సుప్రీంకోర్టు: ‘ఉద్యమకారులను గృహ నిర్బంధంలోనే ఉంచండి.. అసమ్మతిని అడ్డుకోవద్దు’

ఫొటో సోర్స్, Getty Images
పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విప్లవ రచయితల సంఘం నాయకుడు పెండ్యాల వరవరరావు సహా ఐదుగురు పౌర హక్కుల ఉద్యమకారులను సెప్టెంబర్ 6వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరికి రిమాండ్ విధించేందుకు నిరాకరించింది.
మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో చోటు చేసుకున్న కులపరమైన హింస కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా దాడులు చేసిన పుణె పోలీసులు అయిదుగురు ఉద్యమకారులు - వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జనవరిలో భీమా కోరెగావ్‌లో చోటుచేసుకున్న హింసతో వారికి సంబంధం ఉందని, ప్రధాని మోదీ హత్యకు వారు కుట్ర పన్నారన్నది పోలీసుల ఆరోపణ.
ఈ అరెస్టులను సవాల్ చేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అరెస్టులను ఆపాలని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆమె దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించగా, కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరళ్లు తుషార్ మెహతా, మణిందర్ సింగ్ వాదించారు. సెప్టెంబర్ 6వ తేదీ వరకు అరెస్టు చేసిన ఉద్యమకారులను గృహ నిర్బంధంలో ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
పూణె తరలించిన వరవరరావు, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను వారివారి స్వగృహాల్లోనే నిర్బంధించాలని తెలిపింది. గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లు ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్నందున ఆ నిర్బంధాన్ని కొనసాగించింది.
ఐదుగురు ఉద్యమకారులను పూణె పోలీసులు అరెస్ట్ చేయటంపై మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ సెప్టెంబర్ 5వ తేదీలోపు పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
‘అసమ్మతి.. ప్రజాస్వామ్య భద్రతా కవాటం. భద్రతా కవాటాన్ని మీరు తొక్కిపెడితే (ఒత్తిడి పెరిగి) ప్రెషర్ కుక్కర్ బద్ధలవుతుంది’’ అని న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కేసు విచారణ సందర్భంగా అన్నారు.

ముంబయిలో అరుణ్ ఫెరీరా, వర్నన్ గోంజాల్వెజ్లను అరెస్ట్ చేశారు. హర్యానాలోని సూరజ్ కుండ్ సమీపంలో పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ కార్యకర్త సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేశారు. దిల్లీలో పియుడిఆర్ హక్కుల నేత గౌతమ్ నవలాఖాను అరెస్ట్ చేశారు. గోవాలో ప్రముఖ దళిత రచయిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్దుంబ్డే నివాసం దగ్గరకు పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో ఆయన అక్కడ లేరు. రాంచిలో ఫాదర్ స్టాన్ స్వామి నివాసంలోనూ పోలీసులు సోదాలు జరిపారు. హైదరాబాద్, ముంబయి, దిల్లీ, రాంచి, నగరాల్లో పోలీసులు ఏకకాలంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పుణే జాయింట్ కమిషనర్ శివాజీ భద్కే వెల్లడించారు. బీమా కోరెగావ్ హింసకు సంబంధించి ముఖ్యంగా ఎల్గార్ పరిషత్ కార్యకలాపాలకు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని ప్రశ్నించే గొంతునొక్కడం తప్ప మరేమీ కాదని అంటున్నాయి.
గౌతమ్ నవలాఖాను పుణే తరలించకుండా దిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరుపనుంది. ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
సుధా భరద్వాజ్‌ను పూణె తరలించడానికి పంజాబ్, హర్యానా హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమెను బుధవారం అర్థరాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు.
మరోవైపు వరవరరావు, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను పోలీసులు పూణె కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి:
- విరసం నేత వరవరరావు, పలువురు పౌర హక్కుల నేతల అరెస్ట్, దేశ వ్యాప్తంగా పలు ఇళ్లలో సోదాలు
- ‘మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర’: నిజమా? కల్పితమా?
- ‘ఫాసిజం వైపు ఫాస్ట్ ఫార్వర్డ్?’
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
- స్ఫూర్తి ప్రదాతల కోసం దళితుల వెదుకులాట
- నాగ్‌పూర్ అత్యాచారం: 'పాతికేళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’
- నలభై ఏళ్ల నుంచి ఈ జీవితం అనుభవిస్తూనే ఉన్నాం, అరెస్టులు మాకు కొత్త కాదు - వరవరరావు భార్య హేమలత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








