NIA- ‘ISIS స్ఫూర్తితో దేశంలో భారీ స్థాయిలో దాడులకు కుట్ర.. భగ్నం చేశాం’

ఫొటో సోర్స్, AFP
దిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 17 ప్రదేశాల్లో సోదాలు, దాడులు జరిపి 10 మందిని అరెస్ట్ చేశామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆత్మాహుతి దాడులు చేయాలని వీరంతా భావిస్తున్నారని, వారు ప్రణాళికలు రచిస్తున్న సమయంలోనే తాము గుర్తించి ఈ అరెస్టులు జరిపామని బుధవారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఐఏ ఐజీ తెలిపారు.
దిల్లీ, మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు, దాడులు జరిపామని చెప్పారు. భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుదాలు, మందుగుండు సామాగ్రి, దేశీయంగా తయారైన రాకెట్ లాంచర్, దాదాపు 7.5 లక్షల రూపాయల నగదు, 100 మొబైల్ ఫోన్లు, 135 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్‌లు తమ సోదాల్లో దొరికాయని వివరించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.
అరెస్ట్ చేసిన 10 మందిని ప్రశ్నిస్తున్నామని, విచారణ కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు.
బాంబు తయారీకి ప్రయత్నం
తాము అరెస్ట్ చేసిన వారు బాంబు తయారీకి ప్రయత్నించారని ఎన్ఐఏ ఐజీ వెల్లడించారు.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ లేదా ఐసిస్ లేదా ఐఎస్ఐఎస్) నుంచి స్ఫూర్తి పొందిన వీరంతా ‘హర్‌కత్ ఉల్ హబ్ర్ ఎ ఇస్లామ్’ పేరిట దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు చేయాలనుకున్నారని తెలిపారు.
‘హర్‌కత్ ఉల్ హబ్ర్ ఎ ఇస్లామ్’కు చెందిన ముఫ్తీ సుహైల్ ఇంటర్నెట్ ద్వారా విదేశాల్లో ఉన్న ఒక హ్యాండ్లర్ (అనుసంధానం చేసే వ్యక్తి)తో కలిశారని, ఐఎస్ ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ ఐజీ చెప్పారు.

వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా ప్రణాళిక.. బృందంలో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి
- మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో 10 మందిని అరెస్ట్ చేశాం. వీరిపై తదుపరి విచారణ జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సోదాలు, దాడులు జరుగుతున్నాయి.
- ఉత్తరప్రదేశ్ లోని అమ్‌రోహా ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ముఫ్తీ సుహైల్ ఈ ‘హర్‌కత్ ఉల్ హబ్ర్ ఎ ఇస్లామ్’కు కీలక నేత. అతన్ అమ్‌రోహాలోని ఒక మసీదులో మౌల్వీగా పనిచేస్తున్నారు. అతనే అందరినీ ప్రభావితం చేయటంలో కీలకపాత్ర పోషించారు. తమకు అవసరమైన వివిధ వస్తువులు తీసుకురావాలని అతనే ఆదేశాలు జారీ చేసేవారు. ఎవరు, ఎప్పుడు, ఎవరితో, ఎలా కలవాలో, వారితో ఏం మాట్లాడాలో కూడా చెప్పేవారు.
- ఈ బృందం ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతోంది.
- ముఫ్తీ సుహైల్ ఈ కార్యక్రమాల కోసం తన డబ్బును ఖర్చు చేశారు. అలాగే, కొందరు బంగారాన్ని దొంగతనం చేసి, దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆత్మాహుతి దాడులకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారు.
- వీలైనంత త్వరగా దాడులు చేయాలని వారు చాలా వేగంగా సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బాంబును తయారు చేయాలని, ఈ బాంబును పేల్చే క్రమంలో అవసరమైతే ఆత్మాహుతికి కూడా సిద్ధం కావాలని వారు అనుకున్నారు.
- పరస్పరం సమాచారాన్ని పంచుకునేందుకు, ప్రణాళికలు రచించుకునేందుకు వారు వాట్సాప్, టెలిగ్రామ్‌లను ఉపయోగించుకున్నారు.
- ప్రాథమిక సమాచారం మేరకు ఈ బృందం గత 3-4 నెలలుగా ఈ ప్రణాళికలు రచిస్తోంది.
- దేశంలో కీలకమైన ప్రదేశాలు, ముఖ్యమైన వ్యక్తులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనుకుంది.
- ఈ క్రమంలో మాకు (NIA) సమాచారం లభించింది. దీంతో వారిపై దృష్టి పెట్టాం.
- ఇప్పటి వరకూ వీరంతా స్థానికంగానే శిక్షణ పొందారు.
- అరెస్ట్ అయిన వారంతా 20 నుంచి 30 ఏళ్లలోపు వారే. వీరిలో ఒకరిద్దరికి వెల్డింగ్ షాపు ఉంది. ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి. మరొకరు బీఏ చదువుతున్నారు. ఇంకొకరు ఆటో డ్రైవర్. వేరొకరికి బట్టల షాపు ఉంది. వీరందరికీ నాయకత్వం వహించిన ముఫ్తీ సుహైల్ మౌల్వీ.
- ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టయిన వారిలో ఒకరు అమిటీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి.
ఇవి కూడా చదవండి:
- కళ తప్పుతున్న గుజరాత్ నల్సరోవర్ సరస్సు
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- మోదీతో కేసీఆర్ భేటీ: ‘బ్రీఫింగ్ కోసమేనా?’ - చంద్రబాబు నాయుడు .
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- తూర్పుగోదావరి జిల్లాలో ఆవుపై లైంగిక దాడి వార్తలో నిజానిజాలేమిటి
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








