వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన జగన్

జగన్

ఫొటో సోర్స్, Chandrakanth

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

దీంతో జగన్‌ ఎడమ చేతికి గాయమైంది. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరికి వచ్చిన వ్యక్తి జగన్‌పై దాడి చేసినట్లు హోం మంత్రి వెల్లడించారు.

కోడి పందేల సమయంలో ఉపయోగించే కత్తితో అతను దాడి చేశాడు.

దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు.

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తాను సురక్షితంగానే ఉన్నానని జగన్ ట్వీట్ చేశారు.

విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన వైఎస్ జగన్ తరువాత బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు.

వైద్యులు జగన్‌ ఎడమ చేతికి అయిన గాయాన్ని పరిశీలించి, పరీక్షల నిమిత్తం రక్తాన్ని తీసుకున్నారు. ఆయనకు ఎనిమిది కుట్లు పడ్డాయని వైద్యులు వెల్లడించారు.

శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులంతా ‘‘సీఎం.. సీఎం’’ అంటూ నినాదాలు చేశారు.

వీడియో క్యాప్షన్, వీడియో: జగన్‌పై దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జగన్ సురక్షితం.. హైదరాబాద్‌కు పయనం

వైఎస్ జగన్‌కు స్వల్ప గాయమైందని, ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ అనురాగ్ ఠాకూర్ మీడియాకు చెప్పారు.

విమానాశ్రయం లోపల భద్రతను సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని, బయట భద్రతను మాత్రమే తాము చూస్తామని.. ఈ నేపథ్యంలో కత్తి విమానాశ్రయం లోపలికి ఎలా వెళ్లిందనేది పరిశీలించాల్సి ఉందని డీజీపీ చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలానికి చెందిన శ్రీనివాసరావు విమానాశ్రయం లోపల ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారని అన్నారు. తనను తాను జగన్ అభిమానిగా ఆయన చెప్పుకుంటున్నారన్నారు.

నిందితుడి జేబులో 10 పేజీల లేఖ ఒకటి ఉందని, దానిని సీఐఎస్ఎఫ్‌ తమకు అందజేసిందన్నారు.

విశాఖపట్నంలో దాడికి గురైన జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. జగన్‌ను పరామర్శించేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.

విమానాశ్రయంలో ఎవ్వరితోనూ ఆయన మాట్లాడలేదు. ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన తన వాహనంలో బయలుదేరి వెళ్లారు.

‘సెల్ఫీలతో జాగ్రత్తగా ఉండాలి’

శ్రీనివాసరావు.. ఎడమ చేతితో సెల్ఫీ తీసుకుంటూ, కుడి చేతితో కత్తిని తీసుకుని జగన్‌పై దాడి చేశారని డీజీపీ చెప్పారు.

సెల్ఫీలతో దాడులు జరిగే ఆస్కారం ఉందని, కాబట్టి సెల్ఫీల విషయంలో రాజకీయ నాయకులు, వారి భద్రతా సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో చెప్పారు.

సెల్ఫీలు అనే సరికొత్త వ్యవహారంతో రాజకీయ నాయకుల భద్రత ప్రమాదంలో పడిందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ సంఘటనపై విచారణ జరపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభును కోరారు. విమానాశ్రయంలోకి, లాంజ్‌లోకి ఒక వ్యక్తి కత్తిని ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు.

హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. 294వ రోజు పాదయాత్ర ముగించుకుని గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆయన హాజరవుతుంటారు.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, దాడి జరిగిన తర్వాత స్వల్ప గాయంతో వైఎస్ జగన్

"దాడి చేసింది హోటల్ వెయిటర్"

జగన్‌పై దాడికి పాల్పడింది హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస రావు అనే యువకుడు అని ప్రత్యక్ష సాక్షి మజ్జి శ్రీనివాసరావు తెలిపినట్లు సాక్షి పేర్కొంది. అతను సెల్ఫీ తీసుకుంటానని జగన్‌ను అడగ్గా ఆయన సరేనన్నారని, మీరు కాబోయే మఖ్యమంత్రి అంటూ నవ్వుతూ దగ్గరకు వచ్చిన శ్రీనివాసరావు జగన్‌పై కత్తితో దాడి చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు

దాడి జరిగిన వెంటనే అతడిని విమానాశ్రయ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఈ దాడిని ఖండిస్తున్నాం: హోం మంత్రి

"శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానని చెప్పి జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఖండిస్తున్నాం. నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజాప్రతినిధులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం" అని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

వైఎస్ జగన్‌పై దాడికి ఉపయోగించిన కత్తి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కోడి పందేల సందర్భంగా కోడి కాలుకు కట్టే కత్తిని ఈ దాడికి ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు
వైఎస్ జగన్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది

హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను ఆయన భార్య భారతి, తల్లి విజయ లక్ష్మి పరామర్శించారు.

ఆయనకు తొమ్మిది కుట్లువేశామని .. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్‌కు ఫోన్ చేశారు.

ఆయన ఆరోగ్యం.. దాడి గురించి ఆరా తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)