చంద్రబాబు: ‘‘గో బ్యాక్ మోదీ’ అంటే గుజరాత్ పొమ్మని అర్థం... జశోదాబెన్ భర్త ఈ నరేంద్ర మోదీ’

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook

''చెంబుడు మట్టి, నీళ్లు మా మొహాన కొట్టి అన్యాయం చేసిన మనిషి ఈ రోజు ఇక్కడికే వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చెప్పారు. ఆదివారం ఒక అధికారిక కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడి పార్టీలు కలుషితమైన వాతావరణం తీసుకొచ్చాయని మోదీ ఆరోపించారని, కానీ దేశాన్ని, రాజకీయాలను కలుషితం చేసింది, చెప్పిన మాట మీద నిలబడనిదీ ఆయనేనని విమర్శించారు.

ప్రత్యేక హోదా విషయంలో తనది యూటర్న్ కాదని, రైట్ టర్న్ అని, హోదా ఇస్తానని చెప్పి ఇవ్వని మోదీదే యూటర్న్ అని చంద్రబాబు విమర్శించారు.

రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయాల్ని కలుషితం చేసేందుకు మోదీ యత్నిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. ''రాజధాని విషయంలో మీరు (ప్రధాని) బాధ్యత లేకుండా మట్టీనీళ్లు మా మొహాన కొట్టారు. కానీ నేను అనుభవమున్న నాయకుడిగా దీనిని ఒక సవాల్‌గా స్వీకరించి పనిచేస్తున్నా'' అన్నారు.

అమరావతి శంఖుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు పార్లమెంటు మట్టి, యమునా నది నీళ్లు బహూకరిస్తున్న నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

ఫొటో క్యాప్షన్, అమరావతి శంఖుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు పార్లమెంటు మట్టి, యమునా నది నీళ్లు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ

''ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అన్యాయం జరిగింది. మీరు మా పొట్టగొట్టారు. మా మనోభావాలు దెబ్బతీశారు. రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీల సంఘీభావం కోసం అన్ని పార్టీలను కలిపే బాధ్యత తీసుకున్నాను. మోదీ దేశాన్ని భ్రష్టుపట్టించారు. దేశం పూర్తిగా నష్టపోతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సీనియర్ నాయకుడిగా నా వంతు బాధ్యతగా అన్ని పార్టీలను కలిపే బాధ్యత తీసుకున్నాం'' అంటూ జాతీయస్థాయిలో విపక్షాల మహాకూటమిపై మోదీ విమర్శలను చంద్రబాబు తోసిపుచ్చారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు సహా గతంలోనూ వివిధ సందర్భాల్లో టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేసిందని తెలిపారు.

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వ్యవహారంలో మోదీ ప్రభుత్వం తప్పుడు అఫిడవిట్ సమర్పించి, సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. యుద్ధవిమానాల తయారీలో అనుభవంలేని రిలయన్స్ సంస్థకు మోదీ అనుచితంగా రూ.40 వేల కోట్లు దోచిపెట్టే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నించారు. మోదీ దేశానికి కాపలాదారునని ఎప్పుడూ చెప్పుకొంటారని, కానీ ఆయనో దగాకోరుగా తయారయ్యారని విమర్శించారు.

కుటుంబ సభ్యులతో చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, తన కుటుంబాన్ని చూస్తే తనకెంతో గర్వంగా ఉంటుందని చంద్రబాబు ట్విటర్‌లో చెప్పారు

'రాష్ట్ర భవిష్యత్తు కోసమే నాడు ఎన్టీఆర్‌తో విభేదించాం'

మోదీ ఆయన గురువైన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీకే నామాలు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ''గురువుకే పంగనామాలు పెట్టిన మోదీ, నన్ను మా మామగారికి వెన్నుపోటు పొడిచానని అంటున్నారు. నేనేం పార్టీలు మార్చలేదు. మాటలు మార్చలేదు. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మా మామ అయినా సరే (ఎన్టీఆర్‌తో) విభేదించి ముందుకుపోయాం. కుటుంబం, పార్టీ అందరం విభేదించాం. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నామే తప్ప ఇంకోటి కాదు'' అని ఆయన చెప్పారు.

''అద్వానీని వెన్నుపోటు పొడిచింది మీరు. ఆయన దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది. అలాంటి మీరు అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడతారు. పైగా చాయ్ వాలా అంటూ రూ.కోట్లు విలువ చేసే కోట్లు, బూట్లు వేసుకుంటున్నారు'' అని మోదీని ఆయన విమర్శించారు.

'మోదీకి కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదు'

తన కుటుంబాన్ని చూస్తే తనకెంతో గర్వంగా ఉంటుందని చంద్రబాబు ట్విటర్‌లో చెప్పారు. ''నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బంధాలు లేవు. కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు'' అని విమర్శించారు.

తనను లోకేశ్ తండ్రిగా మోదీ అభివర్ణించారని చంద్రబాబు గుర్తు చేస్తూ.. ‘‘లోకేశ్ నా అబ్బాయి. నీకు అబ్బాయిలే లేరు. సంబంధాలే లేవు. బంధాలు లేవు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో ఉంటేనే ఆనందం ఉంటుందని చెప్పే వ్యక్తిని నేను. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను’’ అని అన్నారు.

ప్రధాన మంత్రికి కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు.

మోదీకి భార్య ఉందని, ఆ విషయం మీకు తెలుసా? అని చంద్రబాబు సభికులను ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని ట్రిపుల్ తలాక్ చెల్లదని చట్టం తెచ్చారని, అలా ట్రిపుల్ తలాక్ చెప్పే వారిపై చర్యలు తీసుకోవాలని ఆ చట్టంలో పేర్కొన్నారన్నారు.

‘‘మీకు జశోదాబెన్ అనే భార్య ఉంది. నేను ఆ మాట అడిగితే మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? నన్ను లోకేశ్ తండ్రి అన్నారు. నేను గర్వ పడుతున్నా. జశోదాబెన్ భర్త ఈ నరేంద్ర మోదీ’’ అని చంద్రబాబు అన్నారు.

జశోదాబెన్‌ను పక్కన పెట్టారని, విడాకులు కూడా ఇవ్వలేదని అన్నారు.

తన వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి తాను ఇవన్నీ చెబుతున్నానని, గురివింద సామెత మోదీకి కూడా వర్తిస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏమీ ఇవ్వక్కర్లేదని, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తే చాలని చంద్రబాబు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ను పెట్రోలియం హబ్‌గా మారుస్తామని మోదీ చెబుతున్నారని, కానీ ఆయన చేసేదేమీ లేదని సీఎం విమర్శించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: 2015లో అమరావతి శంకుస్థాపన సభలో నరేంద్ర మోదీ ప్రసంగం

గో బ్యాక్ మోదీ అంటే మళ్లీ పార్లమెంటులో ప్రధానమంత్రి సీటులో కూర్చుంటానని మోదీ అంటున్నారని.. కానీ, దాని అర్థం ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మోదీకి లేదని, గుజరాత్ పొమ్మని, అక్కడ మీ ఊర్లో ఉండమని చంద్రబాబు అన్నారు.

అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో మోదీని గో బ్యాక్ అన్నారని, ఆయన ఎక్కడికి వెళతారని అన్నారు.

పోలవరం నిర్మిస్తుంటే భరించలేకపోతున్నారని, అసూయ పడుతున్నారని, తమకు ఏమీ దాతృత్వం చేయట్లేదని, కేంద్రం నుంచి నిధులు పొందటం తమ హక్కని చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఏపీకి ప్యాకేజీ ఇచ్చిన మోదీ, ఆ తర్వాత 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే పదేళ్లు సరిపోవని, 20-30 ఏళ్లు అవుతుందన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలతో సమానంగా పుంజుకునే వరకూ సహాయపడాలని తాను కోరానన్నారు.

తమ డిమాండ్లు సాధించుకునే వరకూ పోరాడతామని, ఫలితాలు వచ్చే వరకూ తెలుగు జాతి వదిలిపెట్టదని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)