రాహుల్ ప్రేమతో మోదీ మెత్తబడ్డారా.. మోదీ ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది

మోడీ 2.0

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నవీన్ నెగీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సీన్-1 "గుజరాత్ నిర్మించడం అంటే అర్థం ఏంటో తెలుసా నేతాజీ.. గుజరాత్ నిర్మించడం అంటే.. 24 గంటల కరెంటు.. ప్రతి గ్రామంలో కరెంటు అని అర్థం... నేతాజీ మీ వల్ల అది కాదు. గుజరాత్ నిర్మించడానికి 56 అంగుళాల ఛాతీ కావాలి".

స్పీకర్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ

తేదీ: 2014 జనవరి

లొకేషన్: ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ

సీన్-2 "కాంగ్రెస్ పార్టీకి అధికారం మత్తు వదల్లేదు. కాంగ్రెస్ అహంకారం అకాశం అంచుకు చేరుకుంది. ఇలాంటి కాంగ్రెస్‌ను శిక్షించాలా?, వద్దా? కాంగ్రెస్‌కు చిన్న చిన్న శిక్షలు కాదు, దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి".

స్పీకర్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ

తేదీ: 2014 ఫిబ్రవరి

లొకేషన్: కర్ణాటకలో ఎన్నికల ర్యాలీ

ఇవి ఏదో సూపర్ హిట్ సినిమాలో అదిరిపోయే డైలాగుల్లా అనిపిస్తాయి. 2014లో దేశ ప్రజలకు ఇవి చాలా బాగా నచ్చాయి. వారి మనసు నిండా ఆ పార్టీపై ప్రేమను నింపాయి.

ఈ సినిమాలో హీరో నరేంద్ర మోదీ. ఆయన తన ప్రసంగాల్లో ఉపయోగించిన పదాలు జనాలను ఉత్సాహపరిచాయి. అవినీతి, నిరుద్యోగం, అధిక ధరలతో విసిగిపోయిన జనాలకు 'మోదీ' తమను కాపాడడానికే వస్తున్నారని అనిపించింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో భారత దేశ ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీకి 282 స్థానాలు అందించారు. మోదీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.

ఆ తర్వాత జరిగిన చాలా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక్కొక్కటిగా విజయం సాధిస్తూ వచ్చింది. గెలుపు రథంపై సాగిన ఆ స్వారీ అంతా మోదీ పార్ట్-1.

మోడీ 2.0

ఫొటో సోర్స్, Getty Images

కొత్త సంవత్సరంలో సున్నితమైన మోదీ

"కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే నా ఉద్దేశం, ఏదైనా పార్టీని దేశంలో అంతం చేయడం కాదు. కాంగ్రెస్ అనేది ఒక ఆలోచన, ఒక ఐడియాలజీ, కుటుంబపాలన, బంధుప్రీతితో అది నిండిపోయుంది. ఆ ఆలోచనను అంతం చేయాలనే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ లోపలి నుంచి కూడా అంతం కావాలి".

స్పీకర్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

తేదీ: 2019 జనవరి 1

లొకేషన్: న్యూదిల్లీలో ఒక ఇంటర్వ్యూ

కాలచక్రం గిర్రున తిరిగింది. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ఐదో ఏడాదిలోకి ప్రవేశించారు. అంటే 2019లో ఆయన మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. కానీ ఈసారీ ఒక అభ్యర్థి రూపంలో కాదు ఒక ప్రధానమంత్రిగా మాట్లాడారు.

కొత్త ఏడాదిలో తొలి రోజే ప్రధాన మంత్రి సుమారు 95 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. మాటల చాతుర్యంలో నిపుణులుగా భావించే మోదీ సాధారణంగా మీడియా లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు దూరంగా ఉంటారు.

అలాంటప్పుడు, ఆయన కొత్త ఏడాది మొదటి రోజే మీడియా ముందుకు వచ్చి, తన పదవీకాలంలో లేవనెత్తుతూ వచ్చిన అన్ని అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది?.

సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ రాజకీయాలను నిశితంగా పరిశీలించే ప్రదీప్ సింగ్ దీనిపై మాట్లాడారు. "ఈ ఇంటర్వ్యూ నిజానికి మోదీ కొత్త వెర్షన్‌ను ప్రజల ముందుకు తెచ్చింది" అన్నారు.

"దేశంలో ఏయే విషయాలపై చర్చ జరగాలి అనేదానిని సాధారణంగా బీజేపీ లేదా స్వయంగా మోదీనే నిర్ణయిస్తారు. తర్వాత కాంగ్రెస్ వాటిని వెనక నుంచి ఒడిసిపట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి మోదీకి దేశంలో పరిస్థితి తన చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపించడం మొదలైంది" అని ఆయన అన్నారు.

"గత నెల మూడు పెద్ద రాష్ట్రాల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్ బలపడిందని మోదీకి అనిపించింది. కొత్త ఏడాదిలో మొదటి రోజే ఆయన మీడియా ముందు హాజరు కావడానికి కారణం అదే. ఎన్నికల ఏడాది దేశం మూడ్‌ను మోదీనే నిర్ణయిస్తారని ఆయన చెప్పాలనుకున్నారు" అని ప్రదీప్ సింగ్ అన్నారు.

మోడీ 2.0

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్ ప్రేమతో మెత్తబడ్డ మోదీ

పార్లమెంటు లోపల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ప్రసంగం బహుశా దేశంలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో ఆయన స్వయంగా తన గురించి పప్పూ అనే మాట వాడారు.

రాహుల్ ఆ రోజు "ఆయన నన్ను పప్పూ అంటారు. కానీ నాకు ఆయనంటే ద్వేషం లేదు" అన్నారు. అంతే కాదు రాహుల్ తన ప్రసంగం తర్వాత సీటు నుంచి లేచారు, పార్లమెంటు లోపలే మోదీని హత్తుకున్నారు.

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో విజయం తర్వాత కూడా రాహుల్ గాంధీ అదే అన్నారు. తను బీజేపీ ముక్త్ భారత్ కోరుకోవడం లేదన్నారు.

బీజేపీ, మోదీ ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నప్పుడు, ఒక విధంగా రాహుల్ గాంధీ తను ప్రేమతో రాజకీయాలు చేస్తున్నానని చెప్పడానికి ప్రయత్నించారు.

కొత్త ఏడాదిలో మోదీ ఈ కొత్త రూపం వెనుక రాహుల్ గాంధీ చేస్తున్న ఆ 'ప్రేమ రాజకీయాలే' అసలు కారణమా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ దీనిపై "గత ఐదేళ్లలో బీజేపీ, లేదా స్వయంగా మోదీ కూడా కాంగ్రెస్, విపక్షాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు ఉపయోగించింది. వాటికి తోడు చాలా చోట్ల మాబ్ లించింగ్ వెలుగుచూసింది. ఇది సామాన్యులకు నచ్చడం లేదు. వాటన్నిటి మధ్య రాహుల్ గాంధీ బాధితుల పక్షాన నిలిచారు. మోదీ ఈ ఎన్నికల ఏడాదిలో తన తీరు మార్చుకోవడానికి అదే కారణంగా కనిపిస్తోంది" అన్నారు.

కిద్వాయ్ మరో మాట కూడా అన్నారు. "ఇప్పటివరకూ బీజేపీ రాహుల్ గాంధీ రాజకీయాలకు సిద్ధంగా లేరనే చెబుతూ వచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతోంది అంది. రాహుల్ గాంధీ ప్రసంగాలను తరచూ వేళాకోళం చేస్తూ వచ్చింది" అని తెలిపారు.

"గత కొంతకాలంగా రాహుల్ గాంధీ తనకుతాను ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా ఎదిగారు. మెరుగైన వాదనతో బీజేపీని ఎదుర్కున్నారు. లోక్‌సభలో ఆయనకు 50 మంది కంటే తక్కువ ఎంపీలే ఉండచ్చు, కానీ ఆయన ఒక బలమైన ప్రతిపక్షాన్ని రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. మోదీ ప్రధాన మంత్రిగా పరిపక్వత చూపించడానికి అదే కారణం" అన్నారు.

మోడీ 2.0

ఫొటో సోర్స్, Getty Images

విధానాలపైనే ప్రశ్నలు

మోదీ పదవీకాలంలో ఆయన కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మనకు గుర్తుంది. వీటిలో నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కీలకంగా నిలిచాయి.

మోదీ తాజా ఇంటర్వ్యూలో నోట్లరద్దును ఎలాంటి షాక్ అని తను అనుకోవడం లేదని అన్నారు. ఏడాది ముందే దాని గురించి తాను హెచ్చరించానని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయం చేయడాన్ని తప్పుబట్టారు.

అంతే కాదు రాహుల్, కాంగ్రెస్ రఫేల్ డీల్‌లో అవకతవకల గురించి తరచూ ఆరోపణలు చేస్తున్నారు. దానిపై మాట్లాడిన మోదీ దానిపై తనను ఎవరూ వేలెత్తి చూపడం లేదని అన్నారు.

మోదీ విధానాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ప్రదీప్ సింగ్ "ప్రతిపక్షాలు ఎప్పుడూ మోదీ కీలక అంశాలపై మౌనంగా ఉంటారని అంటూ ఉంటుంది. అందుకే ఆయన తన ఇంటర్వ్యూలో అన్ని అంశాలపై మాట్లాడారు. ప్రజలకు ఇంకా తనపై విశ్వాసం ఉందని మోదీ భావిస్తున్నారు. అందుకే నోట్లరద్దు తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో విజయం సాధించడంలో సక్సెస్ అయ్యారు. ప్రజల్లో ఆ విశ్వాసాన్ని అలాగే ఉంచాలని మోదీ ప్రయత్నిస్తున్నారు" అన్నారు.

ఇంకో వైపు రషీద్ కిద్వాయ్ గత నాలుగున్నరేళ్లుగా మోదీ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చలేదు అన్నారు. "మోదీ నోట్లరద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని మోదీకి స్వయంగా తెలుసు. 2014లో ప్రజలు ఆయనను ఏ ఆశలతో ఎన్నుకున్నారో అవి నెరవేరలేదు. ఇంటర్వ్యూలో మోదీ తన నిర్ణయాల గురించి అంత వివరంగా చెప్పడానికి కారణం అదే" అన్నారు.

మోడీ 2.0

ఫొటో సోర్స్, Getty Images

కూటమి గురించి ఆందోళన

2014లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ అంకెను దాటింది. కానీ ప్రస్తుతం బీజేపీకి లోక్‌సభలో 268 మంది ఎంపీలు ఉన్నారు.

మోదీ తన ఇంటర్వ్యూలో ఈసారీ ఎన్నికలు 'ప్రజలు వర్సెస్ మహాకూటమి' మధ్యే అని చెప్పి ఉండచ్చు. అయినా ఆయన సమాధానం లోలోపల ఎన్డీయే కూటమిలో చీలికల ప్రభావం కూడా కనిపించింది.

దాని గురించి రషీద్ కిద్వాయ్ "లోక్‌సభ ఎన్నికలు దేశంలో 543 స్థానాల్లో జరుగుతాయి. అంటే ప్రతి రాష్ట్రంలో పార్టీ పట్టు బలంగా ఉండడం చాలా అవసరం. దక్షిణాదిన తాము బలహీనంగా ఉన్నామని, అక్కడ ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా ఉండలేకపోతున్నామని ప్రధానికి తెలుసు. అలాంటప్పుడు ఆయన ఇమేజ్ ఎంత బలంగా ఉన్నా, మోదీకి తగినంత మెజారిటీ లభించకపోవచ్చు.

అయితే ప్రదీప్ సింగ్ మాత్రం "తన ఇంటర్వ్యూలో మోదీ చాలా వినయంగా కనిపించి ఉండచ్చు. కానీ ఆయనలో చాలా ఆత్మవిశ్వాసం కూడా కనిపించింది. ఇక ఎన్డీయే విషయానికి వస్తే, కేవలం రెండు పార్టీలు మాత్రమే కూటమి నుంచి వైదొలిగాయి. ఒకటి టీడీపీ, ఇంకొకటి ఆర్ఎల్ఎస్పీ. అయినా ఈ రెండూ చిన్న పార్టీలు. ఇక శివసేన విషయానికి వస్తే అది 2014 నుంచి అలాగే ఉంది. కానీ ఎప్పుడూ ఎన్డీయేకు దూరం కాలేదు" అన్నారు.

నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతుంటారు. ఆయన తరచూ అవతలివారిని నేరుగా లక్ష్యం చేసుకునే మాటలను ప్రయోగిస్తారు.

ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇప్పుడు మోదీ ఆ ఎదురుదాడి ఇమేజ్‌ స్వీకరించరని ఈ ఇంటర్వ్యూ ద్వారా అంచనా వేయచ్చు. ఆయన మిగతా పార్టీలను ఆ స్థాయిలో విమర్శించరని అనుకోవచ్చు.

మనం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మన శైలి, ప్రవర్తన వేరుగా ఉంటుంది. మనం అధికార పార్టీపై విమర్శలు చేస్తుంటాం. కానీ మనం స్వయంగా అధికారంలో ఉంటూ ప్రజల ముందుకు వస్తున్నప్పుడు తమ రిపోర్ట్ కార్డ్ అందిస్తాం. అందుకే మోదీ శైలి కాస్త మారినట్టు అనిపిస్తోంది అన్నారు ప్రదీప్ సింగ్.

మోడీ 2.0

ఫొటో సోర్స్, Getty Images

మోదీ కొత్త రూపాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కుంటుంది?

కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపే రాహుల్ గాందీ తనను తాను నిరూపించుకున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ మూడు పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించింది.

అంతే కాదు రాహుల్ గాంధీ ఆలయాలు-మసీదులు-గురుద్వారాలు కూడా చుట్టేశారు.

బుధవారం లోక్‌సభలో ఆయన మోదీ ఇంటర్వ్యూ, రఫేల్ డీల్ గురించి తీవ్రంగా విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని అన్నారు. దీనికి సంబంధించిన ఒక టేపును కూడా పార్లమంటులో వినిపించడానికి అనుమతి కోరారు.

మోదీ తన మొత్తం ఇంటర్వ్యూలో చాలా అలసటగా, నైరాశ్యంతో కనిపించారని రాహుల్ అన్నారు.

గత నాలుగేళ్లలో రాహుల్ ఎదురదాడికి దిగే మోదీ లోపం వెతకడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఎదురుగా నిలిచిన 'వినమ్ర మోడీ'ని రాహుల్ ఎలా ఎదుర్కుంటారు.

మోడీ 2.0

దీనికి కిద్వాయ్ "రాహుల్ గాంధీ ఎలా రాజకీయాలు చేస్తున్నారో అలాగే చేస్తూ ఉండాల్సుంటుంది. ఆయన అంశాలను లేవనెత్తుతూనే ఉండాలి. వాదించడంతోపాటు అధికార పార్టీపై ప్రశ్నలు సంధించాలి. దేశం మూడ్ స్వయంగా నిర్ణయించాలి" అన్నారు.

మొత్తానికి కొత్త ఏడాది ప్రారంభంలో చలి దేశాన్ని వణికిస్తున్న సమయంలో వేడివేడి రాజకీయాలు మొదలయ్యాయి. ముందు ముందు ఎలా ఉంటుందో జనవరి నెలలో మొదటి రెండు రోజులే ప్రజలకు చెప్పాయని అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)