అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా.. ఎవరేమంటున్నారు?

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ కాసం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 లను అనుసరించి సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.

అయితే, గత కొన్నేళ్లుగా అనేక కులాలు తమకూ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ, మరికొన్ని కులాలు తమ రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ ఉద్యమాలు చేస్తున్నాయి.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కాపు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు ఇలా చాలా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నాయి.

సుప్రీం కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు దేశంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు 27 శాతం మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అధిగమించి కేంద్రం ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందనేది కీలకంగా మారింది.

అమలు ఎలా

సుప్రీం తీర్పును అధిగమించి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను అమలు చేయాలంటే మొదట ఆర్టికల్ 15, 16లను సవరించాల్సి ఉంటుందని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

రాజ్యాంగ సవరణ చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని తెలిపారు.

''ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచరాదని ఇచ్చిన సుప్రీం తీర్పును అధిగమించేందుకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్డ్‌లో చేర్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి'' అని ఆయన వివరించారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, loksaba/fb

రాజ్యాంగ సరవణ ఎలా ?

రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

పార్లమెంట్ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తేనే కేంద్రం తీసుకొచ్చే బిల్లు చట్టంగా మారుతుంది.

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఈ బిల్లు అక్కడ ఆమోదం పొందే అవకాశం ఉంది. కానీ, రాజ్యసభలో ఎన్డీఏ సభ్యుల సంఖ్య తక్కువ. 2/3వ వంతు సభ్యులు లేరు. అయితే, ఎన్డీయేతర పక్షాలు మద్దతు తెలిపితే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు తమిళనాడు జయలలిత

ఫొటో సోర్స్, Getty Images

69 శాతం రిజర్వేషన్లను తమిళనాడు ఎలా అమలు చేస్తోంది?

దేశంలో పలు రాష్ట్రాలు 50 శాతం కోటాను మించి రిజర్వేషన్‌లు ఇచ్చేందుకు చట్టాలు తీసుకొచ్చాయి.

అయితే, ఆ ప్రయత్నాలను కోర్టులు కొట్టేశాయి. కానీ, తమిళనాడు ప్రభుత్వం మాత్రం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది.

అయితే, ఈ తీర్పు ఇచ్చే నాటికే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడులో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. దీంతో తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని రద్దు చేయకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేసి దానిని 9వ షెడ్యూలులో చేర్చింది.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పార్లమెంట్

ఫొటో సోర్స్, Getty Images

9వ షెడ్యూల్ ఏమిటి?

1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ తీసుకొచ్చారు. కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసే చట్టాలను ఈ షెడ్యూల్‌లో చేర్చడానికి అవకాశం కల్పించారు.

అంటే ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానిని న్యాయ సమీక్ష నుంచి మినహాయించే అవకాశం కల్పించారు. అందుకే తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఈ షెడ్యూల్ కిందకు తీసుకొచ్చి రక్షణ కల్పించారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

అయితే, సుప్రీం కోర్టు గతంలో అనేక సార్లు 9వ షెడ్యూల్‌ను కూడా న్యాయసమీక్ష పరిధిలోకి తేవాలని పేర్కొంది.

మౌలిక సూత్రాలకు భంగకరమని భావిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలనూ సమీక్షిస్తామని పలు కేసుల విచారణంలో సుప్రీం పేర్కొంది.

ఐఆర్‌ కోయెల్‌హో వర్సెస్‌ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకతీతం కాదని స్పష్టం చేసింది.

ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే సమీక్షించవచ్చని పేర్కొంది.

కేశవానంద భారతి వెర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ కేరళ కేసులో '' 1950 నుంచి 1973 వరకు 9 వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందని, దీని తర్వాత చేర్చినా ఏ చట్టమైన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది'' అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

'సమానత్వ భావన సాకారం అవుతుంది'

రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ భావన సాకారం కావాలంటే కాలానుగుణంగా రిజర్వేషన్లను మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిభాగం అధిపతి వేంకటేశ్వర్లు బీబీసీకి చెప్పారు.

'కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మొదట ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ తర్వాత 1990లలో బీసీలకు రిజర్వేష్లను వర్తింప చేశారు. కాలానుగుణంగా రిజర్వేష్లను కూడా మారాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సమానత్వం అనే భావన నిజం అవుతుంది' అని ఆయన అన్నారు.

జాట్లు

ఫొటో సోర్స్, Getty Images

'మాకు దక్కేదేమీ లేదు'

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల కాపులకు దక్కేదేమీ లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడూతూ, 'కాపులను బీసీల జాబితాలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర నిర్ణయం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. అగ్రకుల రిజర్వేషన్ల జాబితాలో కాపులను చేర్చితే వచ్చే ఉపయోగమూ లేదు ' అని పేర్కొన్నారు.

అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీబీసీతో అన్నారు.

''సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యాంగం చెబుతుంటే కేంద్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం సరికాదు. సుప్రీం కోర్ట్ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉల్లఘించి కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. అణగారిన వర్గాల రిజర్వేషన్లను సవరించడం ద్వారా రిజర్వేషన్లను బలహీనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' అని ఆయన పేర్కొన్నారు.

ఇది చరిత్రాత్మక నిర్ణయం

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

'ఈ నిర్ణయం వంద శాతం అమలవుతుందని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశంలో ఉన్న కోట్లాది మంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుంది. సామాజిక వివక్షే కాదు, ఆర్థిక వెనకబాటును ప్రాతిపాదికను తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లతో పాటతు జాతీయ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రిజర్వేషన్ల ఉద్యమాలు బలహీన పడతాయి' అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)