‘సుప్రీంకోర్టు చెప్పినా సరే... 50 ఏళ్లు దాటాకే శబరిమలలో అడుగుపెడతాం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేదాన్ని సుప్రీంకోర్టు ఎత్తేసి ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ చాలామంది మహిళలు తమకు 50ఏళ్ల వయసు దాటాకే ఆలయంలోకి వెళ్లాలని, సంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని నిర్ణయించుకున్నారు.
కోర్టులు ఏం చెప్పినా, సంప్రదాయం ప్రకారమే నడుచుకోవాలంటూ గతంలో, ‘లెట్ అజ్ వెయిట్’ పేరుతో ఓ క్యాంపైన్ నడిచింది. వీళ్లు ఆ క్యాంపైన్‌లో భాగం కాకపోయినప్పటికీ అదే మార్గాన్ని ఎంచుకున్నారు.
అలా 50ఏళ్లు దాటేవరకూ శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న వాళ్లలో బెంగళూరుకు చెందిన రజితా నంబియార్ అనే న్యాయవాది ఒకరు. ‘కోర్టు తీర్పు వెలువడగానే మా స్నేహితులమంతా దాని గురించి చర్చించాం. శబరిమలలో తరతరాలుగా కొనసాగుతోన్న సంప్రదాయం అది. దానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని అనుకున్నాం. అందుకే సమయం వచ్చే వరకూ ఆగాలనే నిర్ణయించుకున్నాం’ అని ఆమె చెప్పారు.
ఈ మహిళల నిర్ణయం... తీర్పు వెలువడడానికి ముందే కేరళకు చెందిన హిందూ ఐక్య వేది అధ్యక్షుడు కె.ప్రభాకరన్ చెప్పిన మాటలకు అనుగుణంగా ఉంది. కోర్టు అనుమతిచ్చినా సరే, కేరళకు చెందిన మహిళలు మాత్రం ఆలయంలోకి ప్రవేశించరని ఆయన చెప్పారు.
సుప్రీంకోర్టులో ఈ కేసు ప్రతివాదుల్లో ఒకరైన సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ మాట్లాడుతూ... ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా, ఎక్కువమంది హిందూ మహిళలు ఆలయంలోకి ప్రవేశించరు. నిజానికి, జస్టిస్ ఇందు మల్హోత్రా కూడా మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం చట్ట వ్యతిరేకమని భావించారు’ అని అన్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయం తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంటల్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జె.దేవిక చెప్పారు. ‘హిందూ మతంలో పరిధి దాటి ఆలోచించే స్వేచ్ఛ మహిళలకు ఉండదు. ఆలయంలోకి ప్రవేశం కోరుతూ ప్రదర్శనలు నిర్వహించిన మహిళలకు ఏమైందో అందరం చూశాం. వాళ్లపై దాడి చేసి నోళ్లు మూయించారు’ అని ఆమె అన్నారు.
‘ఎవరైనా సంప్రదాయాన్ని ఉల్లంఘించాలని చూస్తే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్లను అవమానించి సామాజికంగా బహిష్కరించినంత పని చేస్తారు. చాలాసార్లు సంప్రదాయం కంటే ఈ భయమే వారిని వెనకడుగు వేసేలా చేస్తుంది’ అంటారు దేవిక.
చాలామందికి భిన్నంగా ఒకప్పటి నటి, కర్ణాటక మంత్రి జయమాలా రామచంద్ర సుప్రీంకోర్టు తీర్పుపై బహిరంగంగా తన అభిప్రాయం చెప్పారు. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పు రావడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె అన్నారు.
తన 27ఏళ్ల వయసులోనే భర్తతో కలిసి శబరిమల గర్భాలయంలోకి ప్రవేశించినట్లు, అప్పుడు అనుకోకుండా గర్భగుడిలోని దేవుడి విగ్రహాన్ని తాకినట్లు జయమాల గతంలో చెప్పారు.

‘అప్పుడు కూడా నాకు కోర్టుపైనా, దేవుడిపైనా నమ్మకం ఉంది. ఇప్పుడు అది మరింత బలపడింది’, అని ఆమె తెలిపారు.
సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్‌తో పాటు హిందూ ఐక్య వేది సభ్యులు కూడా సుప్రీంకోర్టులో ఈ కేసుపై రివ్యూ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు.
‘ఇప్పటికే మేం కొందరు న్యాయవాదులతో మాట్లాడాం. మరో పది రోజుల్లో దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తాం. ఆ కేసును గెలుస్తామనే ఆశతో ఉన్నాం’ అని ఈశ్వర్ చెప్పారు.
ఈ తీర్పు ప్రభావం ముస్లిం, క్రిస్టియన్ వర్గాలపైనా ఉంటుంది కాబట్టి, వాళ్లతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు రాహుల్ ఈశ్వర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- అభిప్రాయం: 'వివాహేతర లైంగిక సంబంధాల చట్టంలోని వివక్ష తొలగిపోయింది'
- యూకేలో ప్రజలకు ఎలాంటి గుర్తింపు కార్డులూ ఉండవు... ఎందుకు?
- బిగ్ బాస్: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’ –బాబు గోగినేని
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








