అభిప్రాయం: ఆధార్‌ తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ వ్యక్తం చేసిన సందేహాలు ఎందుకు ముఖ్యం?

ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆధార్ నమోదు

ప్రపంచంలోనే అతిపెద్ద, వివాదాస్పద బయోమెట్రిక్-ఆధారిత డాటాబేస్ ఆధార్ కొనసాగడానికి తగిన చట్టపరమైన కారణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ, అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మాత్రం మెజారిటీ జడ్జీల తీర్పుతో ఏకీభవించలేదు. నలుగురితో విభేదించిన జస్టిస్ చంద్రచూడ్ వెలిబుచ్చిన సందేహాలు సహాతుకమైనవే అంటున్నారు రోనాల్డ్ అబ్రహం, ఎలిజబెత్ ఎస్ బెనెట్.

భారతదేశంలో 120 కోట్లకు పైగా పౌరులు, అంటే దాదాపు ప్రపంచ జనాభాలో ఆరోవంతు మందికి ఆధార్ ఉంది. ప్రభుత్వం అనేక పథకాలం కోసం ఆధార్‌ను ప్రోత్సహించింది. తప్పనిసరి కూడా చేసింది.

అయితే భారతదేశంలోని అనేక మంది పౌరహక్కుల నేతలు నాలుగు కారణాలను చూపిస్తూ దానిని వ్యతిరేకించారు. అవి: ఆధార్ గోప్యత, చట్టబద్ధత, డేటా సెక్యూరిటీ, ప్రయోజనాలు.

మరైతే ఆధార్ చట్టం చట్టబద్ధమేనా?

ఆధార్ ప్రారంభమైన ఏడేళ్ల అనంతరం, పార్లమెంట్ 2016లో ఆధార్ చట్టాన్ని ఆమోదించారు.

ఆ చట్టంలోని ఒక నిబంధన.. అప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలనూ చట్టబద్ధం చేసింది.

అయితే, రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా ఆధార్ 'మనీ బిల్' రూపంలో ఆమోదం పొందింది. ఆ చట్టాన్ని సవాలు చేయడానికి ఉన్న అనేక కారణాలలో అదొకటి.

ఆధార్, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Mansi Thapliyal

గోప్యతకు భద్రత ఉందా?

ఈ చట్టాన్ని సవాలు చేయడానికి ముఖ్య కారణం.. గోప్యత.

బయోమెట్రిక్స్ అంటే సున్నితమైన వ్యక్తిగత సమాచారం. ఆధార్ వ్యక్తిగత గోప్యతకు భంగమని పిటిషనర్లు వాదించారు. ఆధార్ ద్వారా ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను గుర్తించి, వాళ్లపై నిఘా పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని పిటిషనర్లు వాదించారు.

అయితే ఆధార్ వ్యవస్థలో అలాంటి లోటుపాట్లను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టారని భావిస్తూ మెజారిటీ సభ్యులు ఈ భయాలను కొట్టిపారేశారు.

ఈ తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ మాత్రం మిగతావారితో విభేదించారు. అయిన ఆధార్ కారణంగా గోప్యతకు కలిగే ప్రమాదాలను ఉదహరించారు.

ఆధార్, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL

ఫొటో క్యాప్షన్, ఆధార్‌లోని లోటుపాట్ల కారణంగా పలువురు ప్రభుత్వ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

డేటా ఎంత వరకు భద్రం?

ఆధార్ డేటాబేస్‌కు భద్రతాపరమైన ప్రమాదం ఉందంటూ స్వతంత్ర పరిశోధకులు ఎన్నాళ్లుగానో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ డేటాబేస్‌కు ప్రమాదం లేనప్పటికీ, దానితో సంబంధం కలిగిన డేటాబేస్, సాఫ్ట్‌వేర్ హ్యాక్ అయ్యాయి.

అలాంటి స్వతంత్ర పరిశోధకుల హెచ్చరికలను అనుగుణంగా దానిని మరింత కట్టుదిట్టం చేయాల్సిన ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూ వచ్చింది.

దాని భద్రతను పెంచడానికి కానీ, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి కానీ చర్యలేవీ తీసుకోలేదు.

ఆధార్, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP

ఆధార్ వల్ల నష్టాలకన్నా లాభాలే ఎక్కువా?

మెజారిటీ సభ్యుల తీర్పు ప్రకారం.. గోప్యత, డేటా సెక్యూరిటీ ప్రమాదాలతో పోలిస్తే లాభాలే ఎక్కువ. గత రెండేళ్లలో మేం ఆధార్ వల్ల ప్రయోజనాలను మూడు రాష్ట్రాలలో పరిశోధించినపుడు.. ఆధార్ వల్ల మేలు జరిగిన విషయాన్ని మేం గుర్తించాం.

అయితే సర్వే చేసిన మూడు రాష్ట్రాలలోను సేకరించిన ప్రాథమిక సమాచారంలో సుమారు 8.8 శాతం తప్పులు ఉన్నాయి. దీని వల్ల కొంతమంది లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది.

ఆధార్ బ్యాంకులకు ఒక గుర్తింపుగా ఉపయోగపడుతుందని తద్వారా పేదలకూ ఆర్థిక ప్రయోజనాలు అందేలా చేయవచ్చనే అభిప్రాయం ఉంది.

మా పరిశోధనలో మూడింట రెండొంతుల మంది బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లు తెరవడం కోసం ఆధార్‌ను ఉపయోగించుకున్నట్లు తేలింది.

అయితే డిజిటల్ ఐడీగా దాని పాత్ర మాత్రం పరిమితం. 2014 నుంచి బ్యాంకు అకౌంట్లు తెరిచిన వారిలో, కేవలం అయిదుగురిలో ఒకరికన్నా తక్కువ మంది మాత్రమే ఆధార్ ఎలెక్ట్రానిక్ గుర్తింపు వ్యవస్థను ఉపయోగించుకున్నారు.

చివరగా, భారతదేశపు ఆహార సబ్సిడీ కార్యక్రమాలను ఆధార్‌తో అనుసంధానించారు.

మూడు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో మేం చేసిన సర్వేలో, సుమారు 20 లక్షల మందికి ఆధార్ లోటుపాట్ల కారణంగా అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని వెల్లడైంది.

ఈ తీర్పులో భిన్నాభిప్రాయానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి?

జస్టిస్ చంద్రచూడ్ వ్యక్తం చేసిన భేదాభిప్రాయాలపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి.

ఆయన వ్యక్తం చేసిన సందేహాలపై ప్రభుత్వం భవిష్యత్తులో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అది కూడా పారదర్శకంగా జరగాలని మేం భావిస్తున్నాం.

తన బ్యాంక్ అకౌంటును ఆధార్‌తో జతపరచని కారణంగా రాజ్‌కుమార్ దేవి పింఛన్‌ను గత అక్టోబర్ నుంచి నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Ronny Sen

ఫొటో క్యాప్షన్, తన బ్యాంక్ అకౌంటును ఆధార్‌తో జతపరచని కారణంగా రాజ్‌కుమార్ దేవి పింఛన్‌ను గత అక్టోబర్ నుంచి నిలిపివేశారు.

గోప్యత లేదా డేటా ఉల్లంఘన జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం వెంటనే దానిని తోసిపుచ్చే చర్యలు మానుకోవాలి. దానికి బదులుగా ప్రభుత్వం స్వతంత్ర పరిశోధకులపై ఆరోపణలు గుప్పించడానికి బదులు వారితో చర్చించాలి.

అంతేకాకుండా, ఆధార్ లాభాలను ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా మానుకోవాలి. ఆధార్ వల్ల ఎంతో సొమ్ము ఆదా అయిందని ప్రభుత్వం చెబుతుండగా, దానిని బలపరిచే సాక్ష్యాలేమీ లేవు.

ప్రభుత్వం డేటా భద్రత, దానిలోని లోటుపాట్లు, వాటిని తొలగించడానికి తాము చేపడుతున్న చర్యలు.. ఇవన్నీ బహిర్గతం చేయాలి. అలాంటి పారదర్శకతే ఆధార్‌కు మేలు చేస్తుంది.

ప్రభుత్వం మెజారిటీ జడ్జీలు ఇచ్చిన తీర్పును అనుసరించి ఆధార్‌ను ఇకపై మరిన్ని పథకాలకు ఉపయోగించుకోవడాన్ని వేగవంతం చేయవచ్చు. దానికి బదులుగా ప్రభుత్వం కేవలం దానిని ప్రజల గుర్తింపునకు ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటూ, దానిని మరింత సురక్షితం చేయడంపై దృష్టి సారించాలి.

(రోనాల్డ్ అబ్రహం, ఎలిజబెత్ ఎస్ బెనెట్ IDinsight తరపున స్టేట్ ఆఫ్ ఆధార్ రిపోర్ట్: 2017-18 అన్న నివేదికను ప్రచురించారు. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)