పుణే పోలీసుల అరెస్టులు: ఎల్గార్ పరిషత్ అంటే ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయూరేశ్ కొన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భీమా-కోరేగావ్ హింస కేసుకు సంబంధించి వామపక్ష అనుకూల రచయితలు, పాత్రికేయులు, కవి, గిరిజన ప్రాంత కార్యకర్తల అరెస్టులతో ఎల్గార్ పరిషత్ (సదస్సు) మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2018 జనవరి 1వ తేదీన భీమా కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద అల్లర్లు చెలరేగాయి. దానికి ఒక రోజు ముందు శనివార్ వాడా మైదానాల్లో ఎల్గార్ పరిషత్‌ను నిర్వహించారు. అది హింసను ప్రేరేపించిందని పోలీసులు భావిస్తున్నారు.
అసలు.. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ఎల్గార్ పరిషత్ అంటే ఏమిటి?
ఈస్ట్ ఇండియా కంపెనీకి, పీష్వాల నాయకత్వంలోని మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన భీమా కోరేగావ్ సంగ్రామానికి 2018 జనవరి 1 నాటికి 200 సంవత్సరాలు. ఆ యుద్ధంలో మరాఠా సైన్యం పరాజయం పాలయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో కీలక పాత్ర పోషించిన మహర్ రెజిమెంట్ సైనికుల సాహసానికి స్మారకంగా బ్రిటిష్ వాళ్లు అక్కడ విజయ ధ్వజం స్థాపించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఈ స్మారకాన్ని సందర్శించినప్పటి నుంచీ ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఆ విజయోత్సవాలను గుర్తుచేసుకోవటానికి వేలాది మంది దళితులు ఇక్కడికి వస్తారు.
ఈ ఏడాది ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా.. 2017 డిసెంబర్ 31వ తేదీన ‘భీమా కోరేగావ్ శౌర్య దిన్ ప్రేరణ అభియాన్’ అనే వేదిక ఆధ్వర్యంలో పలు సంస్థలు ‘ఎల్గార్ పరిషత్’ పేరుతో ఒక బహిరంగ సభలో పాల్గొన్నాయి. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని రక్షించండి.. దేశాన్ని రక్షించండి’ అనే నినాదంతో ఈ సభను శనివార్ వాడ మైదానాల్లో నిర్వహించారు. ఆ ప్రదేశం ఒకప్పటి మరాఠా సామ్రాజ్యానికి అధికార కేంద్రం.

ఫొటో సోర్స్, Mayuresh Konnur
రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ సభను ప్రారంభించారు. బహుజన్ మహాసంఘ్ (భారిప) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.జి.కోల్సే-పాటిల్, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేశ్ మేవాని, జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, గిరిజన కార్యకర్త సోని సోరి వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
సభలో వారు ప్రసంగించటంతో పాటు.. కబీర్ కళా మంచ్ వంటి బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ మరుసటి రోజు.. భీమా-కోరేగావ్ స్మారకం వద్ద ఉత్సవాలు జరుగుతుండగా సమీపంలోని సనాస్‌వాడి వంటి ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొంత సేపు రాళ్లు విసరటం కొనసాగింది. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక యువకుడు చనిపోయాడు. ఆ హింస ధ్వని దేశమంతా వినిపించింది.
మితవాద సంస్థ ‘సమస్త హిందూ అఘాడి’ నాయకుడు మిలింద్ ఏక్బోటే, ‘శివ్ ప్రతిష్టాన్’ వ్యవస్థాపకుడు శంభాజీ భీడే మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును పుణే గ్రామీణ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు.. ఎల్గార్ పరిషత్‌కు సంబంధించి పుణే నగరంలోని విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. జిగ్నేశ్ మేవాని, ఉమర్ ఖాలిద్‌లు ఆ సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్నది మొదటి ఎఫ్ఐఆర్‌లో ఆరోపణ. ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన వ్యక్తులపై తుషార్ దామ్‌గుడే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ రెండో ఎఫ్ఐఆర్ కింద.. సుధీర్ ధావలే సహా ఐదుగురు కార్యకర్తలను జూన్‌లో అరెస్ట్ చేశారు.
తాజాగా ఆగస్టు 28వ తేదీన విప్లవ కవి వరవరరావు, మానవ హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్, ఉద్యమకారుడు గౌతమ్ నవ్‌లాఖా, న్యాయవాదులు - ఉద్యమకారులు అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్‌లను పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫెరీరా, గొంజాల్వెజ్‌ల కస్టడీ కోరుతూ పుణె పోలీసులు కోర్టులో చేసిన వాదనల ప్రకారం.. ‘‘అరెస్టయిన వారందరూ నిషిద్ధ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సంస్థ సభ్యులు. ఎల్గార్ పరిషత్ నిర్వహణ దేశాన్ని అస్థిరపరచే వారి ప్రణాళికలో భాగం. ఎల్గార్ పరిషత్ కేవలం బాహ్యముఖం మాత్రమే. మావోయిస్టులు తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవటానికి దానిని వాడుకున్నారు. ఆ సభలో సుధీర్ ధావలే, కబీర్ కళా మంచ్ సభ్యులు అభ్యంతరకరమైన పాటలు పాడారని ఆరోపణలున్నాయి. విచ్ఛిన్నకర, రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని.. కరపత్రాలు, పుస్తకాలు, ప్రసంగాలతో హింసకు కారణమయ్యారని ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, AFP
నిషిద్ధ సీపీఐ (మావోయిస్టు) పార్టీకి దళితులను తప్పుదోవపట్టించటం, అతివాద మావోయిస్టు ఆలోచనలను ప్రచారం చేయటం, రాజ్యంగబద్ధం కాని, హింసాత్మక ఆలోచనలను ప్రోత్సహించే విధానం ఉంది. ఈ విధానంలో భాగంగా కబీర్ కళా మంచ్‌కు చెందిన సుధీర్ ధావలే, ఆయన ఉద్యమకారులు.. సమాజాన్ని విభజించటం లక్ష్యంగా గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలోని విభిన్న ప్రాంతాల్లో.. చరిత్రను వక్రీకరిస్తూ రెచ్చగొట్టే విధమైన, విచ్ఛిన్నకరమైన ప్రసంగాలు చేశారు. రెచ్చగొట్టే పాటలు, వీధి నాటకాలు ప్రదర్శించారు. దీని ఫలితంగా భీమా కోరెగాం, ఆ పరిసర ప్రాంతాల్లో రాళ్లు విసరడం, హింస చెలరేగాయి.’’
కానీ.. ఆ సభకు - మావోయిస్టు గెరిల్లాలకు, బీమా-కోరెగాం హింసకు లింకు పెడుతూ పోలీసులు చేస్తున్న ఆరోపణలన్నిటినీ ఎల్గార్ పరిషత్‌కు చెందిన సంస్థలు, నాయకులు, ఉద్యమకారులు తిరస్కరిస్తున్నారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.జి. కోల్సే-పాటిల్ ముంబైలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్గార్ పరిషత్ సభకు కేవలం ఒకటో, రెండో సంస్థలు కాదని.. 300కు పైగా సంస్థలు మద్దతిచ్చాయని చెప్పారు.
‘‘ఎల్గార్ పరిషత్‌ను నేను, జస్టిస్ పి.బి.సావంత్ నిర్వహించాం. మేమిద్దరమే ఇందులో భాగస్వాములం. అంబేడ్కర్ వాదులు, లౌకిక జనం అంతా జనవరి 1వ తేదీన భీమా కోరెగాం రావాలని మేం అనుకున్నాం. అందుకోసం డిసెంబర్ 31వ తేదీన వారిని రప్పించాలనుకున్నాం. అంతకుముందు అదే శనివార్ వాడలో అక్టోబర్ 4వ తేదీన ఒక సభను నిర్వహించాం. ‘ఆర్ఎస్ఎస్ ముక్త భారత్’ డిమాండ్ చేస్తూ ఆ సభను ఏర్పాటుచేశాం. అప్పుడు కూడా ఇదే సంఖ్యలో ఆ సభకు హాజరయ్యారు. పోలీసులు అంతకుముందు ఎఫ్ఐఆర్‌లో ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టులతో సంబంధం లేదని చెప్పారు. కానీ వాళ్లు ఇప్పుడు భిన్నమైన విషయాలు చెప్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఎల్గార్ పరిషత్‌లో.. తమ జీవితాంతం ఎటువంటి మతతత్వ పార్టీకీ ఓటేయబోమని జనంతో ప్రమాణం చేయించాం. ఆర్ఎస్ఎస్ ప్రేరిత బీజేపీకి మేం ఓటేయబోం. ఈ ప్రమాణం వారికి నచ్చలేదు’’ అంటూ.. ఇదంతా రాజకీయ ప్రతీకారం కోసం చేపట్టిన చర్యలని ఆయన పరోక్షంగా సూచించారు.
‘‘ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టులతో సంబంధం ఉందనటం పూర్తిగా అవాస్తవం. అరెస్టయిన వారెవరికీ మాతో ఎలాంటి సంబంధం లేదు. నక్సలైట్లు ఇచ్చిన నిధులతో ఆ సభను నిర్వహించామని చెప్పటం నిజం కాదు. మాకు ఎవరి నుంచీ ఎటువంటి డబ్బులూ రాలేదు. వాళ్లందరూ భీమా కోరెగాం కార్యక్రమానికి హాజరవటానికి వచ్చిన వాళ్లే. అక్కడ అప్పటికే వేరే కార్యక్రమం కోసం వేసిన వేదికను మేం వాడుకున్నాం’’ అని కోల్సే-పాటిల్ వివరించారు.
భారిపా బహుజన్ సంఘర్ష్ నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్ కూడా పోలీసుల ఆరోపణలతో విభేదించారు. ‘‘జస్టిస్ పి.బి.సావంత్, జస్టిస్ కోల్సే-పాటిల్‌లు చెప్పినట్లుగా.. వారే స్వయంగా గతంలో కూడా ఎల్గార్ పరిషత్‌లు నిర్వహించారు. వారు విద్యార్థుల సాయం తీసుకున్నారు. తమ సొంతంగా నిధులు సేకరించారు. మీదర్గర (పోలీసుల దగ్గర) ఏం సాక్ష్యాలు ఉన్నాయో మాకు చూపండి. కానీ వాళ్లు ఎటువంటి సాక్ష్యాలూ ఇవ్వటం లేదు. మావోయిస్టులు, ఉగ్రవాదులు ఎవరో చెప్పండి?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రం విభిన్న కులాల వారీగా విడిపోయిందన్న చిత్రాన్ని మరాఠా ఆందోళనలు సృష్టించాయని.. వాటిని ఐక్యం చేయటానికి ఎల్గార్ పరిషత్ నిర్వహించటం జరిగిందని అంబేడ్కర్ పేర్కొన్నారు.
‘‘సమాజం ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు. ఈ వివాదాలు ప్రజలను ఒకరికొకరిని దూరం చేశాయి. సామరస్యం తీసుకురావటం కోసం ఎల్గార్ పరిషత్ జరిగింది. భీమా కోరెగాం అనేది ఒక సామాజిక పునరుద్ధరణ. బ్రిటిష్ వారి కిందే అయినప్పటికీ.. వేర్వేరు వర్గాలకు చెందిన వారు మహర్ సైనికుల నాయకత్వంలో కలిసి పోరాడారు. అది సామాజిక సంబంధాలను బలోపేతం చేసే అంశం. కులాల మధ్య సంఘర్షణలను తొలగించటానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు మరాఠా సమాజం తమ డిమాండ్లను కూడా మార్చుకున్నట్లు మనకు కనిపిస్తోంది. ఓబీసీ కేటగిరీ కింద కాకుండా వేరుగా రిజర్వేషన్ కావాలని వాళ్లిప్పుడు అడుగుతున్నారు. అత్యాచార నిరోధ చట్టం తమ పట్ల మరీ కఠినంగా లేకుంటే దానిని అంగీకరించటానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎల్గార్ పరిషత్ వల్లే ఈ మార్పు వచ్చింది’’ అని ఆయన చెప్పారు.
అసమ్మతి గళాలన్నిటినీ అణచివేసే ఉద్దేశంతోనే పోలీసు చర్యలు చేపడుతున్నారని ఆయన భావిస్తున్నారు. ‘‘ఇది కేవలం దళితులు ఎదుర్కొంటున్న అన్యాయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మూక దాడుల్లో కొట్టి చంపటాలు ఉన్నాయి. అగ్ర కుల ‘సవర్ణుల’ గళాలు కూడా నొక్కివేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. దళితులు, ముస్లింలు తాము అణచివేతకు గురైనపుడు గొంతెత్తుతారు. వార్తా పత్రికలు కూడా గళమెత్తుతాయి. గొంతెత్తే అగ్రకులాల వారు కూడా కొందరున్నారు. వారిని కూడా నోరుమూయించే ప్రయత్నిమిది’’ అని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు.
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- అందమైన జీవితమంటూ తీసుకెళ్లారు.. కానీ అక్కడ కుక్కలతో కరిపించారు
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- నాగ్‌పూర్ అత్యాచారం: పాతికేళ్ల నా సర్వీసులో.. అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








