత ఉందని, ఆ దేశాలు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా పాకిస్తాన్ ఎంతవరకైనా వెళ్తుందని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చడంలో తాము విజయవంతమయ్యామని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తాము ప్రపంచ దేశాల నాయకులతో, దౌత్యవేత్తలతో మాట్లాడామని తెలిపారు.
1965 తర్వాత తొలిసారిగా కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశం నిర్వహించిందని పాకిస్తాన్ ప్రధాని ప్రస్తావించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ అంశంపై వార్తాకథనాలు అందిస్తోందన్నారు.
కశ్మీరీలు కష్టంలో ఉన్నారని, వారికి తాము అండగా నిలవాల్సి ఉందని ఆయన చెప్పారు. "నేను స్వయంగా కశ్మీర్ రాయబారినై అక్కడి ప్రజల గళం ప్రపంచానికి వినిపిస్తా" అని ప్రకటించారు.
సెప్టెంబరు 27న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో తాను ప్రసంగిస్తానని, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రముఖంగా ప్రస్తావిస్తానని పాకిస్తాన్ ప్రధాని చెప్పారు.
ప్రపంచంలోని ముస్లిం పాలకులు ఇప్పుడు తమకు మద్దతు ఇవ్వకపోయినా, భవిష్యత్తులో తమతో కలసి వస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు.
ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలకు, భారత రాజ్యాంగానికి, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తోందని పాకిస్తాన్ ప్రధాని ఆరోపించారు. భారత్‌లో ప్రభుత్వం లౌకికవాదానికి తిలోదకాలు ఇచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- నాజీల కాలం నాటి మానవ శరీర నిర్మాణ శాస్త్ర గ్రంథం వెనుక ఉన్న రక్తసిక్త చరిత్ర ఏంటి...
- ’అణ్వస్త్ర’ క్షిపణిని పరీక్షించిన అమెరికా.. సైనిక ఉద్రిక్తతలను పెంచుతోందన్న రష్యా
- కశ్మీర్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత హింస
- ‘అమర్నాథ్ యాత్రికులంతా తక్షణం వెనక్కు వెళ్లిపోండి’
- కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో 1992లో ఎగిరిన భారత జెండా.. అప్పడు మోదీ పాత్ర ఏంటి
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- చిదంబరం అరెస్టుకు.. తొమ్మిదేళ్ల కిందట అమిత్‌షా అరెస్టుకు సంబంధమేమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








