ఫ్రీదా బేడీ: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన బ్రిటిష్ మహిళ

ఫ్రీదా బేడీ

ఫ్రీదా బేడీ అసాధారణ జీవితం గడిపారు. పుట్టింది ఇంగ్లండ్‌లోని ఒక చిన్న పట్టణంలో. ప్రేమ కోసం ఇండియాకు వచ్చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో మమేకమయ్యారు.

ఫ్రీదా జీవితచరిత్రను ఆండ్రూ వైట్‌హెడ్ రాశారు. ఆమె అద్భుత గాథను ఆయన చెప్తున్నారు.

''ముద్రలు, రంగులు, పక్షపాతాల కన్నా లోతైన అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రేమ.''

ఇవి ఫ్రీదా బేడీ మాటలు. ఆమె ఒక ఇంగ్లిష్ మహిళ. ఒక భారతీయ సిక్కును వివాహం చేసుకున్నారు. అందుకోసం వివక్షను అధిగమించారు. భార్యగా మహిళ పాత్ర గురించిన భారతీయ అభిప్రాయాలను సవాల్ చేశారు.

ఫ్రీదా బాయ్‌ఫ్రెండ్ బాబా ప్యారే లాల్ బేడీ. అతడిని ఆయన మిత్రులు బీపీఎల్ అని పిలుస్తారు. ఫ్రీదా, బీపీఎల్‌లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు. అక్కడే వారిద్దరికీ పరిచయం.

అవి 1930వ దశకం తొలి రోజులు. అప్పటికి వేర్వేరు జాతుల వారి మధ్య ప్రేమ చాలా చాలా అరుదు. ఫ్రీదా వంటి నేపథ్యమున్న ఒక యువతి ఒక అత్యున్నత విశ్వవిద్యాలయంలో స్థానం పొందటం కూడా అంతే అరుదు.

ఆమె ఇంగ్లండ్‌లోని ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో గల డెర్బీ పట్టణంలో పుట్టారు. అక్కడ ఆమె తండ్రి నగలు, వాచీల మరమ్మతు చేసే దుకాణం నడిపేవారు.

ఫ్రీదాకు తన తండ్రి జ్ఞాపకం లేదు. ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేసినట్లు రికార్డుల్లో ఉంది. మెషీన్ గన్ కార్ప్స్‌లో చేరి యుద్ధానికి వెళ్లాడు. ఆ విభాగానికి 'సూయిసైడ్ క్లబ్' అని పేరు. అంతటి స్థాయిలో మరణాలు ఉండేవి. ఆయన ఉత్తర ఫ్రాన్స్‌లో చనిపోయాడు. అప్పుడు ఫ్రీదా వయసు కేవలం ఏడేళ్లు.

''ఆ మరణం నా చిన్నతనం మొత్తాన్నీ చీకటితో నింపింది'' అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె రాజకీయ ప్రాధాన్యతలను అది ప్రేరేపించింది. ఆమెను ఆధ్యాత్మిక శోధనకూ ప్రేరేపించింది.

ఆక్స్‌ఫర్డ్‌లో గడిపిన సంవత్సరాలు.. ''ప్రపంచ ద్వారాలు తెరుచుకోవటం'' వంటిదని ఫ్రీదా అభివర్ణించారు.

ప్రపంచ సంక్షోభం, నిరుద్యోగంతో పాటు.. ఫాసిజం పేట్రేగిన కాలంలో విద్యార్థులుగా ఉన్న ''గ్రేట్ డిప్రెషన్'' తరం ఆమెది.

కాలేజీలో స్వభావ రీత్యా విప్లవాత్మక యువతులతో ఆమె స్నేహం బలీయమైనది. వారితో కలిసి లేబర్ క్లబ్, కమ్యూనిస్ట్ అక్టోబర్ క్లబ్ సమావేశాలకు వెళ్లేది.

బీపీఎల్ బేడీ, ఫ్రీదా బేడీ
ఫొటో క్యాప్షన్, ఫ్రీదా, బీపీఎల్‌లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు.. అక్కడి వారి పరిచయం ప్రేమగా మారింది

సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి గురించి ఆసక్తి, వారి పట్ల సానుభూతితో.. వారం వారం జరిగే ఆక్స్‌ఫర్డ్ మజ్లిస్ సమావేశాలకు కూడా వెళ్లేది. ఆ యూనివర్సిటీలో తక్కువ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో కొందరు రాడికల్స్ తమ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు పలికేవారు.

వారిలో తరచుగా కనిపించే అందమైన, ఉత్సాహవంతమైన ఒక యువకుడు బీపీఎల్ బేడీ. అతడితో ఫ్రీదా స్నేహం మేధో భాగస్వామ్యంగా అభివృద్ధి చెందింది. కొద్ది నెలల్లోనే ఫ్రీదా, బీపీఎల్‌లు ఒక జంట అయ్యారు.

1930ల ఆరంభంలో ఆక్స్‌ఫర్డ్‌లో మహిళా కాలేజీలు సెక్స్‌ను నిరోధించే విషయంలో చాలా ఆవేశపూరితంగా ఉండేవి. ఒక యువతి గదికి ఒక యువకుడు టీ కోసం వస్తే.. వారితో పాటు ఒక సంరక్షకుడు ఉండాలి. ఆ గది తలుపు బార్లా తెరిచి ఉంచాలి. మంచాన్ని కారిడార్‌లోకి మార్చాలి.

బీపీఎల్ బేడీతో ఫ్రీదా సంబంధాన్ని తెంచటానికి ఆమె చదువుతున్న కాలేజీ శాయశక్తులా ప్రయత్నించింది. సంరక్షకుడి తోడు లేకుండా బీపీఎల్‌ను కలిసినందుకు ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అది జాతి వివక్ష అని ఆమె అంటారు.

అయితే.. ఆమె స్నేహితులు, సహ విద్యార్థులు ఆమెకు అండగా నిలిచారు. ఫ్రీదా తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాలని అనుకుంటున్నట్లు వెల్లడించినపుడు ఆమె స్నేహితురాలు బార్బరా కాసిల్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. బార్బరా అనంతర కాలంలో ఆ కాలపు శక్తివంతమైన బ్రిటిష్ మహిళా రాజకీయవేత్తగా ఎదిగారు. ''చాలా మంచిది. ఓ చిన్నపట్టణంలో హౌస్‌వైఫ్‌గా మారిపోవు'' అని ఆమె తన స్నేహితురాలిని ప్రోత్సహించారు.

కానీ ఫ్రీదా తల్లి ఈ పరిణామాన్ని అంగీకరించలేదు. ఆమె కుటుంబం గట్టిగా వ్యతిరేకించింది. అయితే బీపీఎల్ డెర్బీ వెళ్లి వారిని ఒప్పించారు.

తమ ఎంగేజ్‌మెంట్ ఆక్స్‌ఫర్డ్‌లో 'ఓ చిన్న సంచలనం' సృష్టించిందని ఫ్రీదా చెప్తారు. నిజానికి అది చిన్న సంచలనమేం కాదు. ఒక భారతీయ సహ విద్యార్థిని పెళ్లాడిన తొలి ఆక్స్‌ఫర్డ్ మహిళా గ్రాడ్యుయేట్ ఆమె. కొందరు తమ వ్యతిరేకతను బాహాటంగానే వ్యక్తంచేశారు. వారి వివాహ కార్యక్రమాన్ని నిర్వహించిన రిజిస్ట్రార్.. ఆ జంటతో షేక్ హ్యాండ్ చేయటానికి నిరాకరించారు.

పెళ్లయిన క్షణం నుంచీ ఫ్రీదా తనను తాను భారతీయురాలిగా పరిగణించారు. తరచుగా భారతీయ దుస్తులు ధరించేవారు. ఓ ఏడాది తర్వాత ఫ్రీదా, ఆమె భర్త బీపీఎల్, వారి నాలుగు నెలల కుమారుడు రంగా.. ముగ్గురూ ఇటలీలోని ట్రియెస్ట్ నుంచి ఓడలో బొంబాయి (నేటి ముంబై)కి బయలుదేరారు. అది రెండు వారాల ప్రయాణం.

''నేను నా చిన్నారి కొడుకుకు పాలు ఇస్తున్నాను కాబట్టి నాకు తాగటానికి పాలు చాలా అవసరం. ఆ పాలు తెచ్చుకోవటం ఓ పీడకలగా ఉండేది'' అని ఫ్రీదా గుర్తుచేసుకున్నారు.

''ఓడలోని వంటగదుల్లో రాత్రిళ్లు వందలాది బొద్దింకలు బయటకురావటం నాకు ఇంకా గుర్తుంది. వాటి మధ్యనే నేను వెళ్లి పాలు తెచ్చుకోవటానికి ప్రయత్నించేదాన్ని'' అని చెప్పారు.

ఈ జంటను విప్లవకారులని, తమకు ఇబ్బందులు సృష్టించే అవకాశముందని.. బ్రిటిష్ అధికారులు అప్పటికే గుర్తించారు. విద్యార్థులుగా వారి ఉద్యమాలే అందుకు కారణం. వీరు బొంబాయిలో ఓడ దిగినపుడు.. వారి బ్యాగులు, సూట్‌కేసులను ఏడు గంటల పాటు సోదా చేశారు. వామపక్ష ప్రచార సాహిత్యం దొరుకుతుందేమోనని.

''చివరికి రంగా మీద ఉన్న చిన్నపాటి నాప్కిన్‌ను కూడా తీసి తనిఖీ చేశారు. ఎందుకంటే.. అందులో నేను ఏదైనా సందేశం తీసుకువస్తున్నారని వారు భావించారు'' అని ఫ్రీదా వివరించారు.

ఫ్రీదా వివాహానికి కీలక పరీక్ష ఇంకా ఎదురుకావాల్సి ఉంది. అది తన భారతీయ అత్తగారితో తొలి భేటీ. ఆమె వితంతువు. ఆ కుటుంబంలో భాబూజీ అని అందరూ పిలుచుకునే అధికారిణి. బొంబాయి నుంచి పంజాబ్‌లోని చిన్న నగరం కపుర్తల వెళ్లటానికి ఈ జంట రెండు రోజుల పాటు నిర్విరామంగా ప్రయాణించింది. అర్థరాత్రి అవుతుండగా తమ కుటుంబ నివాసానికి చేరుకున్నారు.

ఫ్రీదా ఓ తెల్లని కాటన్ చీర ధరించి ఉన్నారు. ''అవి ప్రయాణానికి తగిన దుస్తులు కావు. రంగాకు పాలు ఇవ్వటానికీ అది సౌకర్యవంతంగా లేదు'' అని ఆమె చెప్పారు.

బీపీఎల్ సంప్రదాయబద్ధమైన గౌరవసూచకంగా తన తల్లి పాదాలను తాకటానికి వంగారు. ''నేను ఆయనను అనుకరించి అలాగే చేశాను. కానీ కొంత వింతగా అనిపించింది'' అని ఫ్రీదా చెప్పారు. ''అయితే ఆమె కళ్లలో నీళ్లు నింపుకుని మమ్మల్ని చూసి నవ్వి.. మమ్మల్ని, మా చిన్నారిని తనివితీరా ఆలింగనం చేసుకున్నపుడు నా బిడియం మాయమైపోయింది'' అని వివరించారు.

తన కొత్త భారతీయ కుటుంబంతో కలిసిపోవాలని ఫ్రీదా ఎంత నిశ్చయంతో ఉన్నా కూడా.. ఆమె జీవన విధానం ఇక్కడి సంప్రదాయాలకు విరుద్ధమైనది.

బీపీఎల్ బేడీ తన రాజకీయ సిద్ధాంతం మేరకు.. తన కుటుంబ సంపదలో ఎటువంటి వాటా అవసరం లేదని తిరస్కరించారు. వారు లాహోర్‌లో ఇల్లు కట్టుకున్నారు.. కొన్ని పూరిళ్ల మధ్య. విద్యుత్ లేదు. నీటి సరఫరా లేదు. ఇంట్లో కొన్ని కోళ్లు, ఒక గేదెను పెంచుకున్నారు. అది ఫ్రీదా ఆశించిన జీవన విధానం కాదు. ఇంట్లో తన అత్తగారితో కలిసి ఉండటమనేదీ ఆమె ఊహించనిది.

''ఒక శ్వేతజాతి మహిళ.. ఒక సగటు భారతీయ కోడలిలా ఉండే ప్రయత్నం చేయటం నేను ఎక్కడా చూడలేదు'' అంటారు సోమ్ ఆనంద్. బేడీల పూరిళ్లను ఆయన తరచూ సందర్శిస్తుండేవారు.

''బేడీ భార్య ప్రతి రోజూ ఉదయాన్నే భాబూజీ పూరింటికి వచ్చేది.. ఆమె కాళ్లను తాకి వందనం చేయటానికి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఆ వృద్ధ తల్లి ఆలోచనలను ఆమె గౌరవించేది. ఆమె అత్తగారు కూడా అంతే పెద్ద మనసున్న మనిషి. ఆమె ఎంత సంప్రదాయవాది అయినా ఒక క్రిస్టియన్‌ని మారు మాట్లాడకుండా తన కుటుంబంలోకి ఆహ్వానించింది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫ్రీదా బేడీ కుటుంబం
ఫొటో క్యాప్షన్, ఫ్రీదా, బీపీఎల్‌లు 1947లో కశ్మీర్ వలస వచ్చారు.. అక్కడ రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నారు

రెండో ప్రపంచ యుద్ధం మొదలైనపుడు బ్రిటిష్ తరఫున భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి లాగుతుండటాన్ని బీపీఎల్, ఫ్రీదాలు ఇద్దరూ తీవ్రంగా ఆగ్రహించారు. పంజాబ్‌లో సైనికుల రిక్రూట్‌మెంట్‌ను బీపీఎల్ దెబ్బతీయకుండా నిరోధించటానికి అతడిని ఒక ఎడారి జైలులో నిర్బంధించారు. ఫ్రీదా తన మాతృభూమికి వ్యతిరేకంగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

ఆమె ఒక సత్యాగ్రహిగా స్వచ్ఛందంగా ఉద్యమించారు. అత్యవసర యుద్ధ కాల అధికారాలను ధిక్కరించటానికి స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ ఎంపిక చేసిన వారిలో ఆమె కూడా ఉన్నారు.

ఆమె తన భర్త స్వగ్రామం డేరా బాబా నానక్ వెళ్లారు. ''భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారే వరకూ సైన్యానికి సాయం చేయవద్దని ప్రజలను కోరటం ద్వారా చట్టాన్ని ఉల్లంఘిస్తాన''ని ప్రకటించారు.

ఒక శ్వేతజాతి మహిళ ఇటువంటి నిరసన చేపట్టటంతో ఎలా స్పందించాలో అధికారులకు తెలియలేదు. ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను హడావుడిగా ఆ గ్రామానికి పంపించారు. ఒక బ్రిటిష్ మహిళను భారతీయ పోలీసులు అరెస్ట్ చేయటం సరికాదని వారు భావించటమే దానికి కారణం.

ఫ్రీదాను అదే రోజు ఉదయం ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ విచారణ గురించి ఆమె ఇలా వివరించారు:

''అది 15 నిమిషాల్లో ముగిసింది. టేబుల్ అవతలి వైపున్న వ్యక్తి ఇంకా చాలా యుక్తవయస్కుడే. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నవాడిలా కనిపించాడు. అతడి ముఖం ఎరుపు రంగులో ఉంది.

''ఇది నీకు ఎంత ఇబ్బందికరంగా ఉందో నాకూ అంత ఇబ్బందికరంగానే ఉంది'' అని అతడు చిన్నగా అన్నాడు.

''విచారించకు. నాకేమాత్రం ఇబ్బందికరంగా లేదు.''

''బ్రిటిష్ మహిళకు ఇచ్చే ప్రత్యేకతలు మీరు కోరుకుంటున్నారా?''

''నన్ను భారతీయ మహిళగానే పరిగణించండి. అది నాకు చాలా సంతోషం.''

ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. కానీ దానితో పాటే కఠిన శ్రమ కూడా చేయాలని ఆదేశించటం కక్షపూరిత చర్య అని ఆమె భావిస్తుంటారు.

అయితే.. జైలులో తోటలను పర్యవేక్షించే పని ఆమెతో చేయించారు. ఆ జైలు.. రాజకీయ నేరాలకు కాకుండా ఇతర నేరాలకు శిక్షపడ్డ మహిళలను ఉంచే జైలు. వారిలో చాలా మంది తమను వేదిస్తున్న భర్తలను చంపినందుకు గాను జైలుపాలైన వారు. ఆ మహిళలే ఎక్కువ పనిచేసే వారు.

''భారతదేశానికి రావటం విధినిర్ణయం'' అని ఫ్రీదా ఉద్ఘాటిస్తారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు తెలుపుతూ స్వయంగా జైలుకు వెళ్లిన బ్రిటిష్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించటం కూడా విధినిర్ణయమే.

స్వాతంత్ర్యం తర్వాత ఫ్రీదా, బీపీఎల్ జంట కశ్మీర్‌కు వలస వెళ్లారు. స్వాతంత్ర్యానంతరం కూడా బేడీల రాజకీయ ప్రాధాన్యం కొనసాగింది. ఫ్రీదా వామపక్ష మహిళా సేనలో చేరారు. అక్కడ విప్లవ జాతీయవాదులతో కలిసి పనిచేశారు. వారు అనంతరం అధికారంలోకి వచ్చారు.

అయితే.. 1950ల్లో ఫ్రీదా జీవితం సంపూర్ణంగా మారిపోయింది. ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా బర్మా వెళ్లిన ఆమె తొలిసారిగా బౌద్ధమతం గురించి తెలుసుకున్నారు. ఎంతో ఆసక్తితో ఆ మతంలోకి మారారు.

ఫ్రీదా బేడీ
ఫొటో క్యాప్షన్, 1950ల్లో ఫ్రీదా బేడీ బౌద్ధ సన్యాసినిగా మారారు

1959లో చైనా అణచివేత నుంచి తప్పించుకోవటానికి వేలాది మంది టిబెటన్లు హిమాలయాల్లోకి పారిపోయినపుడు ఆ ''ధైర్యశాలులైన, అద్భుతమైన'' శరణార్థులకు సాయం చేయటానికి ఫ్రీదా అంకితమయ్యారు.

టిబెట్ ఆధ్యాత్మికతలో ఆమె మునిగిపోయారు.

ఒక తల్లిగా తన పాత్రను పూర్తిచేశానని ఆమె భావించిన తర్వాత (సినీ నటుడు కబీర్ బేడీ ఆమె ముగ్గురు కొడుకుల్లో ఒకరు).. ఆమె మరోసారి సంప్రదాయాన్ని బద్దలుకొట్టారు. టిబెటన్ బౌద్ధ సన్యాసినిగా మారారు.

ఆమె అరవై ఏళ్ల వయసులో బౌద్ధ ప్రబోధాలను ప్రచారం చేయటానికి అలుపులేకుండా ప్రయాణించారు. ఎన్నడూ పశ్చిమ దేశాల్లో నివసించటానికి తిరిగి వెళ్లలేదు.

''భారతదశం నా స్త్రీత్వం.. నా భార్యత్వం'' అని ఆమె ఒకసారి ప్రకటించారు. ''నేను కూడా 'ఇంగ్లండ్‌ పుట్టించిన, పెంచిన, అవగాహన కల్పించిన మట్టినే'. అయినప్పటికీ నేను భారతీయ పద్ధతిలో భారతీయ దుస్తుల్లో, భారతీయ భర్త, పిల్లలతో భారత గడ్డ మీద నివసిస్తున్నాను. కానీ.. నాకు, నేను కొత్తగా స్వీకరించిన నా దేశానికి మధ్య ఎటువంటి అవరోధాలు కానీ, తేడాలు కానీ ఉన్నట్లు నేను అనుకోను'' అని ఆమె ఒకసారి ప్రకటించారు.

ఫ్రీదా తన జీవితం యావత్తూ.. జాతి, మతం, దేశం, లింగం అనే అవరోధాలు తనను కట్టిపడేయకుండా ఉండేలా కృతనిశ్చయంతో పయనించారు.

సంప్రదాయాన్ని సవాలు చేయటం.. అంచనాలను బద్దలుకొట్టటం ఆమెకు సంతోషాన్నిచ్చేది. ఆమె కథను ఎంతో ఆసక్తికరంగా చేసేది ఇదే.

(ఆండ్రూ వైట్‌హెడ్ బీబీసీ ఇండియా మాజీ ప్రతినిధి. 'ద లైవ్స్ ఆఫ్ ఫ్రీదా: ద పొలిటికల్, స్పిరిట్యువల్ అండ్ పర్సనల్ జర్నీ ఆఫ్ ఫ్రీదా బేడీ' పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ సంస్థ ప్రచురించింది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)