స్టాచ్యూ ఆఫ్ యూనిటీ: సర్దార్ పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరవు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. గుజరాత్లోని ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ .. అంటే ఐక్యతా విగ్రహాన్ని ఈ నెల 31వ తేదీన మోదీ ఆవిష్కరించనున్నారు. దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో నర్మద నదీ తీరంలో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎత్తైనదిగా భావిస్తున్నారు. స్వతంత్ర భారతదేశపు తొలి హోంమంత్రి పటేల్. అయితే నర్మద జిల్లాలోని రైతులు విగ్రహ నిర్మాణం విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీర్చకుండా వేల కోట్ల రూపాయలు విగ్రహం కోసం ఖర్చు పెట్టడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఈ పరిణామాలపై బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛరా అందిస్తున్న కథనం.
ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. అదే రోజున గుజరాత్‌లో 182 అడుగుల పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ప్రభుత్వం దీనికి ఐక్యతా విగ్రహమని పేరు పెట్టింది.
ఒక లక్షా నలభై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, రెండు వేల టన్నుల కాంస్యం, డెబ్బైవేల టన్నుల సిమెంటును ఇందులో వినియోగించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘‘విగ్రహం వల్ల స్థానికులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆదాయం లభిస్తుంది. వారి ఆర్థికస్థితి మెరుగుపడుతుంది’’ అని సర్దార్ సరోవర్ నర్మదా నిగం జేఎండీ సందీప్ కుమార్ చెప్పారు.
ఇది ప్రభుత్వ భావన. అయితే ఇప్పటికే ఎంతో గౌరవం, గుర్తింపు పొందిన వారి విగ్రహాలపై కోట్లు కుమ్మరించేకంటే, అణగారిన వర్గాల బతుకులను బాగు చేయడంపై దృష్టిపెడితే మంచిదని కొందరు అంటున్నారు.
నర్మద నది సమీపంలో నివసించే రైతులు, ఇప్పటికీ తాము సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకవైపు వేల కోట్ల రూపాయలతో ఐక్యతా విగ్రహం నిర్మిస్తుండగా, మరో వైపు ఇక్కడి ప్రజల కష్టాలు మాత్రం ఇంతవరకూ తీరలేదు.

నానా పిపలియా గ్రామంలో విజేంద్ర తద్వీ నివసిస్తున్నారు. ఆయన ఒక రైతు. పటేల్ విగ్రహానికి, ఈ ఊరికి మధ్య దూరం 12 కిలోమీటర్లు. ఆయన మిరపకాయలు, కూరగాయలు పండిస్తున్నారు. నర్మదకు దగ్గర్లోనే పొలం ఉన్నా ఆయన పొలానికి సాగు నీరు అందడం లేదు. ఆయన పొలం గుండా చిన్న కాలువ పోతున్నప్పటికీ, అది ఎప్పుడూ ఎండిపోయి ఉంటుంది. 2013లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ అది నెరవేరలేదు.
‘‘ఇక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో కర్జన్ డ్యాం ఉంది. ఒక చిన్న కాలువ మా పొలం గుండా పోతోంది. కానీ ఇంతవరకూ చుక్క నీరైనా అందలేదు’’ అన్నారు విజేంద్ర.

గోరా గ్రామంలో తన పొలం సమీపం నుంచే కాలువ పోతున్నప్పటికీ మరో రైతు భోలాబాయికి కూడా సాగు నీరు అందడం లేదు.
‘‘సాగు నీరు అందడం లేదు. కాలువ ఎండిపోయి ఉంది. వానలే మాకు ఆధారం. వానలు సరిగ్గా పడకుంటే పంటలు ఎండిపోతాయి’’ అని భోలాబాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దుర్భర పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి రైతులు కాలువల నుంచి అక్రమంగా నీళ్లు తోడుకుంటూ ఉంటారు.
వీరి బాధలను బీబీసీ జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. అయితే ప్రజల్లో మాత్రం పెద్దగా ఆశలు లేవు.

ఆదివాసులు, రైతుల హక్కుల కోసం పోరాడే లఖన్, అసలు సమస్య ఏమిటో చెబుతున్నారు.
‘‘సర్దార్ సరోవర్ డ్యాం ఆయకట్టు తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఆమదాల, భదరవా, సండ్రోలీ వంటి గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. గుజరాత్‌లోని మధ్యప్రాంతాలకు నీళ్లు అందుతాయి.. కానీ మాకు రావు’’ అని లఖన్ తెలిపారు.
విగ్రహం చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం 20 గ్రామాలకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదో, డబ్బులను ఏ స్థాయిలో ఖర్చుచేయగలదో ఇక్కడి ప్రజలు కళ్లారా చూశారు. అయితే వారిప్పుడు తమ సమస్యలను పట్టించుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు.

గిరిజనుల నిరాహార దీక్ష
కాగా, సర్దార్ సరోవర్ డ్యాం వల్ల నిరాశ్రయులైన 72 గ్రామాల గిరిజనులు కూడా పటేల్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నిరసన తెలుపుతున్నారు. తమకు తగిన నష్టపరిహారం ఇప్పటికీ చెల్లించలేదని, కాబట్టి విగ్రహావిష్కరణ రోజు దాదాపు 75 వేల మంది గిరిజనులు అన్నం వండుకోకుండా, తినకుండా నిరాహార దీక్ష చేసి నిరసనలో పాల్గొంటారని గిరిజన నాయకుడు డాక్టర్ ప్రఫుల్ వసావా తెలిపారని ది హిందూ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
తాము అభివృద్ధికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటానికి, గుజరాత్ బిడ్డ అయిన పటేల్ గౌరవాన్ని పెంచడానికి వ్యతిరేకం కాదని, తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేయటానికే ఈ నిరసన చేపడుతున్నామని ఆయన వివరించారు.
ప్రభుత్వాల భారీ పథకాలకూ... ప్రజల ప్రయోజనాలకూ మధ్య వైరుధ్యం ఎప్పుడూ ఉండేదే. ప్రజల అసంతృప్తులను ప్రభుత్వాలు ఎలా తగ్గిస్తాయన్నదే అసలు ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..
- 80 ఏళ్లుగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?
- ఈయన మాట వింటే ఇంట్లో సిరుల పంటే!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








