వైఎస్ జగన్‌పై దాడి కేసు: కోడిక‌త్తితో దాడి జరిగితే NIA ఎలా దర్యాప్తు చేస్తుంది? ఏపీ ప్రభుత్వ సహాయ నిరాకరణ కరెక్టేనా?

జగన్‌పై కోడి కత్తితో దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించడంపై నిరసన తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కోడిక‌త్తితో జ‌రిగిన దాడిని ఎన్ఐఏకి అప్ప‌గించ‌డం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స‌మీక్ష జ‌రిపి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున తమ అభ్యంత‌రాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యించారు. త‌దుప‌రి న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు కూడా పూనుకుంటామ‌ని కూడా చెబుతున్నారు.

రాష్ట్ర మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ... స్వ‌యంగా తాను లాయ‌ర్ అయిన‌ప్ప‌టికీ, జ‌గన్ మోహ‌న్ రెడ్డి కేసును ఎన్ఐఏకి అప్ప‌గించిన తీరు అర్థం కావ‌డం లేద‌న్నారు. కోడిక‌త్తితో దాడి జ‌రిగితే ఎన్ఐఏకి ఎలా అప్ప‌గిస్తార‌ని ప్ర‌శ్నించారు. షెడ్యూల్డ్ అఫెన్సెస్‌లో కోడిక‌త్తి కేసు లేద‌ని, అది కేవ‌లం లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య అయిన‌ప్ప‌టికీ హైకోర్టు చెప్పింద‌నే కార‌ణంతో కేంద్రం దానిని ఎన్ఐఏకి బ‌ద‌లాయించ‌డం తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌న్నారు. రాష్ట్రంపై బుర‌ద జ‌ల్లేందుకే ఇలాంటి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కేసు ఎన్ఐఏకు ఎలా వెళ్లింది?

విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 25వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు గాను విశాఖ విమానాశ్రయానికి రాగా అక్కడ ఓ యువకుడి కోడిపందేల్లో వాడే కత్తితో జగన్‌ను గాయపరచడం కలకలం రేపింది.

ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న ద‌ర్యాప్తు మీద త‌మ‌కు అనుమానాలు ఉన్నాయంటూ జగన్‌, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుంటూరుకు చెందిన అనిల్‌ కుమార్‌‌లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ కేసులో కేంద్ర హోం శాఖ కూడా ప్రతివాదిగా ఉంది.

కేసు విచారణ సందర్భంగా డిసెంబర్‌లో కేంద్రం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థలతో ఈ కేసు విచారణ చేయించటంపై నిర్ణయం తీసుకుంటారో లేదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

జనవరి 4వ తేదీన మరొకసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ఆ సందర్భంగా హోం శాఖ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లు నిర్ణయాన్ని ధర్మాసనానికి తెలిపారు.

ఎన్ఐఏ

ఫొటో సోర్స్, nia.gov.in

ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆధారం ఏంటి?

జగన్‌పై దాడి ఘటన 'ది సప్రెషన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ యాక్ట్స్‌ అగైనెస్ట్‌ సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌ - 1982లోని సెక్షన్‌ 3(ఏ) (1) (ఏ) ప్రకారం శిక్షార్హమైన నేరం కిందికి వస్తుందని, ఎన్‌ఐఏ చట్టం ప్రకారం అది షెడ్యూల్డ్‌ నేరమని ఏఎస్‌జీ లక్ష్మణ్ హైకోర్టుకు చెప్పారు.

నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఏఐ దర్యాప్తు చేయాల్సి ఉందని, ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్‌ 6(5), 8 కల్పించిన అధికారాల్ని ఉపయోగించి జగన్‌పై దాడి కేసు దర్యాప్తు చేయాలని కేంద్రం డిసెంబర్ 31వ తేదీన ఎన్‌ఐఏను ఆదేశించిందని వివరించారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ స్టేషన్‌లో జనవరి 1న ఎఫ్‌ఐఆర్‌ నంబరు 1తో ఐపీసీ 307, సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌ - 1982లోని సెక్షన్‌ 3(ఏ)(1)(ఏ)ల కింద కేసు నమోదైందని, నిందితుడు జె.శ్రీనివాసరావు చిన్న కత్తితో చేసిన దాడి ఘటనల సమాచారాన్ని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొందని వెల్లడించారు.

సెలవులో విశాఖ పోలీస్ కమిషనర్

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు నిమిత్తం విశాఖ‌పట్నం పోలీసుల‌ను సంప్ర‌దించారు.

ఉన్న‌తాధికారుల ఆదేశాలు లేకుండా కేసు వివ‌రాలు అందించ‌లేమ‌ని చెప్ప‌ిన పోలీసులు ఎన్ఐఏ దర్యాప్తుకు సహకరించలేదు.

దీనికితోడు విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ చంద్ర ల‌డ్డా సెల‌వులో ఉండ‌డంతో ఎన్ఐఏ బృందాలు వేచి చూడ‌క త‌ప్ప‌డం లేదు.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

గతంలో సీబీఐకి అనుమతి రద్దు.. ఐటీకి సహాయ నిరాకరణ

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని నవంబర్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, దర్యాప్తులు చేయడానికి సీబీఐకి ఇచ్చిన అధికారాన్ని తిరిగి తీసేసుకున్నట్లయ్యింది.

దిల్లీ కాకుండా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన పని నిర్వర్తించాలంటే ఆ రాష్ట్ర సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌) తెలపాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను కూడా రాష్ట్ర ఏసీబీయే చూస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి సహాయ నిరాకరణ చేయాలని అప్పట్లో నిర్ణయించింది.

తాజాగా ఇప్పుడు ఎన్ఐఏ విష‌యంలో కూడా ఏపీ ప్ర‌భుత్వం కేంద్రం తీరుని త‌ప్పుబ‌డుతోంది.

ఎన్ఐఏ దర్యాప్తు చేసే కేసులు ఏంటి?

జాతీయ భ‌ద్ర‌త‌, కౌంట‌ర్ టెర్ర‌రిజం వంటి అంశాల్లో అత్యున్న‌త సంస్థ‌గా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉంది. ఒక గ్రూప్ గానీ, వ్య‌క్తిగ‌తంగా గానీ సాగించే తీవ్ర‌వాద చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేసే ల‌క్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఎన్ఐఏకు ఢిల్లీలో ప్ర‌ధాన కార్యాల‌యం, హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఎన్ఐఏ ప‌రిధిలో 2017లో 27 కేసులు న‌మోద‌య్యాయి. 2018లో 39 కేసులు న‌మోదు కాగా అందులో రెండు కేసులు ఐఎస్ఐఎస్‌తో ముడిప‌డి ఉన్న‌వి. ఢిల్లీ, కోయంబ‌త్తూరులో ఐస్ఐఎస్ఐ అనుమానితులు ప‌ట్టుబ‌డిన వ్య‌వ‌హారాల్లో ఎన్ఐఏ కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు సాగిస్తోంది. మ‌రో 8 కేసులు మావోయిస్టు, నక్సల్స్ కార్య‌క‌లాపాల‌పై కాగా, 9 కేసులు పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌వాద కార్య‌క‌లాపాలకు సంబంధించిన‌వి. మిగిలిన కేసులు కూడా దాదాపు తీవ్ర‌వాద‌, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌తో పాటు దొంగ‌నొట్ల ముఠాల‌వే కావ‌డం విశేషం.

జగన్‌పై దాడి కేసే 2019లో ఎన్ఐఏ తొలి కేసు

హైద‌రాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయం ఏపీ, తెలంగాణా ప‌రిధిలోని కేసులను ప‌రిశోధిస్తుంది.

ప్రస్తుతం RC-02/2015/NIA/HYD నెంబ‌ర్‌తో విశాఖపట్నం రైల్వే స్టేష‌న్‌లో దొరికిన 5,01,500 రూపాయల విలువ చేసే దొంగ‌నోట్ల కేసును ఎన్ఐఏ ద‌ర్యాప్తు చేస్తోంది.

2019లో ఎన్ఐఏ తొలి కేసు జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన‌దే. ఈమేరకు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది.

నారా చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, Facebook/Nara Chandrababu Naidu

‘రాష్ట్ర ప్రభుత్వం తీరువల్లే ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు’

రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ... జగన్‌పై దాడి విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యవహరించిన తీరు కార‌ణంగానే కేసు ఎన్ఐఏ వ‌ర‌కూ వెళ్లిందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, డీజీపీ స‌హా స్పందించిన తీరును ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చారు.

సానుభూతి కోసమే జగన్ కోడికత్తి డ్రామా ఆడుతున్నారని అప్పట్లో హోం మంత్రి, డీజీపీ, మంత్రులు విమర్శలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం కేంద్ర పౌర విమానయాన శాఖ పరిధిలో ఉందని, అక్కడ భద్రత వ్యవహారాలు చేసేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సీఐఎస్ఎఫ్ కాబట్టి ఈ వ్యవహారంలో రాష్ట్రాన్ని నిందించటం తగదని అన్నారు.

ఎన్ఐఏ అధికారికంగా నోటీసులు ఇస్తే ద‌ర్యాప్తున‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల్సిందేన‌ని పురుషోత్తం రెడ్డి అన్నారు. అయితే ఎన్ఐఏ దర్యాప్తు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని, ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్న‌ది ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల చేతుల్లో ఉంద‌ని తెలిపారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లకు అనుమ‌తులు ఇవ్వటం, ఇవ్వకపోవటం అనే అధికారాలు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉన్నాయ‌ని తెలిపారు.

‘ద‌ర్యాప్తు సంస్థ‌ల మీద విశ్వాసం లేద‌న‌డం స‌రికాదు’

విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ న్యాయ‌నిపుణులు పి శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేసే విధానం స‌రికాద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రి ప‌రిధి వారికి ఉంటుంద‌ని, దానికి భిన్నంగా ద‌ర్యాప్తు సంస్థ‌ల మీద విశ్వాసం లేద‌న‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. కేసును ఎన్ఐఏకు అప్పగించటాన్ని సవాల్ చేస్తూ.. ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌కి గానీ, సుప్రీంకోర్టుకి కానీ అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో రాజ‌కీయంగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి స‌మ‌ర్థ‌నీయం కాద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు మీద విశ్వాసం లేద‌ని ఒక‌రు, కేంద్ర సంస్థ‌ల మీద న‌మ్మ‌కం లేద‌ని మ‌రొక‌రు మాట్లాడ‌డం భ‌విష్య‌త్తుకి మంచిది కాద‌న్నారు. కోడికత్తితో దాడి కేసు విచారణ ఎన్ఐఏ కింద‌కు వ‌స్తుందా రాదా అనే విష‌యాల‌లో ఏపీ ప్ర‌భుత్వానికి అభ్యంత‌రాలు ఉంటే ఉన్న‌త న్యాయ‌స్థానాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని, అందుకు భిన్నంగా ద‌ర్యాప్తుకి స‌హ‌క‌రించ‌కుండా కాల‌యాప‌న చేయ‌డం త‌గ‌ద‌ని శ్రీనివాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)