‘తూర్పుగోదావరి జిల్లాలో ఆవుపై అత్యాచారం జరగలేదు’: జిల్లా పోలీసు కార్యాలయం

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో ఆవుపై లైంగిక దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన బీబీసీతో.. అత్యాచారం జరిగినట్లుగా తమకు అనుమానం ఉందని యజమాని కొడుకు బీబీసీతో అన్నారు. ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు.
గోకివాడలోని నామా బుచ్చిరాజు అనే రైతు ఈ నెల 22న రాత్రి తన ఆరు ఆవులను పశువుల పాకలో కట్టేసి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూస్తే అక్కడ ఆవులు కనిపించలేదు.
దీంతో తన కుమారుడు, మరికొందరు గ్రామస్తులతో కలిసి ఊరంతా వెతికారు. అయినా ఆవుల జాడ తెలియరాలేదు.
సమీప గ్రామాల వారికి ఫోన్ చేయగా తెల్లవారుజామున తమ ఊరు నుంచి వెళ్లిన వ్యానులో ఆవులు కనిపించాయని చెప్పారు.
'ఆవుపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు'
దీంతో ఆవులను ఎవరో దొంగిలించారేమోనని బుచ్చిరాజు భావించారు. దగ్గర్లో ఉన్నపశువుల సంతల గురించి ఆరా తీశారు. ఈలోగా తెల్లవారడంతో గ్రామానికి కొంచెం దూరంలో చెట్టుకి కట్టేసి ఉన్న ఒక ఆవు ఆయనకు కనిపించింది.
'దగ్గరకు వెళ్లి చూసే సరికి చెట్టుకు కట్టిన ఆవు తీవ్ర రక్తస్రావంతో ఉంది. చనిపోయిందనుకున్నాం. దానిని కదిపేందుకు ప్రయత్నించగా కొన ఊపిరితో ఉన్నట్టు కనిపించడంతో వెంటనే గోపాలమిత్ర (పశుసంవర్థక శాఖకు అనుబంధంగా పనిచేసే గ్రామస్థాయి సహాయకులు)ని పిలిచాం' అని బుచ్చిరాజు బీబీసీకి తెలిపారు.
తాను వెళ్లేసరికి ఆవు పరిస్థితి దయనీయంగా ఉందని గోపాలమిత్ర గంగరాజు బీబీసీకి తెలిపారు. మల్లాం పశువైద్యశాల డాక్టర్ తిరుమల రావు సూచనల ప్రకారం ఆవుకు కాల్షియం అందించి, యాంటీ బయోటిక్ సహా ప్రాథమిక చికిత్స అందించినట్టు తెలిపారు.
‘ఆవుపై ఎవరో లైంగిక దాడులకు పాల్పడినట్టు స్థానికులు చెప్పారు. ఆ సమాచారాన్ని డాక్టర్ తిరుమల రావుకు తెలియజేశాను. ఆయన గోకివాడ వెళ్లారా లేదా అన్నది నాకు తెలియదు, ఆవు కొంత కోలుకోవడంతో నేను వెనక్కి వచ్చాను’ అని ఆయన బీబీసీకి చెప్పారు.

దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
ఆవుపై దాడి ఘటనకు సంబంధించి పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుచ్చిరాజు కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఆవుపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఓ మద్యం సీసా దొరికినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
జంతువులపై క్రూరమైన చర్యల నిరోధకానికి 1960లో రూపొందించిన చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ మూర్తి బీబీసీకి తెలిపారు.
ఆవుపై దాడి ఏ రీతిలో జరిగింది, ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉందని, వెటర్నరీ డాక్టర్ నుంచి మరింత సమాచారం సేకరించి విచారణ కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

మనిషి వీర్యం కనిపిస్తే ఎందుకు విచారణ జరిపించలేదు?
ఆవుపై లైంగికదాడి జరిగిందనే ప్రచారం స్థానిక మీడియాలో రావడంతో డాక్టర్ తిరుమల రావు ఈ విషయంపై స్పందించారు.
ఆయన వివరణ ప్రకారం ఆవుపై దాడి జరగడమే కాకుండా, ఆవు జననేంద్రియాల్లో మానవ వీర్యం కూడా గుర్తించినట్టు కథనాలు వచ్చాయి.
ఈ విషయం చాలామందిని విస్మయానికి గురి చేసింది. పలువురు ఈ ఘటనపై ఆగ్రహం వెలిబుచ్చారు. కొందరు బీజేపీ నేతలు ఖండన ప్రకటనలు కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆవుపై లైంగిక దాడి జరిగిందని, మానవ వీర్యాన్ని కూడా గుర్తించామని మీడియాతో చెప్పిన డాక్టర్ తిరుమల రావుతో బీబీసీ మాట్లాడింది. అప్పుడు ఆయన భిన్నమైన వాదన వినిపించారు.
ఆవుపై లైంగిక దాడి జరిగిందా లేదా అనేది నిర్ధరించడం కష్టమని ఆయన బీబీసీకి చెప్పారు.
3 నెలల చూడితో ఉన్న ఆవు వెనుక భాగమంతా కాస్త తడిగా ఉందంటూ గోపాలమిత్ర తనకు అందించిన సమాచారంతో తొలుత అది మానవ వీర్యంగా భావించామని చెప్పారు.
అయితే అలాంటి సమాచారం ఉన్నప్పుడు వెంటనే దానిని సేకరించి, విచారణకు తోడ్పడాలి కదా అన్న ప్రశ్నకు డాక్టర్ తిరుమలరావు నుంచి సమాధానం రాలేదని పోలీస్ ఎస్ఐ కూడా పేర్కొన్నారు.
‘పశువులపై లైంగిక దాడిని బీస్టియాలిటీ అంటారు. తెలుగులో పశుప్రాయతగా చెబుతారు. అయితే, ఈ ఆవుపై లైంగిక దాడి జరినట్లుగా నిర్ధారించలేము. ప్రస్తుతం ఆవు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది' అని తిరుమల రావు బీబీసీకి తెలిపారు.

అత్యాచారం అవాస్తవం: పోలీసులు
ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు డిసెంబర్ 27 గురువారంనాడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో..
‘‘గోవుపై జరిగిన దాడి జరిగిందంటూ ఫిర్యాదు అందింది. ఈ విషయమై 1960 చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టాం. దర్యాప్తులో భాగంగా ఆవును పశువైద్యాధికారికి చూపించాం. ఆవును పరిశీలించిన వైద్యులు అత్యాచారం జరగలేదని ధృవీకరిస్తూ ‘ఊండ్ సర్టిఫికేట్’ ఇచ్చారు. పేపర్లలో, సోషల్ మీడియాలో గోవుపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదు, గోవును కట్టి, కొట్టి, హింసించిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు వేగంగా జరుగుతోందని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు’’ అని తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయ ప్రకటన తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎందుకు విఫలమైంది?
- నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం నిజంగా ఉంటుందా?
- ‘గుడిలో కనిపించింది గుడ్లగూబ.. గరుడపక్షి కాదు’
- క్రిస్మస్ దాకా అమెరికా షట్‌డౌన్.. ట్రంప్ ఎందుకు గోడ దిగడంలేదు
- వేధిస్తున్నాడని.. పిలిచి మర్మాంగం కోసేసింది
- ఏపీ సచివాలయానికి శంకుస్థాపన: అంత ఎత్తైన భవనాన్ని ఎలా నిర్మిస్తారు?
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










