భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో ‘పింక్ సందేశం’

ఫొటో సోర్స్, Neena Bhandari
- రచయిత, నీనా భండారీ
- హోదా, సిడ్నీ నుంచి బీబీసీ కోసం
ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జనవరి ఐదో తేదీ శనివారం గులాబీ రంగు అందరి దృష్టినీ ఆకర్షించింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య 'డొమైన్ పింక్ టెస్ట్ మ్యాచ్' మూడో రోజున క్రికెట్ - సంస్కృతి మేళవింపుతో రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.
దాదాపు వంద మంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకుని ఈ మైదానానికి వచ్చారని స్థానిక మీడియా తెలిపింది. పలువురు పురుషులు గులాబీ రంగు టర్బన్లు, చొక్కాలు, టోపీలు ధరించి వచ్చారు. కొందరు నృత్యకారులు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో భారత శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేశారు.
మ్యాచ్ మొదటి రోజైన గురువారం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గులాబీ రంగు స్టిక్కర్, హ్యాండిల్ ఉన్న బ్యాట్, గ్లోవ్స్ వాడారు.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో రొమ్ముక్యాన్సర్ పరీక్షల రేటు అత్యల్పంగా ఉన్నది భారత్, శ్రీలంక నేపథ్యం ఉన్న మహిళలకే అని సౌత్ వేల్స్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ గుర్తించింది.
రొమ్ము క్యాన్సర్ పరీక్షల ఆవశ్యకత, చికిత్సపై అవగాహన పెంచేందుకు 'న్యూ సౌత్ వేల్స్ మల్టీకల్చరల్ హెల్త్ కమ్యూనికేషన్ సర్వీస్' మరికొన్ని సంస్థలతో కలిసి 2014 సెప్టెంబరులో పింక్ శారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Neena Bhandari
ఈ ప్రాజెక్టుకు నిధులు నిలిచిపోయిన తర్వాత దీనిని దీర్ఘకాలంలో కొనసాగించేందుకు వీలుగా వాలంటీర్ల బృందం ఒకటి 2016 అక్టోబరులో 'పింక్ శారీ ఇన్‌కార్పొరేటెడ్'ను ప్రారంభించింది.
2014లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు భారత్, శ్రీలంక సంతతి వారిలో పరీక్షల రేటును ఐదు శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా, నాలుగేళ్లలో అది ఏకంగా 14 శాతానికి చేరుకుంది.
గులాబీ రంగు చీరలు, టర్బన్లు, కుర్తాలు ధరించిన వలంటీర్లు, ఇతరులు ''క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి'' అనే పిలుపుతో బాగా చైతన్యం కల్పించారు.
న్యూ సౌత్ వేల్స్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ పింక్ శారీ ఇన్‌కార్పొరేటెడ్.. మెక్‌గ్రత్ ఫౌండేషన్‌తో జట్టు కట్టింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ 2008లో రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయివటంతో 'జేన్ మెక్‌గ్రాత్ డే'ను నిర్వహిస్తున్నారు. గ్రెన్, జేన్‌లు 2005లో మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Pink Sari Inc
''భారతదేశంలోనూ, ఇక్కడా ఈ మ్యాచ్‌ను వీక్షించే లక్షలాది మంది ప్రజలను చేరుకోవటానికి మేం మొట్టమొదటిసారిగా క్రీడను ఉపయోగిస్తున్నాం. రొమ్ము క్యాన్సర్ పరీక్ష (బ్రెస్ట్ స్క్రీనింగ్), ముందుగా గుర్తించటం చాలా ముఖ్యమన్నది మా సందేశం. మా క్రికెటర్ల స్నేహితులు, భార్యలు భారతదేశంలోని మహిళలకు కూడా ఈ సందేశాన్ని ప్రచారం చేస్తారని మేం ఆశిస్తున్నాం'' అని పింక్ శారీ ఇంక్ అధ్యక్షురాలు శాంతా విశ్వనాథన్ పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు కొందరు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించటంలో ఆలస్యం వల్ల చనిపోయారు.
శాంతా 1980లో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు నుంచి సిడ్నీకి వలస వచ్చారు. మహిళల ఆరోగ్యం, సామాజిక - ఆర్థిక సంక్షేమం కోసం కృషి చేస్తున్న సహేలీ - సేవా (సౌత్ ఏసియన్ హబ్ ఫర్ ఎంటర్‌ప్రైజ్, లీడర్‌షిప్ అండ్ ఇనీషియేటివ్స్ - సోషల్ ఎంటర్‌ప్రెన్యూరియల్ వెంచర్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ సౌత్ ఏసియన్స్) సంస్థలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Pink Sari Inc
ఆస్ట్రేలియాలో మహిళలకు 85 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ గుర్తించటం జరుగుతోంది. బ్రెస్ట్ స్క్రీన్ ఆస్ట్రేలియా జాతీయ కార్యక్రమం కింద 50 ఏళ్ల నుంచి 74 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ప్రతి రెండేళ్లకోసారి ఉచిత మామోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించటం ద్వారా ఆ వ్యాధి సంబంధిత మరణాలను తగ్గించటం ఈ కార్యక్రమం లక్ష్యం.
అయితే.. దక్షిణాసియా ప్రాంత మహిళలు ఈ పరీక్షలు చేయించుకోవటం చాలా తక్కువగా ఉంది. ''దక్షిణాసియా ప్రాంత ప్రజల సమాజాల్లో మహిళలను కుటుంబానికి మూలస్తంభంగా చూస్తారు. కుటుంబంలోని ఇతరుల బాగోగులను చూసుకుంటూ సొంత ఆరోగ్యానికి అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరికి ఇంగ్లిష్ భాష అంతగా రాకపోవటం కూడా కొన్నిసార్లు అవరోధంగా మారుతోంది. అందుకని భారతీయ భాషల్లో సమాచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గురుద్వారాల్లో పంజాబీలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం'' అని అనూప్ జోహార్ వివరించారు. ఆమె తన ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి 1984లో దిల్లీ నుంచి సిడ్నీ వలస వచ్చారు.

ఫొటో సోర్స్, Pink Sari Inc
ఇక భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో దాని నుంచి బయటపడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. 2010 - 2014 మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన మహిళల్లో కేవలం 66.1 శాతం మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి బయటపడగలిగారు. భారతీయ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ అగ్రస్థానంలో ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్తోంది.
పింక్ శారీ తన సందేశాన్ని అంతర్జాతీయంగా వినిపించటానికి ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తోంది.
''సిగ్గు పడవద్దు. ఒక తేదీని నిర్ధారించుకుని మామోగ్రామ్ క్లినిక్‌కు వెళ్లండి. అది మనకు సోకదని మనమందరం అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు అది మన మీద దాడి చేయటం మొదలు పెట్టవచ్చు'' అని అపర్ణ తిజోరివాలా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Pink Sari Inc
ఆమె తల్లి బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణించారు. 2006లో ఆమె టీనేజీ కుమారుడికి హాడ్జ్‌కిన్ లింఫోమా ఉన్నట్లు గుర్తించారు. ముందుగా గుర్తించటం వల్ల ఆ వ్యాధిని తగ్గించగలిగారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న అపర్ణ 1995లో ముంబై నుంచి సిడ్నీకి వలస వచ్చారు.
పింక్ శారీ సాధ్యమైనంత ఎక్కువ మంది భారతీయులకు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచే సందేశాన్ని ఇవ్వటం కోసం క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఉత్తమ వేదిక అని ఆమె భావిస్తున్నారు.
''ఆటను చూడటానికి ఎక్కువ మంది పురుషులు వస్తారు. పురుషులు తమ భార్యలు రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించటం, మద్దతివ్వటం చాలా ముఖ్యం'' అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









