డేజా వూ: ‘ఎక్కడో చూసినట్టుందే’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ 8 విషయాలూ మీకోసమే

ఫొటో సోర్స్, Getty Images
అదో విచిత్రమైన అనుభూతి - మీరు అంతకు ముందు అక్కడికి వెళ్లారనిపిస్తుంది. అంతకు ముందే ఆ సంభాషణను విన్నారనిపిస్తుంది. 'ఎక్కడో చూసినట్టుందే.. ఎప్పుడో విన్నట్లుందే' అనిపిస్తుంటుంది.
కానీ అది అసాధ్యం అని మీకూ తెలుసు.
అదే.. డేజా వూ.

ఫొటో సోర్స్, Getty Images
1. డేజా వూ కు ప్రేరణ ప్రయాణాలే
డేజా వూ అనేది ప్రధానంగా ప్రదేశాలకు సంబంధించిన భావం. మనకు పూర్తిగా కొత్త లేదా విచిత్రమైన అనుభవాలు ఎదురైనప్పుడు ఇలాంటి భావం కలుగుతుందని డేజా వూ పరిశోధకులు క్రిస్ మౌలిన్ తెలిపారు.
మనకు తెలియని ప్రదేశాలు.. మనకు ఇది ముందే తెలుసు అనే బలమైన భావనకు, అది జ్ఞాపకం కాదు అన్న విచక్షణకు మధ్య ఒక ఘర్షణను సృష్టిస్తాయి. మనం ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే, అంత ఎక్కువగా ఈ డేజా వూ అనుభూతి కలుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2. యువతలోనే ఎక్కువగా డేజా వూ
యువతలోనే ఎక్కువగా డేజా వూ అనుభవాలు ఎదురవుతాయి. అయితే అది నెలకు ఒకసారికి మించి కలగదు.
40-50 వయసు వచ్చే నాటిని అలాంటి అనుభవాల సంఖ్య సగానికి పడిపోతుంది. అదే 50 దాటితే అలాంటి అనుభవం ఏడాదికి ఒకసారి ఎదురైతే అదే ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
3. కొంతమందికి రోజంతా డేజా వూ అనుభూతి
చాలా మందికి అది కేవలం అరుదైన, అతి తక్కువ సమయం మాత్రమే ఉండే అనుభూతి. అయితే కొన్ని అరుదైన సందర్భాలలో డేజా వూ ఒక తీవ్రమైన సమస్యగా కూడా మారొచ్చు.
బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లీసాకు 22 ఏళ్ల వయసులో డేజా వూ అనుభవాలు ఎదురుకావడం ప్రారంభించాయి. అవి దాదాపు రోజంతా ఉంటాయని ఆమె తెలిపారు.
''కొన్నిసార్లు నేను ఉదయం లేవగానే, ఇదంతా నాకు ముందే అనుభవంలోకి వచ్చిందనిపిస్తుంది'' అని లీసా తెలిపారు.
ఇలాంటి సంఘటనలు ఆమెకు తరచుగా అనుభవంలోకి వచ్చేవి. అవి మరింత తీవ్రతరం కూడా అయ్యాయి. అవి ఆమె ఇంద్రియాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించాయి.
చివరికి అది 'టెంపొరల్ లోబ్ ఎపిలెప్సీ' అనే వ్యాధి అని గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
4. జ్ఞాపకాల సర్క్యూట్‌లో తప్పుల కారణంగా డేజా వూ భావన
క్రమం తప్పకుండా, తీవ్రమైన డేజా వూ అనుభూతిని పొందే వారిని పరిశీలించినప్పుడు శాస్త్రవేత్తలు దానికి తగిన కారణాలను అర్థం చేసుకోగలిగారు.
ఈ అనుభూతి మెదడులోని టెంపోరల్ లోబ్ అనే భాగానికి సంబంధించినది అని భావిస్తున్నారు. మీరు అలాంటి అనుభూతిని గతంలోనే పొందారు అనే భావాన్ని కలిగించడానికి ఇదే కారణం.
ఏదైనా సర్క్యూట్ అది ప్రతిస్పందించకూడని సమయంలో ప్రతిస్పందిస్తే అది ఒక తప్పుడు అనుభూతిని లేదా తప్పుడు జ్ఞాపకాన్ని కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
5. మీ మెదడులోని 'నిజ నిర్ధారణ' వ్యవస్థ వాస్తవాన్ని పునరుద్ధరిస్తుంది
మన మెదడులోని టెంపోరల్ లోబ్‌లో ఏం జరుగుతుందో దానిని పర్యవేక్షించడానికి మరో వ్యవస్థ ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
దీనినే 'నిజ నిర్ధారణ' వ్యవస్థగా భావిస్తున్నారు. ఇదే మీ తప్పులను గుర్తించేలా చేసి డేజా వూ భావనను అంతమొందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
6. భవిష్యత్తును ఊహించగలరని మీరు అనుకోవచ్చు..
ఒక బలమైన డేజా వూ అనుభూతిలో, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతుందని మీరు భావిస్తుండవచ్చు.
మన భవిష్యత్తును ఊహించే జ్ఞాపకశక్తి వ్యవస్థే దీనికి సహాయపడుతుందని క్రిస్ మౌలిన్ అంటారు.
''మనకు జ్ఞాపకశక్తి ఉన్నది అందుకే. అందుకే మనం మళ్లీ మళ్లీ తప్పులు చేయకుండా.. ముందు ఏం జరుగుతుందో ఊహించగలుగుతాం'' అన్నారు మౌలిన్.
కొన్నిసార్లు డేజా వూలో సాధారణంకన్నా ఎక్కువగా మెదడులోని భాగాలు పాలు పంచుకోవచ్చు. అవి మీ ఉద్వేగాలను, భావాలను తాకవచ్చు. అప్పుడు మీకు తర్వాత జరగబోయేదేమిటో తెలుస్తున్నట్లు అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
7. డేజా వూకు వ్యతిరేకం జమై వూ
జమై వూ అంటే మనకు అనుభవంలోకి వచ్చినదే మనకు కొత్తగా అనిపించే భావన.
మీకు తెలిసిన వారి ముఖం చూసినప్పుడు హఠాత్తుగా వాళ్లు కొత్తగా అనిపించడం ఇలాంటిదే.
పదాలతో కూడా ఇలాంటి అనుభవం ఎదురు కావచ్చు. మీరు ఏదైనా రాయగానే మీకు అది తప్పు అనిపించొచ్చు.
మీకు తెలిసిన ఒక పదాన్ని పదేపదే పలికి, అది దాని అర్థం కోల్పోయి, కేవలం శబ్దం మాత్రం మిగిలేలా చేసినపుడు ఇలాంటి అనుభూతిని పొందొచ్చని క్రిస్ మౌలిన్ అంటారు.

ఫొటో సోర్స్, Historic Images / Alamy Stock Photo
8. డేజా వూ అన్న పదాన్ని పలికిన మొదటి వ్యక్తి పారా సైకాలజిస్ట్ ఎమిలీ బొయిరాక్
ఇలా తప్పుడు అనుభూతిని రేకెత్తించే డేజా వూ అన్న పదాన్ని మొట్టమొదటిసారి 1876లో ఎమిలీ బొయిరాక్ అనే శాస్త్రవేత్త ఫ్రెంచి పత్రిక 'రెవ్యూ ఫిలాసఫిక్'లో ఉపయోగించారు.
చాలాకాలం పాటు డేజా వూను ఒక విపరీత మానసిక ప్రవర్తనగా పరిగణించేవారు.
ఇవి కూడా చదవండి:
- మూడు కూనలు పుట్టాక తన తోడును చంపేసిన ఆడ సింహం
- లండన్: అంబేడ్కర్ నివసించిన ఇంటిని ప్రతిరోజూ సందర్శించే పనిమనిషి స్ఫూర్తి గాథ
- #MeToo: ఆరోపణలు చేసిన మహిళల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?
- ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయం: ‘వీటిని వాడొచ్చు, వాడాక తినేసేయొచ్చు కూడా’
- బ్రిటన్‌లో పెరుగుతున్న మత విద్వేష నేరాలు
- BBC Special: భారత బీచ్‌లలో అణు ఇంధనం... అందాలంటే 30 ఏళ్లు ఆగాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








