శబరిమల: ఇద్దరు మహిళలు.. వందల మంది పోలీసులు ఆలయంలోకి ప్రవేశించకుండానే వెనక్కి

ఫొటో సోర్స్, UGC
కేరళలోని శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై ఆలయ పరిసరాలలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళా భక్తులు చేస్తున్న ప్రయత్నాలను ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
దీంతో వారు పోలీసుల సాయంతో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌కి చెందిన ఒక టీవీ ఛానెల్ రిపోర్టర్ కవిత జక్కల, సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
వీరిరువురూ పోలీసుల సహాయంతో శుక్రవారం తెల్లవారుజామున కొండపైకి ఎక్కారు.
హెల్మెట్లు, భద్రతా కవచాలు ధరించిన దాదాపు 300 మంది పోలీసులు వీరికి పహారాగా నిలిచారు. కేరళ పోలీసు ఐజీ శ్రీజిత్ ఆధ్వర్యంలోని పోలీసుల భద్రతా వలయంలో వీరు కొండ ఎక్కారు.

ఫొటో సోర్స్, UGC
ఈ సందర్భంగా సాధారణ భక్తులు ఎవ్వరూ కవిత, రెహానాల సమీపంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేసిన వీడియోలను బట్టి తెలుస్తోంది. కాగా, ఒక భక్తుడు కవితపై దాడికి ప్రయత్నించగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఈ వీడియోలను బట్టి తెలుస్తోంది.
కాగా, కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన భక్తులు వీరిని అడ్డుకున్నారు.
అదే సమయంలో మహిళలు ఆలయ ప్రవేశానికి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పూజారులు ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తాము కూడా భక్తుల పక్షమేనని శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు కండరారు రాజీవరు తెలిపారు.
ఐజీ శ్రీజిత్ ఆలయానికి పూజారులు వేసిన తాళాలు తెరిపించడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కవిత, రెహనాను తీసుకుని ఆయన వెనక్కి తిరిగారు.
వారిద్దరికీ దైవదర్శనం చేయించడానికి తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా, పూజారుల అనుమతి లేనిదే తామేమీ చేయలేమని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు.
ఆలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కవిత, రెహానాలు కూడా ఆలయ ప్రవేశ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
దీంతో పోలీసులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC
ఆలయంలోకి అన్ని వయసుల వారినీ అనుమతిస్తాం కానీ కొంతమంది సామాజిక కార్యకర్తలు అక్కడ బలప్రదర్శన చేయడం తమకు ఇష్టం లేదని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.
మరోవైపు కొచ్చిలో రెహనా ఫాతిమా ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు ఇంటిలో విధ్వంసం సృష్టించారు.
ఇవి కూడా చదవండి:
- ఆదిపరాశక్తి ఆలయం: ఇక్కడ రుతుస్రావం అపవిత్రం కాదు.. పీరియడ్స్ సమయంలోనూ పూజలు చేయొచ్చు
- శబరిమల: భక్తులెవరో, ఆందోళనకారులెవరో తెలియని పరిస్థితి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- అఫ్గానిస్తాన్ కరవు: యుద్ధం కంటే దుర్భిక్షంతోనే ఎక్కువ వలసలు
- అమెరికా: జంతువుల ఎక్స్రేలు చూస్తారా..
- సౌదీ అరేబియా: అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి ఏమవుతుంది?
- చంద్రబాబు నాయుడుతో బీబీసీ ఇంటర్వ్యూ: ‘వారం రోజులుగా ఇక్కడే ఉంటూ తిత్లీ బాధితులను ఆదుకుంటున్నాం’
- ఎంజే అక్బర్: ప్రముఖ సంపాదకుడి నుంచి మంత్రి పదవికి రాజీనామా వరకు...
- కెనెడాలో గంజాయికి అనుమతి: ఇకపై పెరట్లో నాలుగు మొక్కలు పెంచుకోవచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








