చంద్రబాబు నాయుడు: హైదరాబాద్‌ను 60 ఏళ్లు అభివృద్ధి చేసి... కట్టుబట్టలతో బయటకు వచ్చాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీని హెచ్చరించారు.
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు డిమాండ్లతో దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సోమవారం ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో నిరాహార దీక్ష నిర్వహించిన చంద్రబాబు మంగళవారం అదే డిమాండ్‌తో దిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
చంద్రబాబు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ భవన్ నుంచి పాదయాత్ర చేస్తూ జంతర్ మంతర్ వరకూ చేరుకున్నారు. పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

జంతర్ మంతర్ దగ్గరి నుంచి చంద్రబాబు సహా 11 మంది ప్రతినిధుల బృందం వాహనాల్లో రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరి వెళ్లింది.
ప్రత్యేక హోదా హామీ అమలుతో పాటు.. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం సమర్పించింది.
రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరే ముందు జంతర్ మంతర్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం విజయ్‌చౌక్‌లోనూ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మరోవైపు ఏపీలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిల మీద తీవ్ర విమర్శలు సంధించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘‘హైదరాబాద్‌ను 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేశాం. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దా. అభివృద్ధి చేసి కూడా హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చాం. కొత్త రాష్ట్రంలో అందరం ఎంత కష్టపడినా, కేంద్రం సహకరించినా 20, 30 సంవత్సరాలు పడుతుంది.
అలాంటి సమయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మా మనోభావాలతో ఆడుకుంటోంది. అందుకే దిల్లీ వీధుల్లో నిరసనయాత్ర చేస్తున్నాం.
ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి. సరిగ్గా స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా.
మోదీలో నాయకత్వ లక్షణాలు లేవు. పార్లమెంటులో నిరంతర పోరాటం చేస్తున్నాం. ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని కలిసి కోరాం.

ప్రజా కోర్టులో చిత్తుచిత్తుగా ఓడిస్తాం...
ఈ దీక్ష రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజల కోర్టులోనే మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం.
ప్రజాస్వామ్య ఆవశ్యకత రీత్యా నేను స్వయంగా రాహుల్‌గాంధీని కలిశాను. నా స్వార్థం కోసం కాదు. దేశాన్ని కాపాడుకోవటానికి. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడుకోవాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.
జగన్, మోదీ ఒక్కటే. జగన్ స్వప్రయోజనాల కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారు. ఒకవైపు నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఉంది.. మరోవైపు వాళ్లకి వ్యతిరేకంగా ఉండేవారు ఉన్నారు.. మీరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోండి.

అవినీతిపరులను ఎవరు తీసుకుంటారు? రేపు వచ్చే ప్రత్యామ్నాయం.. నరేంద్రమోదీ ప్రభుత్వం మాదిరిగా అవినీతిపరులను రక్షించదు. జగన్ ఇష్టమై వచ్చి సపోర్ట్ చేస్తే చేసుకోమను అని చెప్పాను.
అమిత్ షా ఓపెన్ లెటర్‌లో.. తప్పుడు సమాచారం చెప్పి, తప్పుడు ప్రచారం చేయటం అలవాటైపోయింది. బీజేపీ నేతల జాతకాలు విప్పితే తలెత్తుకుని తిరగలేరు. ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వచ్చింది.
నేను ప్రొటోకాల్ ఫాలో కాలేదంట. ప్రధానమంత్రిని అవమానించానంట. మోదీ నా ప్రజలకు అన్యాయం చేసినపుడు ఆయన దగ్గరకు నేనెందుకు వెళ్లాలి.
నాడు స్వాతంత్ర్యాన్ని, విలువలను అమ్ముకునే వాళ్లు కూడా బ్రిటిష్ వాళ్లతో కలిశారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది.

హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి మాకేం బాధలేదు.. అమరావతిలో ఓట్లు అడగటానికి వస్తాం.. అడుక్కుని హైదరాబాద్ వెళ్లిపోతాం అంటే కుదరదు.
మీరు కూడా పోరాడండి. ఇంకా ఎక్కువ అడగండి.. టీడీపీ కంటే ఎక్కువ అడిగామని ప్రజలకు చెప్పండి. అంతేకానీ ఓట్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా?
ఎంపీ పదవులుకు రాజీనామా చేశానంటారు. రాజీనామా చేసి ఎందుకు పారిపోయారు? మేం వదిలిపెట్టలేదే? చివరి రోజు వరకూ మోదీ గుండెల్లో నిద్రపోతున్నాం.
కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టినపుడు మీరెందుకు ఓటు వేయలేదు? ఆ రోజు బయట ఉన్నావు కదా? ఎందుకు రాలేదు? మేం ఎన్ని పార్టీలను కోఆర్డినేట్ చేశాం. మీరు ఒక్కర్ని కోఆర్డినేట్ చేశారా?

ఏపీకి అన్యాయం జరిగిందని దేశం మొత్తం చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీ. బీజేపీతో ఎవరి కోసం ఉన్నాను? 29 సార్లు తిరిగాను. ఎవరికోసం తిరిగాను?
నేను సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ. మోదీ ఇగో సాటిస్ఫై చేయటానికి సార్ సార్ అని కూడా సంబోధించాను. అతను మాట నిలబెట్టుకోలేదు. గౌరవం కూడా నిలబెట్టుకోలేదు.
జగన్ మోహన్‌రెడ్డికి చాలా అలవాట్లున్నాయి. ఆయన తప్పుడు వ్యక్తి కాబట్టి, నేరస్తుడు కాబట్టి.. ముందుగానే ప్రతి ఒక్కదానికీ ఎలిబీ పెట్టుకుంటాడు. కేంద్రం మూటలిస్తదని, తెలంగాణ సీఎం మూటలిస్తానని.. ఐదు వేలకు ఓట్లు లెక్కవేసుకుంటున్నాడు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక కమ్యూనిటీతో లేదు. సామాజిక న్యాయం, సమతుల్యం పాటిస్తాం. బీసీలను కలుపుకుని వస్తున్నాం. అందుకే 40 ఏళ్లుగా ఈ పార్టీ ఉంది. ప్రజలు అమాయకులు కాదు.’’
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వాస్కో డి గామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
- #MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల్లో బాధితులు'
- అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








