శబరిమల ఆలయం: మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు

యువతి, శబరిమల

ఫొటో సోర్స్, Getty Images

శబరిమల మందిరంలోకి మహిళలను అనుమతించకుండా దేవస్థానం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 28వ తేదీన) తీర్పు వెల్లడించింది.

రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. లింగసమానత్వానికి అది విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

అయ్యప్ప స్వామి 'బ్రహ్మచారి' అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో తెలిపారు.

శబరిమల దేవస్థానం మహిళలపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లోనే కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై 2016లో విచారణ జరిగింది.

ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు అప్పుడు స్పష్టం చేసింది. అలా నిషేధం విధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానించింది.

''పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినప్పుడు, మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

శబరిమల అయ్యప్ప ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని 2016లో వ్యతిరేకించిన కేరళ ప్రభుత్వం, 2017 నవంబర్‌లో జరిగిన విచారణ సమయంలో మాత్రం ఆ పిటిషనర్లకు మద్దతు తెలిపింది. అన్ని వయసుల మహిళలనూ మందిరంలోకి అనుమతించేందుకు తాము సిద్ధమేనని చెప్పింది.

విశ్వాసాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను వివక్షకు గురిచేస్తున్నారని, పురుషుల్లాగే మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకునే అనుమతివ్వాల్సిందే అని పిటిషన్ వేసిన లాయర్ల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ అన్నారు.

శబరిమల ఆలయంలోకి మహిళలను నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందా? లేదా అది "తప్పనిసరిగా పాటించాల్సిన మతపరమైన ఆచారం" కిందకు వస్తుందా? అన్నది పరిశీలించేందుకు 2017లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది.

శబరిమల అయ్యప్ప

ఫొటో సోర్స్, sabarimala.kerala.gov.in

శబరిమల ఆలయం ప్రాముఖ్యత ఏంటి?

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు 18 పవిత్ర మెట్ల మీది నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

అత్యంత నిష్ఠతో 41 రోజుల పాటు ఉపవాసం చేయకుండా ఆ 18 మెట్లను దాటలేరని భక్తుల నమ్మకం.

మందిరంలోకి ప్రవేశించేముందు భక్తులు కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉపవాసం సమయంలో అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు (మాల) మాత్రమే ధరించాలి, అన్ని రోజులూ గడ్డం చేసుకోకూడదు. రోజూ ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

అమ్మాయి

ఫొటో సోర్స్, K FAYAZ AHMAD

ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ ఉద్యమం

ఫలానా మహిళ 'పవిత్రమే' (రుతుచక్రం మొదలు కానివారు, ఆగిపోయిన వారు) అని గుర్తించగల యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మాత్రమే ఆ మహిళలను ఆలయంలోకి అనుమతిస్తామని 2015లో శబరిమల దేవస్థానం ఛైర్మన్ ప్రయర్ గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ 2015లో విద్యార్థినులు ఉద్యమం ప్రారంభించారు.

"ప్రస్తుతం ఆయుధాలను గుర్తించేందుకు మనుషుల శరీరాల శరీరాలను స్కాన్ చేసే మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఫలానా మహిళ 'పవిత్రంగా' ఉన్నారా? లేదా? అని స్కాన్ చేసి చెప్పేసే రోజులు వస్తాయి. అలాంటి మెషీన్‌ కనుగొన్న తర్వాత, మహిళలను మందిరంలోకి అనుమతించే విషయంపై మాట్లాడదాం’’ అని గోపాలకృష్ణన్ అన్నారు.

ఆయన వ్యాఖ్యలు మహిళలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, #HappyToBleed పేరుతో ఫేస్‌బుక్‌లో పెద్ద ఉద్యమమే జరిగింది.

"మహిళలను ఎప్పుడు అనుమతించాలన్నది కాదు, వాళ్లు ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్లాలనుకుంటే అప్పుడు వెళ్లే హక్కు వాళ్లకుండాలి" అని ఆ ఉద్యమాన్ని ప్రారంభించిన నిఖితా ఆజాద్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)