ఈ పార్లమెంటు సమావేశాల్లో రామమందిరంపై ఆర్డినెన్స్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ సింగ్
- హోదా, బీబీసీ కోసం
రామ మందిర భూతం మరోసారి సీసాలోంచి బయటపడింది. ఈసారి బీజేపీ దాని నుంచి తప్పించుకునే దారి లేదు. ఎందుకంటే కేంద్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. రామమందిరంపై ఇప్పటికే బీజేపీ, ఆరెస్సెస్‌ల విశ్వసనీయత దెబ్బ తినగా, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసనీయత ప్రమాదంలో ఉంది.
నూతన సంవత్సరాదిన ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ.. రామ మందిరం విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమని అంగీకరించారు.
ఇంటర్వ్యూలో మోదీని 'ఎందుకు రామమందిరం ఒక భావోద్వేగ అంశంగా మారింద'ని, దానిపై ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా మోదీ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయంతో ప్రారంభించారు. రామమందిరంపై కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పారు.
జనవరి 4 తర్వాత సుప్రీంకోర్టు ప్రతి రోజూ కేసు వినేందుకు సిద్ధపడితే, ప్రభుత్వం పని సులభం అవుతుంది. కానీ సుప్రీం కనుక రోజూ విచారణకు సుముఖత వ్యక్తం చేయకుంటే, లేదా విచారణ పూర్తయ్యాక తీర్పు వెలువరించకుంటే మాత్రం ప్రభుత్వం, బీజేపీతో పాటు మొత్తం సంఘ్ పరివార్ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ వర్సెస్ రాహుల్.. సీన్ మారింది
అయితే ప్రశ్న ఏమిటంటే, ఎందుకు బీజేపీకి లోక్‌సభ ఎన్నికలకు ముందే రామమందిరం అవసరం ? ఎందుకు మోహన్ భాగవత్ బహిరంగంగా తాను కోర్టు తీర్పు కోసం వేచి చూడనని, ప్రభుత్వం దీనిపై చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు?
సంఘ్ ఈ ప్రకటన ఏదో యథాలాపంగా చేయలేదు. ఇది 2019 లోక్‌సభ ఎన్నికల వ్యూహానికి సంబంధించినది.
బీజేపీ, మోదీ ఎంత ప్రయత్నం చేసినా, ఈసారి ఎన్నికలు ఎంత మాత్రం మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ కాబోవు. ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని బీజేపీ భావించినంత కాలం, ఆలయం అంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారు.
మరోవైపు బీజేపీ పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పోరాడాల్సి ఉంది.
అక్కడ జాతీయ అంశాలపైకన్నా ప్రాంతీయ అంశాలపై పోరాటం జరుగుతుంది. దానికన్నా ముఖ్యంగా ఎన్నికల్లో కులసమీకరణలు ఎక్కువగా పని చేస్తాయి. అయితే ఆ విషయంలో బీజేపీ చాలా బలహీనం.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ఎంపీలో ఎందుకు ఓడింది?
ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అగ్రవర్ణాల వ్యతిరేకతను మొదట బీజేపీ, సంఘ్ గుర్తించలేకపోయాయి. దానిని వెంటనే వచ్చే ప్రతిస్పందన అని, కొన్ని రోజుల తర్వాత అది అణగిపోతుందని భావించాయి. కానీ అది జరగలేదు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ కేవలం ఒకే ఒక కారణంగా ఓడిపోయింది. బీజేపీని బలపరిచే అగ్రవర్ణాలు అక్కడ ఆ పార్టీకి పూర్తిస్థాయిలో ఓట్లు వేసి ఉంటే అక్కడ ఆ పార్టీకి కనీసం మరో పది పన్నెండు సీట్లు పెరిగేవి.
మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలకంటే, ఈ అసంతృప్తి సంఘ్ శాఖలు, కార్యకర్తల్లో చర్చనీయాంశం కావడం సంఘ్‌ను కలవరపరుస్తోంది. అందుకే రామమందిరం అంశం బీజేపీ, సంఘ్ రెంటికీ పరిష్కారం కాగలదు.
అందువల్లే, రామమందిర అంశం ఈ రెంటికీ జీవన్మరణ సమస్యగా మారింది.

మోదీ కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సమర్థించేవారే. అయినా 2014 ఎన్నికల తర్వాత ఆయన దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన దేశంలోని చాలా ఆలయాలను సందర్శించినా, అయోధ్యకు మాత్రం వెళ్లలేదు.
ఎన్నికల్లో గెలవడానికి తన అభివృద్ధి రాజకీయాలు, తన ఇమేజ్ మాత్రం చాలని ఆయన భావించారు. తన మీద ప్రజలకు ఇంకా నమ్మకం సడల్లేదని అనుకున్నారు. ఒక స్థాయి వరకు ఇది నిజమైనా, అదే సరిపోదు. ఇప్పుడు పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని తగ్గించడానికి అయోధ్యను మించిన భావోద్వేగాలకు సంబంధించిన అంశం మరొకటి లేదు.

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/Getty Images
మోదీ ఎదుట అతి పెద్ద సవాలు
తన రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ ఎన్నో రిస్క్‌తో కూడిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎదుట మరో సవాలు ఉంది. బహుశా ఇది అన్నిటికన్నా పెద్ద సవాలు కావచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు అయోధ్యపై విచారణ చేపట్టకుంటే లేదా విచారణ చేపట్టినా తీర్పు వెలువరించకుంటే, ప్రధాని ఎన్నికలకు ముందే ఆర్డినెన్స్ తీసుకువచ్చే రిస్క్ తీసుకుంటారా?
మోదీ చాలాసార్లు పార్టీకన్నా దేశ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రైతుల రుణమాఫీ అందుకు తాజా ఉదాహరణ. కానీ ఇప్పుడు సమస్య రామమందిరానికి సంబంధించినది. ఇప్పుడాయనపై సంఘ్, ఆలయ నిర్మాణాన్ని సమర్థించే వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









