అభిప్రాయం: 'వివాహేతర లైంగిక సంబంధాల చట్టంలోని వివక్ష తొలగిపోయింది'

సెక్షన్ 497, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా రామశేషన్
    • హోదా, బీబీసీ కోసం

సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాల (సెక్షన్ 497) చట్టంలోని వివక్షను అంగీకరించడం తిరోగామి చట్టాలను తొలగించడంలో ఒక గొప్ప ముందడుగు.

వివక్షతో కూడిన చట్టాలను తొలగించే దిశగా మరో అడుగు వేసిన సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాల చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఈ నిబంధన ఏకపక్షంగా ఉండడంతోపాటూ, మహిళల వ్యక్తిగత గోప్యత హక్కును, లైంగిక నిర్ణయాధికారాన్ని ఉల్లంఘించే విధంగా ఉందని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధాన్ని ఇప్పటివరకు నేరంగా భావిస్తున్నారు. ఆ ప్రకారం ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్న పురుషుడికి మాత్రమే శిక్ష విధించేవారు.

పురుషుడు వివాహితుడైనా, అవివాహితుడైనా, అవతలి వైపు ఉన్నది వివాహిత మహిళ అయితే తప్ప అది నేరం కాదు. ఈ చట్టం ఎంత అర్ధరహితమైనదంటే, ఒకవేళ వారిద్దరి సంబంధానికి భర్త అంగీకరిస్తే మాత్రం అది నేరం కాదు.

1860లలో క్రైస్తవం మినహా అన్ని మతాలలో బహుభార్యత్వం ప్రబలంగా ఉన్న రోజులలో మెకాలే, ఇతర లా కమిషనర్లు ఈ చట్టాన్ని రూపొందించారు.

ఈ చట్టం నుంచి మహిళలను మినహాయించడానికి, ''మహిళలకు బాల్యంలోనే వివాహాలు జరుగుతాయి. వాళ్లు చిన్న వయసులో ఉండగానే చాలా మంది భార్యలున్న భర్తలు వాళ్లను నిర్లక్ష్యం చేస్తారు. వారు భర్తను ఆకట్టుకోవడానికి ఇతర భార్యలతో కలిసి పోటీ పడాల్సి వస్తుంది. ఒక వైపు భర్త తన జనానాను మొత్తం భార్యలతో నింపుకుని ఆనందిస్తుంటే, భర్త నిరాదరణకు గురైన భార్యను శిక్షించడం తగదు'' అని పేర్కొన్నారు.

భార్యను భర్త ఆస్తిగా పరిగణించినప్పటికీ, సమాజంలో నాటి మహిళల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న లా కమిషనర్ల ఆమెను విచారణ పరిధి నుంచి తొలగించాలని నిర్ణయించారు.

సెక్షన్ 497, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Reuters

భర్త హక్కులు కాపాడడానికే

గతంలోను ఈ చట్టంపై పలుమార్లు వివాదం తలెత్తింది. అయితే, ఈ చట్టంలోని వివక్షను తొలగించడానికి కోర్టులు ఎందుకో ఇష్టపడలేదు.

ఈ చట్టాన్ని ఏర్పరిచిన వందేళ్ల తర్వాత కూడా దీనిని రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ నిబంధనలు భర్త హక్కులను రక్షించడానికి ఉద్దేశించినవని చెప్పింది.

ఇద్దరు వివాహితలు 80ల్లో ఈ నిబంధనలను సవాలు చేశారు.

ఒక మహిళ స్నేహితుడిపై ఆమెతో విడిపోయిన భర్త ఫిర్యాదు నమోదు చేశాడు. దీనిని ఆ మహిళ కోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు దీనిని "ఒక వ్యక్తి భార్యను మరొకరు మోసగించడం"గా భావించింది. (సౌమిత్రి విష్ణు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం 1985).

రెండో కేసులో ఒక మహిళ తన భర్త ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని, ఆయన చేసింది ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం నేరమైనా తనకు ఫిర్యాదు చేసే హక్కు లేకుండా పోయిందని సవాలు చేసింది.

దీనిపై కోర్టు "ఒక మహిళతో అక్రమ సంబంధం ఏర్పరుచుకోవడం ద్వారా వివాహ సంబంధాల పవిత్రతను, వివాహిత ఇంటిని విచ్చిన్నం చేసిన వ్యక్తిని సమాజం శిక్షిస్తుందని" చెప్పింది.

భార్యాభర్తల విషయానికి వస్తే వారు సర్దుకోవడంగానీ, లేదా విడిపోవడం గానీ చేయాలని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకూడదని తెలిపింది.

వివాహేతర సంబంధాల చట్టం, సెక్షన్ 497, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Thinkstock

చట్టం కొట్టివేయడంతో మహిళలకు మేలు

ఆ వివక్షను ఇవాళ తొలగించారు. గోప్యత అన్న భావన ద్వారా సుప్రీంకోర్టు వ్యక్తుల లైంగిక స్వాతంత్రంలో జోక్యం చేసుకోవడాన్ని అరికట్టింది. అయితే ఇది భారత వైవాహిక వ్యవస్థను ధ్వంసం చేస్తుందని, వివాహేతర సంబంధాలలో స్త్రీపురుషులను సమాన భాగస్వాములుగా చూడలేమని వాదించడం ద్వారా భారత ప్రభుత్వం అలాంటి చట్టాన్ని సమర్థించడం విచారకరం.

వివాహేతర సంబంధాల్లో మహిళలు, పురుషులను సమాన భాగస్వాములుగా చూడడం అనేది మళ్లీ 18వ శతాబ్దం నాటి పితృస్వామ్య నియమాలను పటిష్టం చేసినట్టే అవుతుంది.

ఈ చట్టాన్ని కొట్టేయడం మహిళలకు చాలా మేలు కలుగజేస్తుంది. ఒక వైవాహిక జీవితం విఫలమైనపుడు ఆమె మగ స్నేహితుడు ఆమెకు సాయం చేసిన సందర్భంలో ఆమెను వేధించడానికి ఈ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడం జరుగుతోంది.

ఇలాంటి కేసుల్లో ఆమె నిందితురాలు కాదు కాబట్టి, స్వయంగా ఆమె ప్రవర్తన గురించి సాక్ష్యం కోసం ఆమెనే పిలవడం జరుగుతోంది. వివాహితులైన పురుషులు కూడా ద్వితీయ వివాహం చేసుకున్న సందర్భాలలో తాము కేవలం కలిసి జీవిస్తున్నామని పేర్కొంటూ, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

భారతదేశంలో భార్యాభర్తలిద్దరూ వివాహం రద్దుకు పట్టుబడితే తప్ప అవి బాగుచేయలేని పరిస్థితికి చేరాయనే కారణంతో ఆ వివాహాలను రద్దు చేయలేం.

విడాకుల కోసం వైవాహిక జీవితంలో ఏదో ఒక తప్పు జరిగిందని నిరూపించాల్సి ఉంటుంది. ఇతరులతో అక్రమ సంబంధం అనేది అలాంటి ఒక కారణం. అలాంటి సందర్భాలలో భార్యాభర్తలిద్దరికీ కూడా ఊరట లభిస్తుంది. ఈ విధంగా వివాహేతర సంబంధాలు పౌరచట్టంలో ఉంటాయి కానీ, వాటిని ఇకపై చట్టాలలో నేరంగా పరిగణించరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)