బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ దేశానికి మంచిదేనా? భారత్‌లో ఒకే టైమ్‌జోన్ ఉండాలా?

భారతదేశం నమూనాలో గడియారాలు

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, తూర్పు భారతంలో సూర్యోదయం త్వరగా జరిగితే, పశ్చిమ భారతంలో చాలా ఆలస్యంగా జరుగుతుంది
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో ఉన్న టైమ్ జోన్ (కాలమానం) బ్రిటిష్ కాలం నుంచే అమల్లో ఉంది. దేశం మొత్తానికి ఒకే టైమ్ జోన్ అనేది ఏకత్వానికి ప్రతీకగా చాలామంది భావిస్తుంటారు. కానీ నిజంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్టీ) మంచి ఆలోచనేనా? అంటే కాదు అనే అంటున్నారు కొందరు నిపుణులు.

ఎందుకు?

భారతదేశంలో తూర్పు నుంచి పడమరకు ఉన్న దూరం దాదాపు 3000 కిలోమీటర్లు. అంటే ఇది 30 డిగ్రీల రేఖాంశాలు, అంటే రెండున్నర గంటలకు సమానం.

దేశ తూర్పు ప్రాంతంలో సూర్యుడు ఉదయించడానికి, పశ్చిమాన సూర్యోదయానికి మధ్య సమయంలో దాదాపు రెండున్నర గంటలు తేడా ఉంటోంది. అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా. పగటిపూట సూర్యుడి నుంచి వచ్చే సహజ వెలుగును, సూర్యరశ్మిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు భారత్‌లో కూడా రెండు టైమ్ జోన్లు ఉండాలనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. తూర్పున ఉన్న ప్రాంతాల్లో సూర్యాస్తమయం త్వరగా జరగడంతో అక్కడ నివసించేవారు ముందుగానే ఇళ్లలో దీపాలు వెలిగించుకోవాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా జరుగుతోంది.

సూర్యోదయం, అస్తమయాలు జీవక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. సాయంత్రం త్వరగా చీకటిగా మారడంతో శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోను విడుదలవుతుంది.

ఒకే టైమ్ జోన్ ఉండటం వల్ల సరైన నిద్ర కరవవుతోందని, పేదకుటుంబాల్లోని పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని, దీనివల్ల వారు చదువుల్లో కూడా వెనకబడుతున్నారని కార్నెల్ యూనివర్సిటీ ఆర్థికవేత్త మౌలిక్ జగ్నాని తన అధ్యయనంలో పేర్కొన్నారు.

మణిపూర్‌కు ప్రత్యేక టైమ్ జోన్ ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మణిపూర్‌కు ప్రత్యేక టైమ్ జోన్ ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

ఇదెలా జరుగుతుంది?

సాధారణంగా భారత్‌లో పాఠశాలలన్నీ ఇంచుమించు ఒకే సమయానికి ప్రారంభమవుతాయి. కానీ సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో పిల్లలు ఆలస్యంగా పడుకుంటారు. కానీ ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాల్సి వస్తుంది. సూర్యాస్తమయంలో వచ్చే ఒక గంట తేడా పిల్లల్లో కనీసం 30 నిమిషాల నిద్రను తగ్గిస్తుంది.

సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో చాలామంది ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిని కూడా దాటలేకపోతున్నారని ఇండియా టైమ్ సర్వే, నేషనల్ డెమోగ్రఫిక్ అండ్ హెల్త్ సర్వే సమాచారం ఆధారంగా జగ్నాని వెల్లడించారు. ఈ సమస్య పేద కుటుంబాల్లో ఎక్కువగా ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవారిలో దీని తీవ్రత మరింతగా ఉంటోందని ఆయన అన్నారు.

వారు నిద్రించే పరిసరాల్లో ఉండే శబ్దాలు, దుమ్ము, వేడి, దోమలు, జనంసందోహం, ఇతర అసౌకర్యాలు కూడా దీనికి కారణం కావచ్చు. మంచి నిద్రకు తోడ్పడే కర్టెన్లు, ప్రత్యేక గదులు, మంచాలు వంటివాటిని ఏర్పాటుచేసుకోగల ఆర్థిక స్తోమత వారికి ఉండదు.

పేదరికం కారణంగా ఒత్తిడి, వ్యతిరేక ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటి ఎన్నో పరిస్థితులు కూడా దీనిపై ప్రభావం చూపే అవకాశముంది.

ఒక సంవత్సరపు సూర్యాస్తమయ సరాసరి సమయం ఒకే ప్రాంతంలో నివసించే పిల్లల విద్యా ప్రమాణాలపై కూడా ప్రభావం చూపుతోందని జగ్నాని తెలిపారు. ఒక్క గంట ఆలస్యంగా సూర్యుడు అస్తమిస్తే దాని ఫలితంగా వారు విద్యలో 0.8 సంవత్సరాల పాటు వెనకబడుతున్నారని, ప్రాథమిక, మాధ్యమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోతున్నారని పరిశోధనలో వెల్లడైంది.

భారత్‌లో ప్రతిపాదిత రెండు టైమ్ జోన్ల విధానం (పశ్చిమ భారతానికి UTC+5 టైమ్ జోన్, తూర్పు భారతానికి UTC+6 టైమ్ జోన్‌) అమల్లోకి తెస్తే జీడీపీలో కనీసం 0.2శాతం పెరుగుదల సాధ్యపడుతుందని జగ్నాని సూచిస్తున్నారు.

ఒకే టైమ్ జోన్ వల్ల ఎంతోమంది జీవితాలు ప్రభావితమవుతున్నాయని ఎన్‌పీఎల్ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఒకే టైమ్ జోన్ వల్ల ఎంతోమంది జీవితాలు ప్రభావితమవుతున్నాయని ఎన్‌పీఎల్ అభిప్రాయపడింది

ఈ చర్చ ఇప్పుడే మొదలైందా?

ఈ అంశంపై ఎంతో కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి.

విద్యుత్‌ను ఆదా చేయడానికి బహుళ టైమ్ జోన్‌ల వ్యవస్థ ఉపయోగపడుతుందని 1980ల చివర్లో ఓ ప్రముఖ ఇంధన సంస్థకు చెందిన పరిశోధకుల బృందం సూచించింది. దీనిలో చాలా ఇబ్బందులున్నాయంటూ 2002లో ఓ ప్రభుత్వ ప్యానల్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. విభిన్న టైమ్ జోన్లు ఏర్పాటు చేస్తే రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ప్రతి లెవల్ క్రాసింగ్ దగ్గరా సమయాలను రీసెట్ చెయ్యాలని కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేశారు.

అయితే, భారత్‌లోని 7 ఈశాన్య రాష్ట్రాలతోపాటు మరో రాష్ట్రాన్ని కలిపి ఒక టైమ్ జోన్, మిగిలిన ప్రాంతమంతా మరో టైమ్ జోన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని భారత కాలమానం (ఐఎస్‌టీ)ను నిర్దేశించే సీఎస్ఐఆర్-ఎన్‌పీఎల్ సంస్థ గత సంవత్సరం సూచించింది. ఈ రెండింటికీ మధ్య ఒక గంట సమయం తేడా ఉండాలని పేర్కొంది. ఒకే టైమ్ జోన్ వల్ల ఎంతోమంది జీవితాలు ప్రభావితమవుతున్నాయని ఎన్‌పీఎల్ అభిప్రాయపడింది.

సూర్యోదయం త్వరగా జరిగితే ఎన్నో కార్యాలయాల్లో పగటిపూట ఎంతో ముఖ్యమైన పనిగంటలను కోల్పోవాల్సి వస్తోంది. స్కూళ్లు, కాలేజీలు చాలా ఆలస్యంగా మొదలవుతున్నాయి. చలికాలంలో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. ఎందుకంటే సూర్యాస్తమయం చాలా త్వరగా జరుగుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది.

ఇదంతా పరిశీలిస్తే... మన పనితీరును నిద్ర ప్రభావితం చేస్తుంది. ఈ నిద్రను టైమ్ జోన్ ప్రభావితం చేస్తోంది. ఈ ప్రభావం పేద పిల్లల జీవితాలపై మరింతగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)