శబరిమల ఆలయం: 50 లక్షల మంది మహిళలు.. 620 కిలోమీటర్ల మానవ హారం

ఫొటో సోర్స్, CV LENIN
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం మీద తలెత్తిన వివాదం నేపధ్యంలో.. ‘లింగ సమానత్వానికి మద్దతుగా’ కేరళలో మహిళలు 620 కిలోమీటర్ల మేర మానవ హారంగా ఏర్పడ్డారు.
రుతుస్రావ వయసులోని మహిళలు - 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం మీద ఏళ్ల తరబడి నిషేధం విధించింది.
ఆ నిషేధం చెల్లదని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో తీర్పు ఇవ్వటం.. శబరిమల ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నించిన మహిళల మీద నిరసనకారులు దాడులు చేయటం తెలిసిందే.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వామపక్ష సంకీర్ణ ప్రభుత్వం మహిళల సమానత్వం కోసం ఈ భారీ ‘‘మహిళా కుడ్యం’’ నిర్వహించింది.
కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 లక్షల మంది మహిళలు రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల మీదకు చేరుకుని ఈ మానవ హారాన్ని నిర్మించినట్లు అధికారులు బీబీసీ హిందీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషికి చెప్పారు.
కాసారాగాడ్ ఉత్తర కొస నుంచి తిరువనంతపురం దక్షిణం చివరి వరకూ ఈ మానవ హారం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనటానికి సుమారు 30 లక్షల మంది మహిళలు వస్తారని నిర్వాహకులు తొలుత అంచనా వేశారు.
అసమానత మీద, మహిళల మీద నిషేధాన్ని సమర్థిస్తున్న మితవాద బృందాల ప్రయత్నాల మీద పోరాడటానికి ఈ ప్రదర్శన నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
‘‘మహిళలు ఎంత శక్తిమంతులో.. మేం స్వయంగా సాధికారం సాధించగలమో, పరస్పరం ఎలా సాయం చేసుకోగలమో చెప్పటానికి అదొక మార్గం. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కల్పించాలన్న చర్యకు నేను మద్దతిస్తున్నాను. సంప్రదాయం కానీ, మరేరకమైన వెనుకబాటు కానీ మహిళలను నిలువరించరాదన్నది నా అభిప్రాయం. ప్రార్థించాలని కోరుకునో వారికి ప్రార్థించే హక్కు ఉండి తీరాలి’’ అని ఈ మానవ హారంలో పాల్గొన్న కవితా దాస్ అనే యువతి బీబీసీకి చెప్పారు.
‘‘ఇక్కడ ప్రధాన సమస్య శబరిమల కాదు. పురుషులు, మహిళలు సమానమన్నది నా విశ్వాసం’’ అని తనూజ భట్టాద్రి అనే మరో మహిళ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CV LENIN
ఈ నిషేధం రాజకీయంగా ఎందుకు మారింది?
శబరిమల ఆలయంలో మహిళలను నిషేధించటం.. లింగ సమానత్వాన్ని ఉల్లంఘిస్తోందని దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఆ ఆలయంలో మహిళలు పూజలు చేయటానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఈ తీర్పు హిందూ విలువల మీద దాడి అని దేశంలో అధికార హిందూ జాతీయవాద పార్టీ బీజేపీ వాదించింది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగనున్న పరిస్థితుల్లో ఈ అంశం అంతకంతకూ వివాదాస్పదంగా మారుతోంది. బీజేపీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్న హిందూ సముదాయాన్ని సంతృప్తి పరచటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత ప్రాతిపదికన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శకులు ఆరోపించారు.
రుతుస్రావంలో ఉన్న మహిళలు మలినులవుతారని హిందూ మతం పరిగణిస్తుంది. అందువల్ల వారిని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధిస్తుంది. అయితే.. చాలా ఆలయాలు రుతుస్రావ వయసు మహిళలను పూర్తిగా నిషేధించటం కాకుండా.. వారు రుతుస్రావం లేని సమయంలో ప్రవేశానికి అనుమతిస్తాయి.
‘‘ఆలయంలోని దేవుడు బ్రహ్మచారి’’
కోర్టు ఆదేశం ఆలయ దేవుడైన అయ్యప్ప స్వామి ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని కూడా నిరసనకారులు వాదిస్తున్నారు.
మహిళలు శబరిమలలో ప్రవేశించకుండా నిషేధం అన్నది కేవలం రుతుస్రావానికి సంబంధించిన అంశమొక్కటే కాదని.. తన ఆశీస్సులు కోరుతూ తీర్థయాత్ర చేపట్టటానికి స్పష్టమైన నిబంధనలు విధించినట్లు నమ్మే దేవుడి కోరికకు అనుగుణంగా విధించిన నిషేధమని వారు అంటున్నారు.
ఆలయ పురాణం ప్రకారం.. అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యం ప్రతిన పూనిన కఠోర బ్రహ్మచారి.. అందుకే మహిళలపై నిషేధం.
ఆలయంలో ప్రవేశించటానికి చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే ప్రయత్నించారు. రాష్ట్రంలో భారీ నిరసనలు తలెత్తాయి. అలా ప్రయత్నించిన వారు చాలా మంది వెనుదిరగాల్సి వచ్చింది.
అక్టోబర్ నెలలో ఇద్దరు మహిళలు.. ఈ ఆలయానికి చేరుకోవటానికి చివరి ఐదు మైళ్లు నడకదారిలో వెళుతున్నపుడు.. రాళ్లు విసురుతున్న నిరసనకారుల నుంచి 100 మందికి పైగా పోలీసులు రక్షణ కల్పించగా.. ఆలయం ప్రధాన ప్రాంగణం వరకూ చేరుకోగలిగారు.
కానీ చివరికి అక్కడ భక్తులు అడ్డుకోవటంతో.. శబరిమల గర్భగుడికి కొన్ని మీటర్ల దూరం నుంచే వారు వెనుతిరగాల్సి వచ్చింది.
- శబరిమల: కవిత, రెహానా ఆ 100 మీటర్లు ఎందుకు దాటలేకపోయారు?
- శబరిమల: వందల మంది పోలీసులు.. ఇద్దరు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించకుండానే వెనక్కి
- ‘సుప్రీంకోర్టు చెప్పినా సరే... 50 ఏళ్లు దాటాకే శబరిమలలో అడుగుపెడతాం’
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- పీరియడ్స్‌లో గుడికి వెళ్తే ట్వింకిల్ ఖన్నా ఏం ఆలోచిస్తారు?
- శబరిమల తీర్పు: జస్టిస్ ఇందూ మల్హోత్రా మిగతా జడ్జిలతో ఎందుకు విభేదించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








