శబరిమల తీర్పు: జస్టిస్ ఇందూ మల్హోత్రా మిగతా జడ్జిలతో ఎందుకు విభేదించారు?

శబరిమల తీర్పు

ఫొటో సోర్స్, SABARIMALA.KERALA.GOV.IN

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం రాజ్యాంగంలోని సెక్షన్-14 ఉల్లంఘించినట్టే అవుతుంది.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం ఎలాంటి బేధబావాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఆలయంలో పూజ చేయడానికి అనుమతించాలి.

శబరిమల ఆలయ ప్రధాన పూజారి కంద్రూ రాజీవరూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మహిళలను ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పారు.

కానీ, రాజ్యాంగ ధర్మాసనంలోని ఒకే ఒక మహిళా జడ్జి ఇందూ మల్హోత్రా ఈ కేసులో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.

కోర్టు మత విశ్వాసాలలో జోక్యం చేసుకోకూడదని, దానివల్ల మిగతా ధార్మిక క్షేత్రాలపై కూడా ఆ ప్రభావం పడుతుందని కూడా జస్టిస్ ఇందూ మల్హోత్రా అన్నారు.

పీటీఐ సమాచారం ప్రకారం జస్టిస్ ఇందూ మల్హోత్రా "దేశంలో లోతైన మత అంశాలు చాలా ఉన్నాయి. దేశంలో లౌకిక వాతావరణం కొనసాగాలంటే కోర్టులు వాటిలో జోక్యం చేసుకోకూడదు" అన్నారు.

ఇందూ మల్హోత్రా

ఆమె ఇంకా ఏమన్నారు?

  • 'సతీ సహగమనం' లాంటి సామాజిక దుశ్చర్యల్లో కోర్టు జోక్యం చేసుకోవచ్చు. కానీ మత సంప్రదాయాలు ఎలా ఉండాలనేదాని మీద కోర్టుల ప్రమేయం తగదు.
  • సమానత్వ సిద్ధాంతం, సెక్షన్ 25 ప్రకారం లభించే 'ప్రార్థించే ప్రాథమిక హక్కు'ను నిర్లక్ష్యం చేయకూడదు.
  • నా అభిప్రాయం ప్రకారం హేతుబద్ధత ఆలోచనలను మత సంబంధిత విషయాలలోకి తీసుకురాకూడదు.
  • ఈ నిర్ణయం కేవలం శబరిమల వరకే పరిమితం కాదు, ఈ తీర్పు మిగతా పుణ్య క్షేత్రాలపై కూడా ప్రభావం చూపుతుంది.
శబరిమల తీర్పు

ఫొటో సోర్స్, SABARIMALA.KERALA.GOV.IN

పెద్ద యుద్ధానికి ప్రారంభం

"సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా శబరిమల కేసులో తీర్పు చదవడం ప్రారంభించినపుడు అందరి ముఖంలో చిరునవ్వు కనిపించింది" అని ఆ సమయంలో సుప్రీంకోర్టులో ఉన్న బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ్ చెప్పారు.

"సుప్రీంకోర్టు పరిసరాల్లో కోర్టు హౌస్ వైపు వెళ్లే దారి పూర్తిగా సామాజిక కార్యకర్తలతో నిండిపోయింది".

నెలసరి సమయంలో మహిళలు ఆలయ పరిసరాల్లో ప్రవేశించడంపై కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

తీర్పు వెలువడగానే చాలా మంది మహిళలు కోర్టులో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

హాపీ టు బ్లీడ్

ఫొటో సోర్స్, facebook

2015లో సోషల్ మీడియాలో 'హ్యాపీ టు బ్లీడ్' పేరుతో ఉద్యమం ప్రారంభించిన పటియాలా యువతి నికితా ఆజాద్ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.

"శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం. దీని ప్రభావం చాలా ఉంటుంది. సుప్రీంకోర్టు నెలసరిని అవమానంగా భావించడానికి నిరాకరించింది. కోర్టు తన తీర్పులో సమానత్వం మతం కంటే ఎక్కువని చెప్పింది. దీనితో ఒక పెద్ద పోరాటానికి ఇది ప్రారంభం అని చెప్పచ్చు" అని నికిత అన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)