శబరిమల: అయ్యప్ప గుడిలోకి మహిళలు అడుగుపెట్టడం చరిత్రలో ఇప్పుడే జరిగిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విఘ్నేశ్. ఎ
- హోదా, బీబీసీ తమిళం
రుతుక్రమం వయసులోని - 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసు - ఇద్దరు మహిళలు ఇటీవల శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించటం.. చరిత్రలో మొదటిసారి అని మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.
అయితే, గతంలోనూ ఈ వయసు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించినట్లు నిర్ధారిత వార్తలు వచ్చాయి.
2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, చాలా మంది మహిళలు వ్యక్తిగతంగానూ, బృందాలుగానూ ఈ ఆలయంలోకి ప్రవేశించటానికి ప్రయత్నాలు చేశారు. భక్తుల నుంచి భారీ నిరసనలకు దిగటంతో పాటు కొన్నిసార్లు దాడులు కూడా చేయటంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
జనవరి రెండో తేదీ తెల్లవారుజామున 40 ఏళ్ల వయసున్న మహిళలు బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించే వారు కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని, రుతుస్రావ వయసు మహిళలు ఆలయంలోకి వెళ్లటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కొన్ని మీడియా కథనాలు కూడా అలాగే వచ్చాయి. ఈ కథనాల్లో నిజమెంత అన్నది బీబీసీ పరిశీలించింది.

యాబై ఏళ్ల వయసు లోపు మహిళలు సుప్రీంకోర్టు తాజా తీర్పు కన్నా చాలా ముందే శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్లు ఆధారాలు నమోదై ఉన్నాయి. శబరిమల ఆలయ నిర్వాహక సంస్థ ట్రావన్‌కోర్ దేవస్వాం బోర్డు అనుమతితోనే వీరు ప్రవేశించారు. అంతేకాదు, పూజలు చేయటం కోసం భక్తులు చెల్లించే ఫీజులకు ఇచ్చే రసీదులను కూడా ఆ యాభై ఏళ్ల వయసు లోపు మహిళలకు ఇచ్చారు.
సదరు మహిళల వివరాలు కేరళ హైకోర్టు విచారించిన ఒక కేసులో ఉన్నాయి. రుతుస్రావ వయసులోని మహిళలను గతంలోనే శబరిమల ఆలయంలోకి అనుమతించారని నిరూపించే ఆ తీర్పులోని వివరాలివి:
మలయాళం దినపత్రిక జన్మభూమి 1990 ఆగస్టు 19న ఒక ఫొటో ప్రచురించింది. దేవస్వాం బోర్డు మాజీ కమిషనర్ చంద్రిక తన మనవడి అన్నప్రసాన కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో అది. చంద్రిక కుమార్తె, ఆ బాలుడి తల్లి కూడా ఆ ఫొటోలో ఉన్నారు.
ఆ ఘటన నేపథ్యంలో, ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా రుతుస్రావ వయసులోని మహిళలకు ప్రవేశం కల్పించటం ద్వారా వీఐపీలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎస్.మహేంద్రన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ పిటిషన్‌ను కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చింది.
అన్నప్రాసన కార్యక్రమంలో తాను, తన కుమార్తె పాల్గొన్నట్లు చంద్రిక కోర్టుకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు. అయితే, తనకు అనుకూలంగా వ్యవహరించిందేమీ లేదని అన్నారు. చాలా మంది ఇతర చిన్నారులకు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారని, ఆయా కార్యక్రమాల్లో ఆ చిన్నారుల తల్లులు - రుతుస్రావ వయసులో ఉన్న మహిళలు కూడా పాల్గొన్నారని ఆమె తెలిపారు.
ఈ కేసులో ప్రజల హక్కు ఏదీ ప్రభావితం కానందున ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ట్రావన్‌కోర్ దేవాస్వం బోర్డు తన కౌంటర్-అఫిడవిట్‌లో డిమాండ్ చేసింది.
ఇరవై ఆరేళ్ల తర్వాత 2016లో అదే బోర్డు, ఆలయంలోకి రుతుస్రావ వయసు మహిళల ప్రవేశాన్ని సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. బోర్డు పాలకవర్గం, సభ్యులు మారటం.. బోర్డు వైఖరి మారటానికి కారణం కావచ్చు.
రుతుస్రావ వయసు మహిళలను గతంలోనూ ఆలయంలోకి అనుమతించటం జరిగిందని.. ఆలయంలో అటువంటి పూజాకార్యక్రమాలు నిర్వహించటానికి బోర్డు నిర్ణయించిన ఫీజులు వసూలు చేయటం జరిగిందని కూడా బోర్డు అంగీకరించింది.
ఆ కేసులో తీర్పు ప్రకారం, అన్నప్రాసన కార్యక్రమాలు, మలయాళం నెలల మొదటి రోజుల్లో మహిళలను వారి వయసుతో నిమిత్తం లేకుండా ఆలయంలోకి బోర్డు అనుమతించింది.

ఫొటో సోర్స్, A S SATHEESH
అయితే, మకరవైళక్కు పూజలు, మండల పూజలు, విషు పండుగ (మలయాళం సంవత్సరాది) పండుగ రోజుల్లో 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను అనుమతించలేదు.
కేరళ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ, అప్పటికి 20 ఏళ్లుగా నెల వారీ పూజలకు ఆలయాన్ని తెరిచినపుడు అన్ని వయసుల మహిళలనూ ఆలయంలోకి అనుమతించినట్లు పేర్కొంది.
''ట్రావన్‌కోర్ మహారాజా కేరళ క్యాలెండర్ ప్రకారం 1115లో (అంటే బ్రిటిష్ క్యాలెండర్ ప్రకారం 1940) మహారాణి, దివాన్‌లతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. కాబట్టి పాత రోజుల్లో శబరిమలలో మహిళల ప్రవేశంపై నిషేధం లేదు. కానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శించేవారు కాదు'' అని కూడా 1991లో ఇచ్చిన ఆ తీర్పు చెప్పింది.
అప్పటికి 40 ఏళ్ల నుంచీ, ముఖ్యంగా 1950 తర్వాత మతపరమైన ఆచారాలు మారాయని హైకోర్టు తీర్పు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, A S SATHEESH
ఈ నేపథ్యంలో 10 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ 1956 నవంబర్ 27వ తేదీన ట్రావన్‌కోర్ దేవస్వాం బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 1969లో ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన సందర్భంగా ఈ నిబంధనను మార్చారు.
జస్టిస్ బాలనారాయణ మారార్ లిఖించిన హైకోర్టు తీర్పు.. ఆలయ పూజారి సూచనలతో ఆ మార్పు అమలులోకి వచ్చిందని ఉటంకించింది.
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా లిఖించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పులో ఈ హైకోర్టు తీర్పును కూడా ప్రస్తావించింది.
అంటే.. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం ఇదే మొదటిసారి అని భక్తులు, మీడియా, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు చెప్తున్నప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పు కన్నా చాలా ముందు నుంచే మహిళలను ఈ ఆలయంలోకి అనుమతించారన్నది విస్పష్టం.
ఇవి కూడా చదవండి:
- ''కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే.. వేదకాలంలోనే విమానాలు''
- ఆదిపరాశక్తి ఆలయం: ఇక్కడ రుతుస్రావం అపవిత్రం కాదు.. పీరియడ్స్ సమయంలోనూ పూజలు చేయొచ్చు
- విజయనగర సామ్రాజ్యం శిథిలమైనా... డిజిటల్‌గా సజీవం
- రాహుల్ ప్రేమతో మోదీ మెత్తబడ్డారా.. మోదీ ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- శబరిమల ఆలయం: మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








