10 శాతం రిజర్వేషన్లు: ‘ఉద్యోగార్థులకు క్యారెట్ ఎర’

- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
‘విద్య, ఉపాధి రంగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్. ఇది లక్షలాది ఉద్యోగార్థులకు కలల్ని అమ్మడం లాంటిది. వాళ్లకు ఒక క్యారెట్ ఎర వేయడం లాంటిది’, అని కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయాన్ని అభివర్ణించారు కొందరు న్యాయ నిపుణులు.
రిజర్వేషన్లకు సామాజిక వెనుకబాటుతనమే ప్రాతిపదికగా ఉండాలని కేరళ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, మాజీ అడ్వకేట్ జనరల్ రవి వర్మ కుమార్ వ్యాఖ్యానించారు.
‘నాకు అది ఎన్నికల వేళ విసిరిన భారీ తాయిలంలానే కనిపిస్తోంది. కోర్టులు ఎలాగూ దాన్ని కొట్టేస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఉంది. కానీ, ఇది తరువాత రాబోయే ప్రభుత్వానికి సమస్యగా మారుతుంది. ప్రస్తుతానికి వాళ్లు లక్షలాది ఉద్యోగార్థులకు కలల్ని అమ్ముతున్నారు’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే బీబీసీతో చెప్పారు.
‘మాజీ ప్రధాని వీపీ సింగ్ హయాంలో వచ్చిన మండల్ కమిషన్ నివేదికలోని మార్గదర్శకాల ఆధారంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా అగ్ర కులాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేశారు. కానీ, దాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని రవి వర్మ కుమార్ అన్నారు.

కానీ, చట్టంలో సవరణల ద్వారా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
‘ఒకవేళ ప్రభుత్వం చట్ట సవరణ చేసి, రిజర్వేషన్లను 50 శాతం దాటిస్తే అది అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది... రాజ్యాంగంలో సమానత్వం ప్రాథమిక అంశంగా ఉన్నప్పుడు, దాన్ని సవరించడం సాధ్యమేనా? అన్న ప్రశ్న. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే వీల్లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’ అని సంజయ్ హెగ్డే చెప్పారు.
‘రిజర్వేషన్లలో ఆర్థిక ప్రమాణాల గురించి రాజ్యాంగ సభలోనే చర్చించారు. ఆ ప్రమాణాలు ఎలాస్టిక్ స్కేల్ లాంటివి. దానికి పరిమితులు నిర్వచించలేం.ఉదాహరణకు ఒక కుటుంబంలో అన్నయ్య తక్కువ సంపాదించొచ్చు, చెల్లెలు ఎక్కువ సంపాదించొచ్చు. అంత మాత్రాన ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనలేం కదా’ అంటారు అరుల్‌మోజీ. పెరియార్ రామస్వామి స్థాపించిన ద్రవిడ కళగంకు ఆయన జాతీయ కార్యదర్శి.

సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న గోపాల్ పరాశరన్ ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, ‘ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎలా గుర్తిస్తారు? ఎవరి పిల్లలైనా అమెరికాలోనో మరెక్కడో చదువుతున్నా గుర్తించడం కూడా కష్టమే కదా. ప్రతి ప్రభుత్వం రిజర్వేషన్లను మరింత జటిలంగా మార్చేస్తోంది. దేశానికి ఇది మంచి పరిణామం కాదు’ అని అన్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రిజర్వేషన్లను తీసుకొచ్చారని ఆయన నమ్ముతున్నారు. ఒకవేళ రాజ్యాంగ సవరణ చేసి బిల్లును పాస్ చేసినా, దాన్ని మళ్లీ సవాలు చేసి కొట్టేస్తారని ఆయన విశ్వసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








