విరాట్ కోహ్లీ: ‘నా జీవితంలో ఇదే అతిపెద్ద విజయం.. ప్రపంచకప్ విజయం కంటే ఎక్కువ’

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలో భారత జట్టు తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఒక టెస్ట్ సిరీస్‌ గెలవడం 72 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇంతకంటే గర్వంగా ఇంకెప్పుడూ అనిపించలేదని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందుకున్న తర్వాత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

సిరీస్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..

‘‘నేను జట్టులోకి వచ్చినప్పుడు కూడా ఇంత గర్వంగా అనిపించలేదు. మాలో మార్పు ఇక్కడి నుంచే మొదలైంది. నేను ఇక్కడే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాను. నాలుగేళ్ల తర్వాత ఇక్కడే మేం గెలిచాం.. నమ్మలేక పోతున్నా. చెప్పాలంటే.. ఒక్కటే మాట.. గర్వం. జట్టును నడిపించటాన్ని బాధ్యతగా, గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. కెప్టెన్ పనిని జట్టు సభ్యులంతా చాలా ఈజీ చేసేస్తారు. అలాంటి సంస్కృతిని మేం పెంపొందించాం.

నా జీవితంలో ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద విజయం. అన్నింటికంటే ఇదే ఎత్తులో ఉంటుంది. 2011 ప్రపంచకప్ గెలుపొందినప్పుడు నేను జట్టులో యువ ఆటగాడిని. అప్పట్లో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కానీ, నాకు మాత్రం ఆ ఫీలింగ్ అప్పుడు అనిపించలేదు. ఇక్కడ.. మూడుసార్లు (ఆస్ట్రేలియాలో) పర్యటించిన తర్వాత, ఈ విజయం మాత్రం ప్రత్యేకం.

ఈ సిరీస్ విజయం మాకు కొత్త గుర్తింపునిస్తుంది. మేం గెలుచుకున్నదాని పట్ల మేం గర్వపడుతున్నాం.

ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

భారత క్రికెట్లో ఇదో కొత్త విషయం

ఒక జట్టుగా మేం మా బ్యాటింగ్ గురించి చర్చించుకుని, ప్రాథమిక విషయాలన్నీ సరిదిద్దుకున్నాం. పుజారాను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ సిరీస్‌లో అతని ప్రదర్శన అసాధారణంగా ఉంది. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటి కంటే బాగుంది. అతను సవాళ్లను స్వీకరిస్తాడు, తన ఆటపై దృష్టిసారిస్తాడు, మంచి వ్యక్తి.

మయూంక్ అగర్వాల్ గురించి కూడా చెప్పాలి.. బాక్సింగ్ డే రోజున ఛాంపియన్‌లా నిలిచాడు. అతని ఆలోచనా ధోరణి అద్భుతం. ఒక బ్యాటింగ్ బృందంగా మేమంతా మా వంతు పాత్ర పోషించాం.

మా బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించి, ఆటను నిర్దేశించారు. ఇక్కడే కాదు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో కూడా. ఇంతకు ముందెన్నడూ నేను చూడని ప్రదర్శన అది. వాళ్లు సన్నద్ధమైన తీరు, వారి ఫిట్‌నెస్ స్ధాయి, వాళ్ల ఆలోచనా ధోరణికి హ్యాట్సాఫ్.

వికెట్లు ఎలా తీయాలో వాళ్లు చర్చించుకుని, తర్వాత నాకు చెబుతారు. భారత క్రికెట్లో ఇదో కొత్త విషయం. దేశంలో ఉన్న బౌలర్లు కూడా నేర్చుకోవాల్సిన విషయం. గ్రేట్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల రికార్డును తిరగరాయటానికి వీళ్లు అర్హులు. వీళ్లు చాలా కాలం పాటు స్ఫూర్తిగా నిలుస్తారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముద్దాడుతున్న విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

సరైన దారిలో పనిచేస్తుంటే.. మీ నిజాయితీని దేవుడు కూడా గుర్తిస్తాడు

భారత క్రికెట్ జట్టులో సగటు వయసు చాలా తక్కువ. పైగా మేం (విజయం సాధిస్తామని) బలంగా నమ్మాం. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో కూడా మేం అదే విశ్వాసంతో ఉన్నాం. మీరు సరైన దారిలో పనిచేస్తుంటే.. మీ నిజాయితీని దేవుడు కూడా గుర్తిస్తాడు.

భారత క్రికెట్‌కు మేం మంచి చేయాలనుకున్నాం, ఇది (విజయం) అత్యద్భుతం, అయితే ఇదొక పునాది మాత్రమే.

ఆస్ట్రేలియా మళ్లీ పుంజుకుంటుంది

ఆస్ట్రేలియా ఎప్పుడూ గట్టి పోటీ ఇచ్చే జట్టే. ప్రతి జట్టూ మార్పులకు లోనవుతుంటుంది. వాళ్ల ఆధిపత్యం ప్రపంచ క్రికెట్‌ చాలా ఏళ్లపాటు కొనసాగేలా చేసింది. భవిష్యత్తులో వాళ్లు మళ్లీ పుంజుకుని, ఆసక్తికరమైన క్రికెట్ ఆడతారని నేను చెప్పగలను.

మేం ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి అర్హులం. ఈ విజయోత్సవాలు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. జట్టు సభ్యులంతా శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయారు. ఇక మాకు పొద్దున్నే అలారమ్‌లు ఉండవు.

ప్రేక్షకుల గురించి కూడా చెప్పాలి.. వాళ్ల మద్దతు అద్భుతం. మేం మా సొంత దేశాన్ని వదిలిపెట్టి వచ్చి ఆడుతున్నట్లు అనిపించకుండా చేసింది వాళ్లే. మేం ఎంతగా గర్వపడుతున్నామో వాళ్లూ అంతగా గర్వపడేందుకు అర్హులు.’’

భారత జట్టు సంబరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇది చరిత్ర - సునీల్ గావస్కర్

‘‘ఇది చరిత్ర, భారత క్రికెట్లో అద్భుతమైన సందర్భం’’ అని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)