వరవరరావు అరెస్ట్: హక్కుల కార్యకర్తల గ‌ృహ నిర్బంధం మరో నాలుగు వారాలు పొడిగింపు.. బెయిల్ కోసం కింది కోర్టుల్ని ఆశ్రయించండి - సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు, వరవరరావు

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో చోటు చేసుకున్న హింస కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా దాడులు చేసిన పుణె పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు - వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాల గృహ నిర్బంధాన్ని మరో నాలుగు వారాల పాటు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలు.. గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లు ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్నందున ఆ నిర్బంధాన్ని కొనసాగించింది.

కాగా, తమకు బెయిల్ ఇవ్వాలంటూ వారు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం కింది కోర్టుల్ని ఆశ్రయించాలని వారికి సూచించింది. మహారాష్ట్రలో జరిగిన కుల ఆధారిత ఘర్షణలకు సంబంధం ఉందనే ఆరోపణలతో వీరిని ఈ ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు.

అరెస్టులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పరచాలన్న వీరి అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

2-1 మెజార్టీతో తీర్పు

ఐదుగురు నిందితుల గృహనిర్బంధాన్ని మరో నాలుగు వారాలు పొడిగించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం రెండు-ఒకటి మెజారిటీతో తీర్పు చెప్పింది.

ఐదుగురి అరెస్టులకు అసమ్మతి కారణం కాదని, నిషేధిత మావోయిస్టు సంస్థతో వారికి సంబంధాలున్నట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

కార్యకర్తలపై కేసు కొనసాగించడానికి దర్యాప్తు అధికారులను అనుమతి ఇచ్చింది.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రధాని హత్యకు కుట్ర’పై ప్రత్యేక దర్యాప్తు జరగాలి - జస్టిస్ చంద్రచూడ్

ముగ్గురు జడ్జిల్లో జస్టిస్ చంద్రచూడ్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సరైన దర్యాప్తు లేకుండా ఐదుగురు కార్యకర్తలను పీడిస్తే రాజ్యాంగం ద్వారా లభించిన స్వేచ్ఛకు అర్థం ఉండదన్నారు. మహారాష్ట్ర పోలీసులు చేసిన దర్యాప్తు విధానాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న అభియోగాలపై దర్యాప్తు జరపాలని ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించారు. అయితే, జస్టిస్ చంద్రచూడ్ తీర్పుతో ధర్మాసనంలోని మిగతా ఇద్దరు న్యాయమూర్తులు విభేదించిన కారణంగా ఆయన ఆదేశాలు అమలు కావు.

అంతకు ముందు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఇదే ముగ్గురు జడ్జిల బెంచ్ స్వగృహాలలోనే వారిని నిర్బంధించాలని ఆదేశించి, ఐదుగురు కార్యకర్తల స్వేచ్ఛను రక్షించింది.

పోలీసులు తమకు లభించిన సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకున్నారా లేదా చూస్తామని గత నెలలో కోర్టు చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం నమ్మిన ఆధారాలపై ఐదుగురు కార్యకర్తలకు వ్యతిరేకంగా కేసును వండివార్చినట్టు తేలితే దానిని కొట్టివేస్తామని చెప్పింది.

కార్యకర్తలు 2017 డిసెంబర్ 31న నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా దళితలును ఆకర్షించారని, అది హింసాత్మక ఘటనలకు కారణమయ్యిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దేశంలోని నిషేధిత మావోయిస్టు సంస్థలకు ఈ ఐదుగురు కార్యకర్తలు మద్దతు కూడా ఇస్తున్నారని వారు చెబుతున్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

హైకోర్టుకు వెళతాం.. - వరవరరావు భార్య హేమలత

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్‌ హైదరాబాద్‌లోని వరవరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా..

‘‘ఈ తీర్పును ఆశించలేదు. ఇలా వస్తుందని మేం ఊహించలేదు. ఈ కేసు పెట్టగానే తమంతట తాముగా ముందుకు వచ్చి వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్, తదితర సుప్రీంకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు. ఈ కేసు నడిచిన విధానం వల్ల కూడా మేం ఇలా (ఉత్తర్వులు) వస్తాయని అనుకోలేదు. కేసు కొట్టేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు మేం (నిర్ణయం) తీసుకోం, కింది కోర్టుకు వెళ్లమన్నారు. హైకోర్టుకు వెళతాం. అక్కడ విజయం మాదే అనుకుంటున్నాం. ఈ కేసులో ఏమీ లేదు. ఇదొక తప్పుడు కేసు. గత నలభై ఏళ్లలో వరవరరావుపై 20 నుంచి 30 కేసులు పెట్టారు. ఏ కేసులో కూడా శిక్ష పడలేదు. అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి కేసే.. తీర్పు కూడా అలానే వస్తుంది అనుకుంటున్నాం’’ అని వరవరరావు భార్య హేమలత చెప్పారు.

‘‘ఆగస్టు 29వ తేదీ నుంచి జరిగిన వాదనలను బట్టి మేం సానుకూల తీర్పు ఆశించాం. పోలీసులు తప్పుడు, సృష్టించిన సాక్ష్యాలు ఇస్తున్న విషయం నిరూపితమైంది. స్వయంగా జస్టిస్ చంద్రచూడ్ ఇది అసమ్మతి అనీ, అసమ్మతిని అనుమతించకపోతే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుందనీ వ్యాఖ్యానించారు. కానీ నాలుగు వారాల వాదనల తరువాత సుప్రీంకోర్టు ఇలాంటి దురదృష్టకర తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చంద్రచూడ్ డిసెంట్ నోట్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరూ న్యాయమూర్తులు పూణె పోలీసులతో ఏకీభవించారు. గృహ నిర్బంధం మరో నాలుగు వారాలు పొడిగిస్తూనే, మేం కింది కోర్టులకు వెళ్లడానికి అనుమతినిచ్చారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సూచనల మేరకు మేం కింది కోర్టులకు వెళతాం. సరైన సాక్ష్యాలు లేనందున కింది కోర్టులు ఈ కేసును కొట్టి వేస్తాయని ఆశిస్తున్నాం’’ అని వరవరరావు బావమరిది వేణుగోపాల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)