వై.ఎస్. జగన్ పాదయాత్ర ముగింపు సభ: ‘రైతులకు రూ.12,500 ఆర్థికసాయం, 9 గంటలు ఉచిత విద్యుత్’

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, YSR CONGRESS

వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ముగిసింది. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు నడిచిన జగన్.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో తన పాదయాత్రను ముగించారు.

ముగింపు సభలో జగన్ చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. నాలుగున్నర ఏళ్లుగా ప్రజలను వంచించిన చంద్రబాబుకు ఎన్నికల ముందే ప్రజల సంక్షేమం గుర్తుకు వస్తోందని అన్నారు.

వైఎస్ జగన్, పాదయాత్ర

ఫొటో సోర్స్, YSRCP

జగన్ ప్రసంగంలోని ప్రధానాంశాలు:

1. నాలుగున్నర ఏళ్లలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. హెరిటేజ్ షాపుల కోసం చంద్రబాబు దళారీగా మారారు. జీడిపప్పుకు ప్రసిద్ధి చెందిన పలాసలో రైతుల దగ్గర కిలో 650 రూపాయలకు జీడిపప్పు కొని హెరిటేజ్‌లో కిలో రూ.1180 కు విక్రయిస్తున్నారు.

2. పొదుపు సంఘాల మహిళలను బాబు మోసం చేశారు. 2016 అక్టోబర్ నుంచి ప్రభుత్వం బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ కట్టడం లేదు. 2014లో డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లు ఉంటే అవి ఇప్పుడు రూ.22,174 కోట్లకు పెరిగాయి.

3. టీడీపీ అధికారంలోకి రాగానే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీల హాస్టళ్లు మూతబడ్డాయి. బాలికల హాస్టళ్లకు బాత్రూంలు లేవు, ఆరు నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించలేదు. ఇదంతా నారాయణ, చైతన్య స్కూళ్ల కోసమే చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, వచ్చినవి సరిపోక విద్యార్థులు చదువులు మానేస్తున్నారు.

4. ప్రత్యేకహోదా వద్దని నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్నారు. ప్రత్యేక హోదాను అడిగిన వాళ్లను వెటకారం చేశారు, హోదా అడిగితే జైలులో పెట్టిస్తామన్నారు.

నాలుగేళ్లు చిలకాగోరింకల్లా కాపురం చేసి ఎన్నికలప్పుడు ధర్మ పోరాట దీక్ష అంటూ మళ్లీ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రంలో జరగని అభివృద్ధి జరిగినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ జగన్, పాదయాత్ర

ఫొటో సోర్స్, YSRCP

జగన్ హామీలు:

  • అధికారంలోకి వస్తే మొదట జిల్లాస్థాయిలో మార్పులు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి 13 జిల్లాలు 25 జిల్లాలుగా మార్పు.
  • పథకాలన్నీ ప్రజలందరికీ చేరేలా ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు, వాటిలో స్థానిక యువతకు అవకాశాలు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ నియామకం. వారికి నెలకు 5 వేల జీతం.
  • వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంటు. రైతుకు వడ్డీ లేకుండా రుణాలు. మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500 ఆర్థికసాయం.
  • పంట వేసే ముందే కొనే ధర నిర్ణయం. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్, పుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు. రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్ రద్దు.
  • రైతులకు గిట్టుబాటు ధరక కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపరీత్యాల నిధి ఏర్పాటు.
  • రైతులెవరైనా మరణిస్తే వైయస్సార్ బీమా కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సహాయం. ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి.
వైఎస్ జగన్, పాదయాత్ర

ఫొటో సోర్స్, YSRCP

పాదయాత్ర - లాభనష్టాలు

జగన్ పాదయాత్ర నిజంగా ఒక రికార్డని సీనియర్ పాత్రికేయులు డానీ అన్నారు. పాదయాత్రలో జనం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని.. కొన్ని అద్బుత ఘట్టాలు కూడా ఆవిష్కృమయ్యాయని తెలిపారు.

అయితే తన పాదయాత్రలో బాబును విమర్శించినంతగా జగన్ మోదీని విమర్శించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నంలో భాగంగా జగన్ ఈ వ్యూహాన్ని అనుసరించి ఉండవచ్చని.. అయితే దీని వల్ల జగన్‌కు గతంలో దగ్గరగా ఉన్న మైనారిటీలు, దళితులు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని డానీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)