రామాయణంలోనే 24 రకాల విమానాలను ఉపయోగించారట..

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో అసంబద్ధ ప్రకటనలు చేసిన వక్తలపై భారతీయ శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో కొందరు విద్యావేత్తలు.. ఏకంగా ఐజాక్ న్యూటన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ఆవిష్కరణలను తోసిపుచ్చారు.
స్టెమ్ సెల్ లాంటి ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని కూడా ఒకప్పుడు భారతీయులే కనుగొన్నారని చెప్పుకొచ్చారు.
హిందూ పురాణాలు, మతం ఆధారమైన సిద్ధాంతాలు భారతీయ సైన్స్ కాంగ్రెస్ అజెండాలో ప్రధానంగా మారుతున్నాయి.
అయితే ఈసారి సదస్సులో కొందరు విద్యావేత్తల వ్యాఖ్యలు గతంలోకన్నా సంచలనం సృష్టిస్తున్నాయి.
ఆంధ్రా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు ఈ సదస్సులో, మహాభారతాన్ని ఉదాహరణగా చూపుతూ.. స్టెమ్ సెల్ పరిశోధన ఎన్నో వేల ఏళ్ల క్రితమే జరిగిందన్నారు. దానికి ఆయన కౌరవులను ఉదాహరణగా పేర్కొన్నారు.
అంతే కాకుండా రామాయణంలో 24 రకాల విమానాలను ఉపయోగించారని నాగేశ్వరరావు అన్నారు.

ఫొటో సోర్స్, andhrauniversity.edu.in
తమిళనాడుకు చెందిన మరో విద్యావేత్త డాక్టర్ కేజీ కృష్ణన్.. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఐజాక్ న్యూటన్ ఇద్దరూ తప్పేనని, గురుత్వాకర్షణ తరంగాలకు 'నరేంద్ర మోదీ తరంగాలు' అని నామకరణం చేయాలని సూచించారు.
గురుత్వ వికర్షణ శక్తులను అర్థం చేసుకోవడంలో న్యూటన్ విఫలమయ్యారని, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు.
అయితే ఇలాంటి వ్యాఖ్యలను శాస్త్రవేత్తలు, విమర్శకులు తప్పుపడుతున్నారు.
పురాణాలు చదవి ఆనందించడానికి బాగానే ఉంటాయి కానీ, వాటిని సైన్సుతో ముడి పెట్టరాదని అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలపై ఇండియన్ సైంటిఫిక్ కాంగ్రెస్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది.
''వారి వ్యాఖ్యలు, అభిప్రాయాలతో మేం ఏకీభవించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం'' అని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రేమేందు పి.మాథుర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోయిన ఏడాది కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ ఒక సమావేశంలో.. విమానాల గురించి మొదట రామాయణంలో ప్రస్తావించారని అన్నారు.
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడానికి ఎనిమిదేళ్ల ముందే శివాకర్ బాబూజీ తల్పడే అనే భారతీయుడు మొట్టమొదటి ఎగిరే విమానాన్ని కనిపెట్టారని పేర్కొన్నారు.
2014లో ప్రధాని నరేంద్ర మోదీ.. గణేశుణ్ని ఉదాహరణగా పేర్కొంటూ, పురాతన కాలంలోనే మన దేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఉందని పేర్కొన్నారు.
2017లో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ఆవు శాస్త్రీయ ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రపంచంలో ఆక్సిజన్‌ను పీల్చి, ఆక్సిజన్‌ను వదిలే జంతువు ఆవు ఒక్కటే అన్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- AUS vs IND: 72 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- మైనస్ 35 డిగ్రీల చలిలో చైనా మంచు పండుగ
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- సౌదీ అరేబియాలో తలాక్: 'రహస్య విడాకుల్లో' మహిళలకు మెసేజ్ తప్పనిసరి
- BBC Click ఎపిసోడ్ 4: ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే సరికొత్త టెక్నాలజీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








