సహజీవనంలో ఉన్నప్పుడు సెక్స్ చేస్తే రేప్ చేసినట్లు కాదు: సుప్రీంకోర్టు

- రచయిత, మీనా కొట్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సహజీవనంలో ఉన్న స్త్రీ, పురుషుల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తెలిపింది.
బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
తనతో సహజీవనం చేస్తున్న డాక్టర్ తనపై అత్యాచారం చేశారని మహారాష్ట్రకు చెందిన ఓ నర్స్ కోర్టుకెక్కారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పారని ఫిర్యాదు చేశారు.
ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ''సహజీవనంలో ఉన్న వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక బంధాన్ని అత్యాచారంగా పేర్కొనలేం '' అని తీర్పునిచ్చిందని లీగల్ కేస్ జర్నలిస్ట్ సుచిత్ర మోహంతి చెప్పారు.

ఇంతకీ కేసు వివరాలు ఏమిటి?
కేసు పెట్టిన మహిళ మహారాష్ట్రలోని ఒక మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. అక్కడే ఒక డాక్టర్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. వారిద్దరు కొన్నాళ్లు సహజీవనం చేశారు. తర్వాత ఆ డాక్టర్ ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నారు.
''తన సహజీవన భాగస్వామి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. కానీ, ఇప్పుడు వేరే మహిళను పెళ్లి చేసుకున్నారు' అని ఆ డాక్టర్ పై నర్సు కేసు పెట్టారు.
దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ దుర్రం మురళీధర్ సొనర్ ఆ కేసును కొట్టివేయాలని బాంబే హైకోర్టులో పిటషన్ దాఖలు చేశారు. అయితే, డాక్టర్ పిటిషన్‌ను హైకోర్ట్ కొట్టివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆరునెలల అనంతరం హైకోర్ట్ ఉత్తర్వులను సవాలు చేసిన డాక్టర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు.
జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం డాక్టర్ పిటిషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
''పరస్పర అంగీకారంతో కూడిన శృంగారానికి, అత్యాచారానికి మధ్య తేడా ఉంది. సహజీవన భాగస్వామి ఇతరత్రా కారణాలతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాధితురాలు అత్యాచారం చేశారని అంటే అది చట్టప్రకారం నేరం కిందకు రాదు. బాధితురాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రేమలో పడ్డారు. చాలా కాలంగా ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే, తన భాగస్వామి వేరే వ్యక్తిని పెళ్లాడారని తెలిశాక ఆమె ఫిర్యాదు చేశారు' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
సహజీవనం గురించి ప్రజల ఆలోచన ఏమిటి?
పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా స్త్రీ, పురుషులు కలిసి జీవించడమే సహజీవనమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతోనే సహజీవనం కొనసాగుతుంది. ఈ బంధంలో ఎలాంటి సామాజిక కట్టుబాట్లు, చట్టపరమైన హక్కులు ఉండవు.
ఇలాంటి స్థితిలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉంటే దానిని అత్యాచారంగా పరిగణించరు. సుప్రీం కోర్ట్ కూడా ఇదే విషయంపై స్పష్టతనిచ్చింది.
'చట్టంలో రేప్ అంటే ఏంటో వివరణ ఉంది. కానీ, భిన్నమైన సందర్భాల్లో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు' అని లాయర్ విరాగ్ గుప్తా వివరించారు.

ఫొటో సోర్స్, iStock
ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత కేసులు పెట్టడం, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చి తప్పిన తర్వాత కేసులు పెట్టడం, కేసు పెట్టినప్పడు కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకపోవడం వల్ల ఇలాంటి కేసులు నీరుగారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు.
''ఈ కేసులో డాక్టర్, నర్స్‌ల మధ్య సంబంధం ఉంది. కానీ, వారిద్దరు సహజీవనంలో ఉన్నందున కోర్టు అత్యాచారంగా పేర్కొనలేమని తెలిపింది. చట్ట ప్రకారం మహిళ అనుమతి లేకుండా బలవంతంగా ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడాన్నే అత్యాచారంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ కేసులో బాధితురాలి ఆరోపణ చట్టం ముందు నిలవలేదు. అందుకే సహజీవనానికి సంబంధించి పార్లమెంట్ కొత్తగా చట్టాలు తీసుకరావాల్సిన అవసరం ఉంది'' అని విరాగ్ గుప్తా వివరించారు.
ఇవి కూడా చదవండి
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది
- క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








