కశ్మీర్: కరకుదనం చాలు.. ఇక కాస్త కరుణ చూపాలి: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బర్ఖా దత్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
నేను గత మూడు వారాలుగా ఎప్పుడు శ్రీనగర్ వెళ్లినా, విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు సిబ్బంది ప్రతిసారీ ఏమాత్రం ఆలోచించకుండా "ఇక మీరు మీ మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చు" అనే రోబోటిక్ లైన్స్ పదే పదే వినిపిస్తూనే ఉన్నారు.
స్పీకర్లోంచి ఆ మాటలు రాగానే విమానంలో ఉన్న యాత్రికులందరూ నవ్వుకుంటున్నారు. వాళ్లలో ఎక్కువగా జర్నలిస్టులే ఉంటున్నారు. లేదంటే చాలా రోజులుగా కుటుంబాలతో మాట్లాడలేకపోవడంతో ఇంటికి చేరుకుంటున్న కశ్మీరీలు ఉంటారు.
జమ్ము-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశారనే ఆదేశాల తర్వాత అంటే గత మూడు వారాలకు పైగా మొబైల్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌బాండ్ సేవలు ఆగిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ ఫోన్లు కాస్త ఉపశమనం ఇచ్చాయి. కానీ కశ్మీర్ లోయలో కమ్యూనికేషన్ వ్యవస్థపై ఉన్న ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు ఫ్లైట్‌లో ఆ అనౌన్స్‌మెంట్(ఇక మీరు మీ మొబైల్ ఫోన్స్ ఉపయోగించవచ్చు) నవ్వు తెప్పిస్తుంది.
కశ్మీర్‌లో కమ్యూనికేషన్ల వ్యవస్థపై ఆంక్షల ప్రభావం వల్ల పిల్లలు అమ్మనాన్నలతో, భర్త భార్యతో, అనారోగ్యంతో ఉన్నవారు తమ డాక్టర్లను వెంటనే సంప్రదించలేకపోతున్నారు.
బుధవారం జమ్ము-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ మీడియా సమావేశంలో చెప్పినవి నాకు విమానంలో ఆ అనౌన్స్‌మెంట్‌ను గుర్తుచేశాయి. ఎందుకంటే మలిక్ మీడియా సమావేశం పద్ధతి ఫ్లైట్‌లో సిబ్బంది చెప్పినట్టే ఆ ప్రకటనకు దగ్గరగా ఆయనకు కూడా అక్కడి పరిస్థితి గురించి ఏదీ తెలీనట్టు, పనికిరానిదిలా అనిపించింది.
ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన చేస్తుందని అందరూ ఎదురుచూశారు.

ఫొటో సోర్స్, Getty Images
పెద్ద సంఖ్యలో అరెస్టులు ఎందుకు
భారత ప్రభుత్వం గత చాలా రోజులుగా కఠిన నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేసే సామర్థ్యాన్ని ఇప్పటికే చూపించింది. అందుకే, ప్రభుత్వం తీరు ఈసారీ కాస్త సున్నితంగా ఉంటుందేమో అనిపించింది.
కానీ జరిగిందేంటి. దానికి బదులు రెండుమూడు నెలల్లో 50 వేల ఖాళీ పదవులు భర్తీ చేస్తామని ఒక చిన్న ప్రకటన చేశారు. దానితోపాటు గవర్నర్ చాలా ఉదారంగా "జైలుకెళ్లడం దేశ రాజకీయ ఆరోగ్యానికి మంచిదే" అని భారతీయులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆయన దానికి ఉదాహరణ కూడా చెబుతూ, "నేను 30 సార్లు జైలుకు వెళ్లా"నని చెప్పారు. అంతే కాదు దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని, "జైలుకెళ్లిన వారు మంచి నేతలవుతారని" కూడా చెప్పారు.
ఇది ఒక తెలితక్కువ వాదన. ప్రభుత్వం ఇలాంటి వాదనలో ఒక బలహీనమైన లింకు లోయలో అరెస్టులపై ఉన్న అస్పష్టతే. శ్రీనగర్‌లో ఒక అధికారి నాతో "సుమారు 4 వేల మంది అరెస్ట్ అయ్యారు. కానీ ప్రభుత్వం వారి పేర్లతో ఎలాంటి అధికారిక జాబితాను పబ్లిక్ ప్లేసుల్లో ఉంచలేదని" చెప్పారు.
అంతకంటే ఘోరం ఏంటంటే.. భారత్‌కు అండగా నిలిచిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలైనా, వేర్పాటువాదులైనా, రాళ్లు రువ్వే మూకలైనా, స్థానిక పార్టీ కార్యకర్తలైనా అందరినీ ఒకే దగ్గర ఉంచారు.
భారత జెండా కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన వారిని జైల్లో వేయడం న్యాయమే అని ఎలా అనగలం.
ఒక వేళ, వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తారు, లేదా హింసను ప్రేరేపించవచ్చు అని అనుకుంటుంటే, వారు నిజంగా అలా చేసినప్పుడు ప్రత్యేక ఆరోపణలపై వాకిని అరెస్టు చేయండి. వాళ్లను ఇప్పుడెందుకు అరెస్టు చేశారు. దీనిలో పూర్తి అస్పష్టత ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
2016 తప్పు మళ్లీ చేయద్దంటున్న ప్రభుత్వం
మొదటి రోజు నుంచీ ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని శ్రీనగర్‌లోని రాష్ర ప్రభుత్వ అధికారులు నాకు చెప్పారు. 2016లో బుర్హాన్ వానీ భద్రతా దళాల ఆపరేషన్లో చనిపోయినప్పుడు తాము చేసిన తప్పిదాల నుంచి పాఠం నేర్చుకున్నామని వారు చెప్పాలనుకున్నారు.
అప్పుడు రెండ్రోజుల్లోనే 22 మంది చనిపోయారు. ఒకే వారంలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ భద్రతాదళాలు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల్లో జరిగాయి.
ఆ తప్పు మళ్లీ జరక్కూడదని అనుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. అది సమంజసమే. దాంతో, జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయాలనే నిర్ణయం జరిగిన వెంటనే ఇంటర్నెట్ ఆపేయడానికి అంత ప్రాధాన్యం ఎందుకిచ్చారు అనే విషయం కూడా అర్థమైంది.
టెక్నాలజీ సాయంతో ప్రాపగాండా జరిగుతున్న ఈ నవీన యుగంలో కొత్తతరం మిలిటెంట్లు సోషల్ మీడియానే ఆయుధంగా మార్చుకున్నారు. అలా చేసినవారిలో బుర్హాన్ వానీ కూడా ఉన్నాడు. అతడు సోషల్ మీడియా ద్వారా చాందసవాదాన్ని, ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసేవాడు. ప్రజలు హింసాత్మక ఘటనలకు దిగేలా రెచ్చగొట్టేవాడు.
ఏదైనా నిర్ణయం తీసుకునేముందు భద్రత గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం ఎవరైనా అంగీకరిస్తారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్న మొదటి కొన్నిరోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థకు కళ్లెం వేయడంలో లాజిక్ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీరీలను రెచ్చగొడుతున్న ఆంక్షలు
అయితే, ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల పూర్తిగా వ్యతిరేక ప్రభావం పడుతోంది. స్థానికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతున్నారు. చాలాసార్లు వాళ్లు ప్రభుత్వ హెల్ప్‌లైన్ కోసం గంటలు గంటలు క్యూలో నిలబడాల్సి వస్తోంది. అప్పటికీ చాలా మంది తమ పిల్లలతో, అమ్మనాన్నలతో మాట్లాడలేకపోతున్నారు.
చాలాసార్లు వారికి డాక్టర్ల సలహాల అవసరం కూడా ఉంటోంది. కానీ ఆ సాయం అందేలోపే బాగా ఆలస్యం అయిపోతోంది. ఇదంతా ప్రజల్లో కోపాన్ని పెంచుతోంది. కానీ, ఈ కోపానికి 370తో ఎలాంటి సంబంధం లేదు.
అంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించినపుడు, ఇంటర్నెట్ ఆగిపోయినపుడు ప్రభుత్వం ప్రజలను సంప్రదించలేదు. అధికారిక సమాచారాన్ని వారి వరకూ చేర్చలేనప్పుడు పుట్టే వదంతులు కూడా ఇంటర్నెట్ ద్వారా ఎంత వేగంగా వ్యాపిస్తాయో అలాగే అందరికీ చేరుతాయి.
ఈ మధ్య కశ్మీరీలు చాలా భయపడిపోయి ఉన్నారు. అంతకంతకూ ఘోరమవుతున్న పరిస్థితులు చూసి ఆందోళనకు గురవుతున్నారు. అలా ఎందుకంటే, వారితో స్పష్టమైన, పారదర్శక సంప్రదింపులు జరగడం లేదు. కచ్చితమైన వివరాలను వారికి అందించడం లేదు.
ఈ సమాచార అంధకారం వారి భావనలను రెచ్చగొడుతోంది. ప్రశాంతత ఇవ్వడం లేదు. అలాంటప్పుడు జాతీయ భద్రతా లక్ష్యం చాలా కష్టంగా పూర్తవుతోంది. ఇప్పుడు ఆర్టికల్ 370ని తొలగించి మూడు వారాలు దాటింది. ఇంకా, కమ్యూనికేషన్ వ్యవస్థపై ఉన్న ఈ ఆంక్షలను కొనసాగించడం పనికిరాని చర్యే అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకోవచ్చు
రాబోయే కొన్ని వారాలు కశ్మీర్ లోయకు చాలా సున్నితం, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. దానికి అంతర్గత, బయటి కోణాలు రెండున్నాయి. లోపలి కోణం: ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. బయటి కోణం: పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంలో ప్రపంచ జోక్యం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో రెండు సార్లు అణు యుద్ధం గురించి కూడా చెప్పారు. అయితే ఇప్పటివరకూ పాకిస్తాన్ ఈ విషయంలో విఫలమవుతూ వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తామన్నారు. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని స్పష్టంగా తిరస్కరించడంలో సఫలమయ్యారు.
అంతేకాదు, ఇటీవల బహ్రెయిన్, యూఏఈలో పర్యటించిన పీఎం మోదీ పాకిస్తాన్‌కు కశ్మీర్ విషయంలో ముస్లిం దేశాలు జోక్యం చేసుకోవనే సందేశాన్ని ఇచ్చారు.
అంటే దానర్థం, పాకిస్తాన్‌కు చిరపరిచితమైన 'పరోక్ష యుద్ధం' ఎదుర్కోడానికి భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
కరకుదనం చాలు, కరుణ చూపాలి
ముందు ముందు రోజుల్లో, ఉరి, పుల్వామాలో చేసినట్లే పాకిస్తాన్ మద్దతు ఉన్న మిలిటెంటు గ్రూపులు భారత భద్రతా స్థావరాలను టార్గెట్ చేసుకోవచ్చని కశ్మీర్‌లోని సైనికాధికారులు చెబుతున్నారు.
ఇలాంటి సున్నిత సమయంలో భారతీయులు పరస్పరం గొడవలు పడకుండా ఉండాలి. కానీ, గవర్నర్ లాంటి సున్నితమైన పదవిలో ఉన్న సత్యపాల్ మలిక్ లాంటి వారి నోటి వెంట "ఆర్టికల్ 370ని సమర్థించిన వారిని, చెప్పులతో కొడతాం" లాంటి మాటలు రావడం చాలా నిరుత్సాహపరిచాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దృష్టిలో పెట్టుకునే బహుశా ఆయన ఈ ప్రకటన చేసుండచ్చు. మోదీ ప్రభుత్వం కశ్మీర్ విధానాన్ని రాహుల్ గాంధీ విమర్శించారు. దానిని పాకిస్తాన్ వెంటనే అందుకుంది.
అయితే గవర్నర్ చేసిన ఈ ప్రకటన ప్రభుత్వ నిర్ణయాన్ని శాంతిపూర్వకంగా వ్యతిరేకించడానికి బహుశా అరెస్టులో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ నేతలకు లేదా భారతీయుడినికి ఎలాంటి దారీ చూపించదు. ఆయన ఎలాంటి భాష ఉపయోగించారో, దానిని బహుశా సమర్థించుకోవచ్చు కూడా.
భద్రతాదళాలకు ఇది కచ్చితంగా ఒక పెద్ద సవాలే. కానీ ప్రజల భావనలను గౌరవించడం కూడా అవసరమే. మోదీ ప్రభుత్వం కశ్మీర్‌పై అంతర్జాతీయ చర్చలో ఒక పెద్ద భౌగోళిక రాజకీయ విజయం సాధించింది.
ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త అడుగు వరకూ వెళ్లడం అవసరం. మనం ప్రభుత్వం కరకుదనాన్ని చూశాం. ఇప్పుడు వారు మృదువుగా స్పర్శించాల్సిన అవసరం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
- హ్యూమన్ రైట్స్ వాచ్: కశ్మీర్‌లో ఇంటర్నెట్, ఫోన్ సేవలను భారత్ పునరుద్ధరించాలి
- కశ్మీర్‌పై ట్రంప్ ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు?
- "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం"
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








