చంద్రబాబు ధర్మపోరాట దీక్ష: ఇప్పుడు దిల్లీలో ఎందుకు చేస్తున్నారు? టీడీపీకి ఏపీ భవన్ సెంటిమెంట్ ఉందా?

getty

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ
    • హోదా, తెలుగు డెస్క్

ధర్మపోరాట దీక్షకు చంద్రబాబు దిల్లీనే ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనకున్న కారణాలేంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలోని ఏపీ భవన్‌లో ఒకరోజు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన దీక్ష కొనసాగనుంది.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల రంగు చొక్కా వేసుకుని ఆయన దీక్షలో పాల్గొంటున్నారు.

1983లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ ఇదే ఏపీ భవన్‌లో పోరాడింది.

ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత అదే ఏపీ భవన్‌లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు.

ఏపీ భవన్‌లో ఉద్వేగపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు దిల్లీకి తరలివచ్చారు.

దాదాపు 23 పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలపబోతున్నారు.

ఇప్పటికే రాహుల్‌గాంధీ, మన్మోహన్ సింగ్, మరికొన్ని విపక్ష పార్టీల నేతలు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు.

విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

కేంద్రం దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని, న్యాయంగా ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజధర్మాన్ని పాటించడం లేదని కూడా ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీకి, బీజేపీకి ఏపీ సత్తా ఏంటో చూపిస్తామని చంద్రబాబు అన్నారు.

ధర్మ పోరాట దీక్ష వద్ద సెల్ఫీ

ధర్మపోరాట దీక్షకు దిల్లీనే ఎందుకు ఎంచుకున్నారు?

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కేంద్రంపై నిరసన వ్యక్తం చేయడానికే చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీక్ష చేసేందుకు దేశ రాజధానిని ఎందుకు ఎంచుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

టీడీపీకి ఏపీభవన్ సెంటిమెంట్‌ : కృష్ణారావు

టీడీపీకి సంబంధించి దిల్లీ, ముఖ్యంగా ఏపీ భవన్ చాలా కీలకమని సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు విశ్లేషించారు.

"మొదటి నుంచి ఆ పార్టీ ఏపీ భవన్ నుంచే దిల్లీ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తోంది. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం పేరిట పోరాటం కూడా ఓ రకంగా ఇక్కడే మొదలైందని చెప్పాలి'' అని ఆయన వివరించారు.

టీడీపీ దృష్టిలో ఏపీ భవన్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని కృష్ణారావు విశ్లేషించారు.

1983లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏపీ భవన్ కేంద్రంగానే ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం.. 35 ఏళ్ల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతోందని చెప్పారు.

అందువల్ల ఏపీ భవన్ వేదికగా జరిగిన పోరాటాలు విజయవంతం అవుతున్నాయి కనుక.. దీన్ని టీడీపీ సెంటిమెంట్‌గా భావిస్తుండవచ్చని ఆయన వివరించారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, NAra chandrababu naidu/facebook

ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా

ధర్మపోరాట దీక్ష కోసం చంద్రబాబు దిల్లీని ఎంచుకోవడం వెనక ఎన్డీఏ వ్యతిరేక పార్టీలను ఆకర్షించే వ్యూహం కూడా కనిపిస్తోంది. కేంద్రానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇటీవల చేసిన మెరుపు ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఆయనే నిమ్మరసం ఇచ్చి మమతా బెనర్జీతో దీక్ష విరమింప చేశారు. దిల్లీ వచ్చినప్పుడల్లా అవకాశం ఉన్న ప్రతిసారీ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను చంద్రబాబు కలుస్తున్నారు.

విభజన హామీల అమలు కోసం ఇప్పుడు చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేస్తుండటంతో ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మరికొందరు విపక్ష పార్టీల నేతలు ఏపీ భవన్‌కి వెళ్లి చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు.

జాతీయ మీడియాను ఆకర్షించడానికే: పర్సా వెంకటేశ్వరరావు

కేవలం జాతీయ మీడియాలో ప్రధానంగా రావడం కోసమే చంద్రబాబు నాయుడు దిల్లీకి వచ్చి దీక్ష చేపట్టారని రాజకీయ విశ్లేషకులు పర్సా వెంకటేశ్వరరావు అన్నారు.

"అమరావతిలో ఏం చేసినా జాతీయ మీడియా చూడదు. వేయదు. దేశవ్యాప్తంగా పాపులర్ కావాలంటే జాతీయ మీడియాను ఆకర్షించడం తప్పనిసరి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు దిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

"కేంద్రంపై పోరాటం చేస్తున్నందున ఆయన కేంద్రానికి కీలకమైన దిల్లీలోనే చాలెంజ్ విసరాలనుకున్నారు. విసురుతున్నారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు దిల్లీ ఎంత ముఖ్యమో తెలుసు. అందువల్లే 1996 (దేవెగౌడ ప్రధాని అయినప్పుడు) నుంచి చంద్రబాబు దిల్లీకి వచ్చి మీడియాను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన చంద్రబాబు మోదీకి సమానంగా ప్రాచుర్యం పొందడం కోసం ఈ దీక్షను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తోంది'' అని పర్సా వెంకటేశ్వరరావు చెప్పారు.

మోది బాబు

దీక్షల వల్ల హోదా వస్తుందా?: భండారు శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది కేంద్రం చేతిలోని వ్యవహారం. కానీ, ప్రత్యేక హోదా ఒక భావోద్వేగ అంశంగా మారితే పరిణామాలు వేరుగా ఉంటాయి. తెలంగాణా విషయంలో అదే జరిగిందని భండారు శ్రీనివాసరావు చెప్పారు.

"ధర్నాల వల్ల, ధర్మ పోరాటాల వల్ల రాజకీయ నిర్ణయాలు ప్రభావితం కావు. దీక్షలతో హోదా రాకపోవచ్చు. కానీ ఎంతోకొంత రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని చంద్రబాబు ఒక్కరే కాదు, ఏ రాజకీయ నాయకుడూ వదులుకోరు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకే: సీనియర్ జర్నలిస్టు డానీ

ఎన్నికలకు ముందు ఫోకస్ అయ్యేందుకే చంద్రబాబు దిల్లీలో దీక్ష చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు డానీ బీబీసీతో అన్నారు.

"మోదీ రాజకీయాలు ఆయనకు మింగుడు పడటం లేదు. మోదీని ఢీకొంటూనే ఫోకస్‌ను తన మీదకు మళ్లించుకోడానికి చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నట్లు ఉంది" అని డానీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)