గృహనిర్బంధంలో వరవరరావు ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Kranthi Tekula/Facebook
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ తెలుగు
మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విప్లవకవి వరవరరావును గృహనిర్బంధంలో ఉంచాలన్న సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు.. హైదరాబాద్‌లోని ఆయన సొంత ఇంట్లో వరవరరావును పోలీసులు నిర్బంధించారు. ఈ గృహనిర్బంధం విధివిధానాలు ఏమిటనే అంశాలను బీబీసీ పరిశీలించింది.
మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో హింసను ప్రేరేపించటం, ‘అత్యున్నత నేత’ హత్యకు ’మావోయిస్టుల కుట్ర‘తో సంబంధాలు ఆరోపణలపై పుణె పోలీసులు విప్లవ రచయితల సంఘం నాయకుడు పెండ్యాల వరవరరావు సహా దేశంలోని వివిధ ప్రాంతం నుంచి.. హక్కుల ఉద్యమకారులైన మరో నలుగురు రచయితలు, న్యాయవాదులను కూడా ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, K V Kurmanath
వరవరరావును అదే రోజు రాత్రి పుణె తరలించారు. అయితే.. చరిత్రకారిణి రొమీలా థాపర్, పలువురు న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటంతో.. వరవరరావు సహా ఐదుగురు ఉద్యమకారులనూ సెప్టెంబర్ 6వ తేదీ వరకు వారి వారి ఇళ్లలోనే గృహనిర్బంధంలోనే ఉంచాలని ఆగస్టు 29వ తేదీన మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్లపై సెప్టెంబర్ 6వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున వరవరావును పుణె నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. హైదరాబాద్ పోలీసులకు ఆయన గృహనిర్బంధం బాధ్యతలు అప్పగించి తిరిగి వెళ్లారు.

‘‘ఆయనను ఇంట్లో నిర్బంధంలో ఉంచటమే మా విధి. ఇంట్లో వ్యవహారాల్లో మా జోక్యం ఉండదు’’ అని గృహనిర్బంధం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డి బీబీసీకి చెప్పారు.
‘‘గృహనిర్బంధంలో వరవరరావు ఇంట్లోనే ఉన్నారు. అతి దగ్గరి కుటుంబ సభ్యులను, ఆయన తరఫు న్యాయవుదులను మినహా ఎవరినీ ఇంట్లోకి వెళ్లటానికి అనుమతించటం లేదు’’ అని ఆయన అల్లుడు, సీనియర్ పాత్రికేయుడు కె.వి.కూర్మనాథ్ బీబీసీకి తెలిపారు.
ఇంట్లో టీవీ చూడటం, పేపర్ చదవటం, ఆహారం తీసుకోవటం, మందులు వేసుకోవటం వంటి రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ఆంక్షలూ, నియంత్రణా లేదని చెప్పారు. ఇంటి దగ్గర, మెయిన్ గేటు సెక్యూరిటీ వద్ద పోలీసు సిబ్బంది ఉన్నారని.. వరవరరావును కలిసే కుటుంబ సభ్యులు, న్యాయవాదుల వివరాలు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు.

అసలు హౌస్ అరెస్ట్ నియమనింబంధనలు ఏమిటని ప్రశ్నించగా.. ‘‘గృహ నిర్బంధం గురించి చట్టాల్లో వివరాలు, నియమనిబంధనలు ఏమీ లేవు. సుప్రీంకోర్టు కూడా తన ఆదేశాల్లో ఏమీ వివరించలేదు. ఇది చేయొద్దు, అది చేయొద్దు.. అనే షరతులు ఏమీ చెప్పలేదు’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
మొదటి రోజు చాలా మంది సహచరులు, అభిమానులు ఆందోళనతో ఆయనను కలవటానికి వచ్చారని.. పోలీసులు అనుమించకపోవటంతో గందరగోళం తలెత్తిందని కూర్మనాథ్ చెప్పారు. అయితే గృహనిర్బంధం అంటే ఇంట్లోనే నిర్బంధం కాబట్టి.. సన్నిహిత కుటుంబ సభ్యులు, ఆయన కేసును వాదిస్తున్న న్యాయవాదులను మినహా ఎవరినీ అనుమతించరన్నది వస్తున్న వారికి వివరించటంతో పాటు ఇంట్లో ఇబ్బంది లేదని వివరించంతో వారి ఆందోళన కాస్త తగ్గిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- వరవరరావు అరెస్ట్: గృహనిర్బంధం అంటే ఏంటి?
- అత్యున్నత నేతను లక్ష్యం చేసుకున్నారు: పుణె పోలీసులు
- ఎమర్జెన్సీని మించిన భయం ఇప్పుడుంది: రొమిలా థాపర్
- పుణే పోలీసుల అరెస్టులు: ఎల్గార్ పరిషత్ అంటే ఏమిటి?
- పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా?
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ‘మద్యపానం.. మితంగా తాగినా ముప్పే’
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- నోట్ల రద్దు: భారీ కుంభకోణం... ఆ 15 మంది కోసం మోదీ చేసిన కుట్ర - రాహుల్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








