ఈ ‘మహా విష్ణువు’ విగ్రహం బెంగళూరు చేరేదెలా

- రచయిత, నియాస్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడు నుంచి కర్నాటకకు విష్ణూమూర్తి భారీ విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రక్ సంకరాపరణి నదిపై ఉన్న ఇరుకు వంతెన దాటడం కష్టం కావడంతో అక్కడే ఆగిపోయింది. ఇంకేముంది... 64 అడుగుల ఎత్తైన ఆ భారీ విగ్రహాన్ని చూడ్డానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అక్కడే పూజలు చేస్తున్నారు.
బెంగళూరుకు చెందిన కోదండ స్వామి చారిటబుల్ ట్రస్టు కర్నాటకలో విష్ణు మూర్తి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. అందుకోసం తమిళనాడులోని వందవాసి తాలూకా కొరకొట్టాయ్ వద్ద 64 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించారు.
దీన్ని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు కొద్ది రోజుల కిందట వందవాసి నుంచి 240 టైర్లు గల భారీ ట్రక్కులో ఎక్కించారు.
ఆ ట్రక్కు ఇప్పుడు తమిళనాడులోని సేన్‌జీ నియోజకవర్గంలోని ఓ ఇరుకు వంతెన వద్ద నిలిచిపోయింది.
రోజుకు 100 మీటర్ల ప్రయాణం
ఈ విగ్రహం బరువు 300 టన్నుల పైమాటే. 240 టైర్లు ఉన్న భారీ ట్రక్కుపై దీని రవాణా చేస్తున్నారు.
అయితే, అంత బరువును మోయలేక ట్రక్ టైర్లలో కొన్ని పేలిపోయాయి.
కొత్త టైర్లు అమర్చి మళ్లీ ప్రయాణం ప్రారంభించారు.. నెమ్మదిగా రోజుకు కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే ముందుకు కదిలేది.
ఈ విగ్రహాన్ని ముందుగా సేన్‌జీ కోట మీదుగా తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ, ఆ కోట దగ్గర ప్రహరీ గోడలు ట్రక్కుకు అడ్డమయ్యాయి. ఆ గోడను తొలగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి.. కానీ, పురావస్తు శాఖ అధికారులు అంగీకరించకపోవడంతో రూటు మార్చారు.

కొత్త మార్గంలోనూ అవాంతరాలు ఎదురయ్యాయి. దార్లో సంకరాపరణి నదిపై ఉన్న ఒక ఇరుకైన వంతెన మీదుగా ఈ భారీ ట్రక్ వెళ్లడం కష్టతరంగా మారింది.
దీంతో ప్రస్తుతం ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రక్ వంతెన వద్ద నిలిచిపోయి ఉంది.
బరువు తగ్గించేందుకు విగ్రహాన్ని చెక్కితే మొత్తం పగిలిపోయే ప్రమాదం ఉందని రమేశ్ అనే స్థానిక శిల్పి అంటున్నారు.
మరో మార్గం ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే మస్తాన్ తెలిపారు.

అక్కడే పూజలు
ట్రక్క్ నిలిచిపోయిన ప్రాంతం ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.
దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు అక్కడే ఓ హుండీ కూడా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: మన్మోహన్ సింగ్ను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ నరసింహరావే
- తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం
- హింసించే భర్త.. ఇప్పుడు మనిషిగా ఎలా మారాడు?
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










