ఆధార్ రూల్స్ మారాయ్.. ఇప్పుడు వీటికి ఆధార్ కార్డు అస్సలు అవసరం లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆధార్ కార్డు.. ఈ మధ్య కాలంలో దీనిపై జరిగినంత చర్చ మరే గుర్తింపు పత్రంపైనా జరగలేదు. సుప్రీం కోర్టు ఆధార్ రాజ్యాంగబద్ధమైనదంటూనే, దాని వాడకంపై కొన్ని పరిమితులు విధించింది.
ప్రైవసీ చట్టాలు, సుప్రీం తీర్పు, వ్యక్తిగత స్వేచ్ఛపై వాదనలు వంటి అంశాలను వదిలేసి, రెండు ముక్కల్లో ఎక్కడ ఆధార్ తప్పనిసరి? ఎక్కడ కాదు? అనేది చూద్దాం.
ఇన్‌కమ్ టాక్స్ రిటర్నులు దాఖలు చేయడానికి, పాన్ కార్డు పొందటానికి ఆధార్ తప్పనసరి. ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేతలు తగ్గించడానికి ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.

ఫొటో సోర్స్, AFP
బ్యాంకు ఖాతాకు అవసరం లేదు
బ్యాంకు ఖాతా తెరవడానికి ఆధార్ తప్పనిసరి కాదు. ఆధార్ లేకపోయినా కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఆధార్ ఇవ్వకుండా తిరస్కరించే హక్కు వినియోగదారులకు ఉంది. ఆధార్ లింక్ కూడా చేయక్కర్లేదు.
కొత్త మొబైల్ కనెక్షన్ కోసం ఆధార్ తప్పనిసరి కాదు. ఇవ్వకుండా ఉండే హక్కు వినియోగదారుడికి ఉంది.
అంతే కాదు ప్రైవేటు మొబైల్ వాలెట్లకు (ఉదా. పేటీఎం, మొబిక్విక్, ఫోన్ పే మొదలైనవి) కూడా ఆధార్ తప్పనిసరి కాదు. వారికి ఆధార్ అడిగే అధికారం లేదు.
స్కూళ్లల్లో అడ్మిషన్లకు, సీబీఎస్ఈ, యూజీసీ పరీక్షలకూ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే సంక్షేమ పాఠశాలలు మాత్రం ఆధార్ తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ అడిగే హక్కు ఉంది. అంటే రేషన్ సరుకులు, పింఛను, ఫీజు రీయింబర్సుమెంటు, నేరుగా ఖాతాలోకి డబ్బు వచ్చే ప్రభుత్వ పథకాలు, ఉపాధి హామీ పథకం, సబ్సిడీతో వచ్చే గ్యాస్ సిలెండర్, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఇళ్ల పథకాలు ఇలాంటి వాటికి ఆధార్ తప్పనిసరిగా ఉంది.
అంతర్జాతీయ పార్శిళ్లపై పోస్టల్ డిపార్టుమెంటు ఆధార్ నంబర్ వేస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆ శాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాల వల్ల అంతర్జాతీయ పార్శిళ్లకు ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకుంటున్నామనీ, ఆధార్ కాకుండా వేరే ఏ విధమైన ప్రభుత్వ గుర్తింపు పత్రం అయినా ఇవ్వచ్చనీ, ఆధార్ మాత్రమే ఇవ్వాలన్న నిబంధన లేదని వారు ప్రకటన విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
జైళ్లకు ఆధార్
కేంద్రం 2018 ఏప్రిల్‌లో జైళ్లల్లో ఆధార్‌కు సంబంధించిన ఒక విషయాన్ని ధృవీకరించింది. ఖైదీల ఆధార్ నంబర్ సేకరించడం, వారిని కలవడానికి వచ్చే వారిని ఆధార్ గుర్తింపుతో అనుమతించడం ద్వారా రికార్డులు సక్రమంగా నిర్వహించవచ్చంటూ అన్ని రాష్ట్రాలకూ సలహా ఇచ్చింది.
జైళ్లు రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో, కేంద్రం హోం శాఖ ఆదేశాలకు బదులు సలహాలు ఇస్తుంది. కానీ సాధారణంగా ఆ సలహాలను ఆదేశాల్లానే పాటిస్తారు. దీంతో జైళ్లల్లో ఆధార్ వినియోగం తప్పనిసరైంది.
కేంద్ర ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌ఓ ఆధార్ నంబరుతో పీఎఫ్ ఖాతాలను అనుసంధానిస్తోంది.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, ఆస్తులు లేదా ఇతరత్రా రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేశాయి. రాష్ట్రాన్ని బట్టి ఈ నిబంధన మారుతుంది. ఏపీ, తెలంగాణల్లో రిజిస్ట్రేషన్లకు ఆధార్ అవసరం.
స్థూలంగా చెప్పాలంటే, ప్రభుత్వానికి ఆధార్ అడిగే హక్కు ఉంది. ప్రైవేటు కంపెనీలకు ఆ హక్కు లేదు.

ఫొటో సోర్స్, Getty Images
వాస్తవ పరిస్థితి ఎలా ఉందంటే..
చాలా సందర్భాల్లో ఆధార్ తప్పనిసరి కాకపోయినా, ఆధార్ వల్ల పని వేగంగా అవుతూండడంతో ప్రైవేటు కంపెనీలు, వినియోగదారులూ ఆధార్ వాడుతున్నారు. ఉదాహరణకు ఆధార్ లేకుండా మొబైల్ సిమ్ కార్డ్ యాక్టివేషన్ ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ, ఆధార్‌తో అరగంటలోపే సిమ్ యాక్టివేషన్ చేస్తున్నారు.
దీంతో ఎవరూ పెద్దగా దాని గురించి మాట్లాడడం లేదు. ప్రైవసీ విషయంలోనూ, సుప్రీం తీర్పుపై అవగాహన ఉన్న కొందరు వినియోగదారులు మాత్రమే ఈ అంశంపై ఆధార్ ఇవ్వబోమని చెబుతున్నారు.
లోన్లు ఇచ్చే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంట్లో డీటీహెచ్ కనెక్షన్ ఇచ్చే కంపెనీల వరకూ ఆధార్ అడుగుతున్నాయి.
చట్టపరమైన అంశాలు పక్కనపెడితే, వాస్తవిక పద్ధతుల్లో మిగిలిన గుర్తింపు కార్డుల కంటే ఆధార్ కాస్త పక్కాగా ఉంది అన్న అభిప్రాయం చాలా మందికి వచ్చింది. అందుకే ప్రైవేటు రంగంలో కూడా ఆధార్ విరివిగా చలామణీలో ఉంది.
చట్టపరంగా ఇది పౌరసత్వ గుర్తింపు కార్డు కాకపోయినా, అనధికారికంగా ఆధార్‌కు ఆ హోదా వచ్చిందనే చెప్పాలి. ఆఖరికి పల్లెల్లో అప్పులు ఇచ్చే వారు కూడా ప్రామిసరీ నోట్లతో పాటూ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవడం దీనికి ఉదాహరణ.
ఇవి కూడా చదవండి
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- ఆఫ్రికన్ చారిత్రక గాథ: వాంఛ తీర్చుకుని చంపేస్తుంది: కాదు, జాతి పోరాట యోధురాలు
- వడా పావ్: ఇది మెక్ డొనాల్డ్స్కే చుక్కలు చూపించిన 'ఇండియన్ బర్గర్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








