మదుర మీనాక్షి ఆలయంలో దళితులు అడుగుపెట్టినప్పుడు ఏమైందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారన్న కారణంతో ఆలయాన్ని శుద్ధి చేసేందుకు ద్వారాలను కొద్దిసేపు మూసేశారు. 80 ఏళ్ల క్రితం ప్రఖ్యాత మదుర మీనాక్షి ఆలయంలోకి దళితులు ప్రవేశించినప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా ఆలయాన్ని శుద్ధి చేయాలని పూజారులతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.
తమిళనాడుకు చెందిన హరిజన సేవా సమితికి చెందిన విశ్వనాథన్ అయ్యర్, ఎల్ ఎన్ గోపాలసామి అనే వ్యక్తులు నాదర్ కులానికి చెందిన వ్యక్తితో పాటు మరో ఐదుగురు కింది కులాల వాళ్లను మదురై మీనాక్షి ఆలయంలోకి తీసుకెళ్లారు. 1939 జూలై 8 ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం నాదర్ కులం ఓబీసీ జాబితాలో ఉన్నా, ఒకప్పుడు వారిని దళితులలానే చూసేవారు.
ఆ ఘట్టాన్ని ఆలయ ప్రవేశంగా వ్యవహరిస్తారు. దళిత వర్గానికి చెందిన పి కక్కన్, ముత్తు, భూమినాథన్, చిన్నయ్య, మురుగానందంతో పాటు నాదర్ వర్గానికి చెందిన షన్ముగం కూడా ఆ రోజు ఆలయంలో అడుగుపెట్టారు. తరువాతి రోజుల్లో కక్కన్ తమిళనాడు క్యాబినెట్‌లో మంత్రిగా మారారు.
ఆ సమయంలో ఆలయ నిర్వహణ అధికారి శేషాచలం నాయుడు ఆ దళితులను స్వాగతించారని, ‘ది సర్వెంట్స్ ఆఫ్ ది గాడెస్’ పుస్తకంలో సీజే ఫుల్లర్ పేర్కొన్నారు. ఆలయ పూజారి పొన్నుసామి పట్టార్ వారి మెడలో దండలు వేసి ప్రసాదం పెట్టి పంపించారు.
కానీ, మరుసటి రోజు ఆ ఘటన భారీ స్థాయిలో వివాదాస్పదమైంది. ముత్తు పట్టార్ అనే మరో పూజారి ఆలయంలో పూజలు చేసి ద్వారాలు మూసేశారు. కానీ, మళ్లీ సాయంత్రపు పూజకు తలుపులు తెరవడానికి ఆయన ఒప్పుకోలేదు. దళితుల ప్రవేశంతో ఆలయం అపవిత్రమైందని, ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. శేషాచలం నాయుడు ఎంత ప్రయత్నించినా ఆయన గుడి తాళాలు ఇవ్వలేదు.

జూలై 10న స్వామినాథన్ పట్టార్ అనే పూజారి తాళాలు పగలగొట్టి ఆలయంలో యథావిథిగా పూజలు చేశారు. ఆలయాన్ని శుద్ధి చేయాలని ఒత్తిడి చేసిన ముగ్గురు పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆలయంలో పూజలు చేయడానికి నిరాకరించిన ఇతర పూజారులు కూడా సస్పెండయ్యారు. విధుల నుంచి వైదొలగిన పూజారులకు వర్ణాశ్రమ స్వరాజ్య సంఘం మద్దతు తెలిపింది.
దళితుల ప్రవేశంతో ఆలయం అపవిత్రమైందని, దేవతలు గుడి ప్రాంగణం విడిచి వెళ్లిపోయారని ఆ సంఘం అధ్యక్షుడు నటేశా అయ్యర్ అన్నారు. ‘శుద్ధి’ ప్రక్రియ పూర్తయితేనే దేవతలు మళ్లీ గుడికి తిరిగి వస్తారని ఆయన పేర్కొన్నారు. శుద్ధి చేసి తీరాల్సిందేనని ఆయన కోర్టులో కేసు కూడా వేశారు.
అదే నెల 29న శుద్ధి కార్యక్రమం నిర్వహించాలని ఆలయం వెలుపల ఆందోళనలు కూడా చేశారు. కానీ, సస్పెండైన పూజారులు పూర్తిగా నిషేధానికి గురయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయాన్ని శుద్ధి చేయడానికి వీల్లేదని ఆలయ నిర్వహణ అధికారి శేషాచలం నాయుడు పట్టుబట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
శుద్ధి జరిపించాలని కోరుతూ కోర్టులో అనేక కేసులు నమోదయ్యాయి. కానీ, అన్ని కేసులనూ కోర్టు కొట్టేసింది. 1942లో ఆలయం నుంచి సస్పెండైన 19మంది పూజారులు మళ్లీ కోర్టులో కేసు వేశారు. ఆలయం శుద్ధి చేయలేదు కాబట్టి, తాము విధులకు హాజరుకాలేకపోయామని, అది సరైన పనే అని వారు పేర్కొన్నారు. మదురై మున్సిఫ్ కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ, హైకోర్టు మాత్రం ఆ తీర్పును కొట్టేసి, ఆలయ నిర్వహణ అధికారికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
చివరికి 1945 ఆగస్టులో రెండు పక్షాలు సంధి కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఎలాంటి శుద్ధి చేయకుండానే విధులకు హాజరవ్వడానికి పూజారులు ఒప్పుకున్నారు. కోర్టు ఉత్తర్వులను అనుసరించడానికి కూడా అంగీకరించారు. అలా మదురై ఆలయాన్ని శుద్ధి చేయకుండానే ఆ వివాదం సద్దుమణిగింది.
ఆ తరువాత చట్టాలు దళితుల ఆలయ ప్రవేశానికి అనుకూలంగా మారాయి. అలా తమిళనాడు వ్యాప్తంగా అన్ని దేవాలయాల తలుపులు దళితులకు కూడా తెరుచుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








