వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డిపై కత్తితో దాడి: ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట- సీఎం చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. గురువారం రాత్రి ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. అందులో కీలక అంశాలు. ఆయన మాటల్లోనే..

జగన్ పై దాడి వ్యహహారం బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది. ఇలా జరగవచ్చని నటుడు శివాజీ గతంలోనే చెప్పారు.

జగన్ హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లిపోయారు? నిబంధనల ప్రకారం ఇది క్రిమినల్ కేసు కనుక జగన్ ఇక్కడే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలి. అలా కాకుండా హైదరాబాద్ తర్వాత ఇంటికి వెళ్లి.. అక్కడ మాట్లాడుకోని మళ్లీ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గాయపడిన జగన్‌ను విమానం ఎలా ఎక్కనిచ్చారు?

విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఈ ఘటనకు బాధ్యులు కేంద్రం కాదా?

సీఎంను కాదని గవర్నర్ నేరుగా డీజీపీకి అధికారులకు ఫోన్ చేసి నివేదిక కోరడం ఏంటి?

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

జగన్ పై దాడి చేసింది అతని వీరాభిమాని అని .. నిందితుని కుటుంబం అంతా చెబుతోంది. మీ వీరాభిమాని.. ఈ డ్రామా ఆడారంటే ఏం చెప్పాలి? వైసీపీకి సానుభూతి రావడం కోసం నేనిలా చేశానని నిందితుడి దగ్గర లభించిన లేఖలో ఉంది.

బాధ్యత కలిగిన వ్యక్తి తనపై దాడి జరిగితే పోలీసులకు చెప్పాలి కదా. బాద్యతా రాహిత్యంగా ఎందుకు హైదరాబాద్ వెళ్లారు? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు?

ఘటన మధ్యాహ్నం 12.40కి జరిగితే ఇక సీఐఎస్ఎఫ్ అధికారులు.. 4.30కు ఫిర్యాదు చేశారు. కత్తిని వెంటనే ఎందుకు తీసుకోలేదు?

నిందితుడు

ఫొటో సోర్స్, BBC/Ugc

ఫొటో క్యాప్షన్, పోలీసుల అదుపులో నిందితుడు

ఈ దాడి నెపంతో కోర్టుకు వెళ్లి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు.

తెలంగాణ మాకు సెక్యురిటీ లేదు.. ఇవ్వలేమని చెబుతోంది. ఇదంతా తెలంగాణ, కేంద్రం ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలు.

తిత్లీపై మాట్లాడని కేసీఆర్, కేటీఆర్, కవిత ఈ ఇష్యూపై ఎందుకు స్పందిచారు. మీకు (కేసీఆర్, కేటీఆర్, కవిత) ఏపీపై ద్వేషం ఎందుకు?

ఇక్కడి నుంచి వీరోచితంగా వెళ్లిన జగన్ ఆస్పత్రికి వెళ్లి పాథటిక్గా పడుకున్నారు.

భద్రత పెంచమని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అంతకు ముందు విజయసాయి రెడ్డి .. ‘‘కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం జరిగిందంటే ఇది కచ్చితంగా కుట్రే. దీని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి భద్రతను మరింత పటిష్ఠం చేయాలని గతంలో ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.’’ అన్నారు.

ఆయన ప్రయాణించే వాహనాలు కూడా తరచూ మరమ్మతులకు గురై మొరాయిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటే వారి ఉద్దేశం ఇదేనా?’’ అని ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: జగన్‌పై దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

శ్రీనివాస రావు వద్ద లభించిందని చెబుతున్న లేఖలో ఏముంది?

విపక్ష నేత జగన్మోహనరెడ్డిపై దాడి చేసిన శ్రీనివాస్ రావు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న లేఖను పోలీసులు విడుదల చేశారు.

''అన్నా..! ప్రజల హృదయంలో కొలువుండి ప్రజలు దైవంగా భావించే వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా అభిమానం. ఆయన పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు లేకుండా చాలా ఆనందంగా ఉండేవారు. నేడు ప్రభుత్వ విధానాల వల్ల, పథకాల వల్ల చాలా కష్టాలు పడుతున్నారు'' అంటూ మొదలుపెట్టిన సుదీర్ఘ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారంటూ వైసీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేయాలో సూచనలు చేశారు. చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ జగన్ అధికారంలోకి వస్తే ప్రజలను ఆదుకోవాలని కోరారు.

ఆ వివరాలు

‘‘ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల, పథకాల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అర్హులకు పథకాలు చేరడం లేదు, లబ్ధి పొందినవారే మళ్లీ మళ్లీ లబ్ధి పొందుతున్నారు.

దోపిడీ, లంచగొండితనం, దళారి వ్యవస్థ, మద్యపానంపై చంద్రబాబునాయుడి పాలన నడుస్తోంది.

జగన్‌పై కక్షతోనో, రాజకీయ కుట్రతోనే ఈ దాడి చేయలేదు. ఏ పదవి ఆశించి కానీ, సెలబ్రిటీగా మారాలని కానీ ఈ పని చేయలేదు. చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు మన పరిపాలనలో మనం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు పడకూడదనే ఆలోచనతోనే ఇలా చేశాను.

bbc
ఫొటో క్యాప్షన్, లేఖ

మీరు రైతుల కోసం ప్రవేశపెడతానంటున్న పథకం అందరు రైతులకూ లబ్ధి చేకూర్చేలా లేదు. రైతులందరికీ సమాన న్యాయం చేయాలంటే విత్తనాలు, ఎరువులు, రసాయన మందుల ధరలు 80 శాతం తగ్గించాలి.

రేషన్ తీసుకోవడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. రెండేసి రోజులు పనులు మానుకుని రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ఎలాంటి చర్యా తీసుకోలేదు.

ప్రభుత్వ విద్యావ్యవస్థను బాగు చేయాలి. నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు వేతనం ఇస్తే మంచి విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందిస్తారు. మీరు అమ్మఒడి పథకంలో ఇస్తామంటున్న డబ్బును నిరుద్యోగులకు కేటాయిస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.

ప్రభుత్వమే స్వయంగా ల్యాబ్‌లు ఏర్పాటుచేసి 80 శాతం తగ్గింపు ధరకు పేదలకు వైద్య పరీక్షలు అందేలా చూడాలి. దీనివల్లేమీ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు.

జగన్

ఫొటో సోర్స్, Chandrakanth

పవన్ కల్యాణ్‌కు కులపిచ్చి ఉంది. ఆయన అన్ని కులాలనూ సమానంగా చూడడం లేదు.

మన ప్రభుత్వం వచ్చాక కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.2 లక్షలు ఇచ్చి, వారికి ప్రభుత్వమే జీవనోపాధి కల్పించాలి.

తిత్లి తుపాను బాధితులకు ఆరు నెలల పాటు బియ్యం, నిత్యవసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఒక నెల రేషన్ సరకు ఇవ్వడం ఆపేసి తిత్లి బాధితులకు ఆ సరకులు ఇవ్వాలి.

ఈ ఘటనలో నాకు ప్రాణహాని కలిగితే నా అవయవాలు దానం చేయండి.’’ అని ఆ లేఖలో ఉంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)