ధర్మపోరాట దీక్ష: ఈ అనుమానాలు తీర్చకపోతే టీడీపీకి గడ్డు పరిస్థితే - అభిప్రాయం

మోదీ బాబు
    • రచయిత, డానీ
    • హోదా, బీబీసీ కోసం

కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ పోరాటం, ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘర్షణ రెండూ తారస్థాయికి చేరుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రధాని 'సవతి తల్లి' వైఖరిని జాతీయ వేదిక మీద దుయ్యబట్టడానికి చంద్రబాబు దిల్లీలో 'ధర్మపోరాటం' పేరిట దీక్ష నిర్వహించారు.

అంతకు ఒక రోజు ముందు నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి.. "ఇది సూర్యోదయం రాష్ట్రం కాదు, పుత్రోదయం రాష్ట్రం" అంటూ విమర్శించి వెళ్ళారు. ప్రధాని ఏకంగా తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడంతో "మోదీని గద్దె దించే వరకూ పోరాటం ఆగదు" అంటూ చెప్పడానికి చంద్రబాబు పుత్ర సమేతంగా దిల్లీ వెళ్లారు..

చంద్రబాబు దిల్లీ దీక్షకు ఒక రోజు ముందే నరేంద్ర మోదీ గుంటూరు వచ్చారా? నరేంద్ర మోదీ గుంటూరు సభ జరిపిన మరునాడే చంద్రబాబు దిల్లీ దీక్ష మొదలెట్టారా? చంద్రబాబు దిల్లీ దీక్ష జరుపుతున్న రోజునే ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అనంతపురంలో సమరశంఖారావం పెట్టుకున్నారా? ఇవన్నీ చెట్టు ముందా? విత్తనం ముందా? వంటి వేదాంత ప్రశ్నలు. అసలు విషయం ఏమంటే ఇప్పుడు ఏపీ రాజకీయం వేడెక్కి నిప్పు లేకున్నా పచ్చగడ్డి మండిపోతోంది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, NAra chandrababu naidu/facebook

చంద్రబాబుకు ఇది జీవన్మరణ పోరాటం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో బహుశా ఇంతటి సంక్లిష్ట పరిస్థితిని వారు ఎప్పుడూ ఎదుర్కొని ఉండరు. అనుభవజ్ఞుడు, ఘటనాఘటన సమర్ధుడు అనే ప్రచారం గత ఎన్నికల్లో చంద్రబాబుకు కలిసి వచ్చింది. కానీ, వచ్చే ఎన్నికల్లో ఆ ప్రచారమే వారికి అడ్డంకిగా మారబోతోంది. వారు తరచుగా నరేంద్ర మోదీని రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అంటుంటారు. కానీ ఇప్పుడు వారే నరేంద్ర మోదీ తనను మోసం చేశారు అంటున్నారు. పైగా రాజకీయ అనుభవం బొత్తిగాలేని వారని జగన్‌ను అవహేళన చేసేవారు. జగన్ చాలా కాలం క్రితమే ప్రత్యేక హోదా జెండా పట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అనివార్యంగా జగన్ వెనుక ప్రత్యేక హోదా నినాదం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వారికి మైనస్ పాయింట్లే.

నరేంద్ర మోదీకి కూడా ఆంధ్రప్రదేశ్ ఇజ్జత్ కా సవాల్‌లా మారింది. ప్రధానిని ఇంతగా ద్వేషిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. పైగా, జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక రాజకీయ కూటమి నిర్మాణానికి చంద్రబాబు ప్రస్తుతం అప్రకటిత కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌లోనే ఓడించాలని నరేంద్ర మోదీ భావిస్తుంటే, మోదీని బీజేపీ కంచుకోట వంటి ఉత్తర భారత దేశంలోనే ఓడించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

పి మధు

ఫొటో సోర్స్, CPIM/FACEBOOK

అయితే, కేంద్రం మీద తాను చేస్తున్న పోరాటానికి రాష్ట్రంలోని విపక్షాల మద్దతును సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కలిసి రాకున్నా, వామపక్షాలను చేరదీయడానికైనా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఉమ్మడి శత్రువైన బీజేపీతో తలపడుతున్నప్పుడు ఇతర పార్టీల సహకారం చాలా కీలకం. చంద్రబాబు దిల్లీ దీక్షకు తాము దూరంగా ఉంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రకటించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS JAGAN/FACEBOOK

జగన్ ఎలాగూ ఈ వ్యవహారంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. "జగన్‌ మెడపై సీబీఐ కత్తి ఉంది. అందుకే మోదీ అంటే ఆయనకు భయం" అని తరచూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. అది నిజం కావచ్చు, కాకపోనూ వచ్చు. చంద్రబాబుతో కలిసి పోరాడకపోవడానికి జగన్‌కు వేరే కారణాలు అనేకం ఉన్నాయి.

గత ఎన్నికల్లో జగన్‌ను అధికారానికి దూరం చేసింది కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే. గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ఆ ఐదు లక్షల ఓట్లు తన వైపుకు వచ్చేశాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ దశలో ఏ ఆంశం మీద అయినా సరే చంద్రబాబుతో గొంతు కలిపితే తన కొత్త ఓటు బ్యాంకు చెదిరిపోతుందని ఆయన భయపడుతున్నారు. అంతకన్నా కీలక విషయం ఏమంటే, టీడీపీలా జగన్‌ది కూడా ప్రాంతీయ పార్టీ. మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. రెండోసారి కూడా ఓటమిని పొందితే ప్రాంతీయ పార్టీలు అంతరించిపోతాయనే రాజకీయ సిధ్ధాంతం ఒకటుంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS JAGAN/FACEBOOK

ఏడాదికి పైగా సాగిన ప్రజాసంకల్ప యాత్ర ఫలితంగా జగన్‌కు కొంత సానుకూలత పెరిగింది. వైఎస్ కొడుకుగా ఆయన మీద మొదటి నుంచీ ఓటర్లలో కొంత సానుభూతి కూడా ఎలాగూ ఉంది. ఇటీవల విడుదలైన 'యాత్ర' సినిమా సైతం ఓటర్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద సానుకూలతను పెంచింది. ఈ స్థితిలో ఎవరితో కలిసినా ఆ మట్టి తనకు అంటుకుంటుందని జగన్ సహేతుకంగానే భయపడుతున్నారు. ఎవ్వరితో కలిసేదిలేదని ఆయన ఇటీవల పదేపదే చెపుతున్నది అందుకే.

బాబు - రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రంలో విపక్షాల మద్దతు లేకున్నా, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమికి దాదాపు 23 పార్టీల మద్దతు ఉంది. జాతీయ రాజకీయాల్లో తన శక్తిని ప్రదర్శించడానికి దిల్లీయే సరైన వేదిక అని చంద్రబాబు భావిస్తున్నారు. ధర్మపోరాటానికి దిల్లీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇదే.

దీక్ష ప్రాంగణం

తన పరిపాలన మీద కొనసాగుతున్న వ్యతిరేకతను శాంతింప చేయడానికి చంద్రబాబు నిజంగా గట్టి కసరత్తే చేస్తున్నారు. గుంటూరులో నరేంద్ర మోదీ సభ జరుగుతున్నప్పుడే విజయవాడలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న దాదాపు లక్ష కుటుంబాలకు శాశ్వత పట్టాలను పంపిణీ చేశారు. కొంత కాలంగా దాదాపు ప్రతి సామాజిక వర్గానికీ పేరుపేరునా రాయితీలు ప్రకటిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో అవి సాకారం అయ్యే అవకాశాలు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ దగ్గర దానికి సమయమూ లేదు.

పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్ని ఎదుర్కోలేరని గుంటూరు సభలో మోదీ అన్నది ఒక కోణంలో నిజమే. అయితే చంద్రబాబు లెక్కలు వేరేగా ఉన్నాయి. "గత ఎన్నికల్లో బీజేపీకి 14 సీట్లు ఇస్తే నాలుగు స్థానాల్లోనే ఆ పార్టీ గెలిచింది. బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే టీడీపీకి మరో 15 సీట్లు అదనంగా వచ్చేవి" అని గుర్తు చేస్తున్నారాయన. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంవల్ల కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లోని ముస్లిం, క్రైస్తవ, దళిత ఓట్లు చాలా వరకు వైసీపీ వైపుకు మళ్ళాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకున్నా ఆ ఓట్లు తిరిగి వస్తాయా? అన్నది టీడీపీ శిబిరాన్ని భయపెడుతున్న ప్రధాన ప్రశ్న. వ్రతం చెడినా ఫలితం దక్కేలా లేదు.

మోదీ, బాబు

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు, బీజేపీతో రెండుసార్లు కాపురం చేసిన చంద్రబాబు రేపు ఎన్నికలయ్యాక అవసరం అయితే మళ్ళీ ఆ పార్టీతో జతకట్టరని గ్యారంటీ ఏమిటి? అనే ప్రశ్నను ఆయన ప్రత్యర్ధులు బలంగానే సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంఘ్ పరివారం జోక్యం చేసుకొని ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోదీని తప్పించి నితిన్ గడ్కరీ వంటి వారిని ముందుకు తెస్తే చంద్రబాబు మళ్ళీ ఎన్డీయే శిబిరంలో చేరవచ్చనే అభిప్రాయాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే ప్రచారంలో పెట్టాయి.

ఈ అనుమానాలను పటాపంచలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదు. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. ఎలాగూ నరేంద్ర మోదీతో బేధాభిప్రాయాలు మాటల యుధ్ధం దశని కూడా దాటి చావో రేవో తేల్చుకునే స్థితికి చేరుకున్నాయి. ఇక తెగబడి పోరాడడం ఒక్కటే మిగిలింది. నరేంద్ర మోదీ-అమిత్ షాలని మాత్రమే కాదు మొత్తం బీజేపీ-ఎన్డీయే శక్తుల్ని సైతం ఓడించడానికి చంద్రబాబు నడుంబిగించారనే గట్టి సంకేతాలను ఇవ్వాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో జగన్ పక్షం వహించిన బీజేపీ-వ్యతిరేక శ్రేణుల్లో మరింత విశ్వాసాన్ని పెంచాలంటే చంద్రబాబు భీకరంగా 'ధర్మపోరాటం' చేయక తప్పని పరిస్థితి. బీజేపీ శక్తులతో ఎంత తీవ్రంగా పోరాడితే బీజేపీ వ్యతిరేక సామాజిక వర్గాలు చంద్రబాబును అంతగా నమ్ముతాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)