శబరిమల: భక్తులెవరో, ఆందోళనకారులెవరో తెలియని పరిస్థితి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: శబరిమలలో బుధవారం ఏం జరిగింది?

కేరళలో శబరిమల ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు భక్తులలో కలిసిపోయారు. దీంతో ఎవరు ఆందోళకారులు.. ఎవరు భక్తులో గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లాలంటే పంబా నదిని దాటాలి.

మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. బుధవారం రాత్రి ఆలయాన్ని తొలిసారిగా తెరిచారు.

అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. మహిళలను ఆలయంలోకి అనుమతించవద్దంటూ పలువురు ఆందోళన చేపట్టారు. ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

శబరిమలలో ఆందోళనకారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుధవారం శబరిమల వైపు వెళ్లే వాహనాలను మహిళలు అడ్డుకొని అందులో 10-50ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఉన్నారేమోనని తనిఖీలు చేశారు.

ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై కూడా కొందరు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గురువారం శబరిమల ప్రాంతంలో ప్రభుత్వం పోలీసులను పెద్ద ఎత్తున మోహరించింది.

గురువారం నాడు ఇంతవరకూ అక్కడ ఆందోళనలు ఏమీ జరుగలేదని.. మహిళలెవరూ ఆలయం వైపు రాలేదని.. పంబాలో ఉన్న బీబీసీ ప్రతినిధి ప్రమీలా కృష్ణన్ తెలిపారు.

అయితే ఆందోళనకారులు భక్తులతో కలిసిపోవడంతో.. ఎవరిని అడ్డుకుని తనిఖీ చేయాలన్నది పోలీసులకు ఇబ్బందిగా మారింది.

శబరిమలలో ఆందోళనకారులు

ఈ నేపథ్యంలో అక్కడకు వార్తలు సేకరించడానికి వెళ్లిన న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి సుహాసినీ రాజ్‌ను అడ్డుకుని.. ఆమెను వెనక్కి పంపేశారు.

ఆమెపై ఎవరైనా దాడి చేసే అవకాశముందని భావించిన పోలీసులు.. సురక్షిత ప్రాంతానికి తరలించారు.

అయితే, బుధవారం ఇక్కడకు వచ్చిన కొన్ని మీడియా వాహనాలపై దాడి చేసిన ఆందోళనకారులు.. మీడియా ప్రతినిధులనూ దుర్భాషలాడారు.

ఇక్కడ ఆందోళనకారులు మీడియా ప్రతినిధులు, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.

శబరిమలలో ఆందోళనకారులు

కొందరు చేతిలో 'సేవ్ శబరిమల' అనే ప్లకార్డులను పట్టుకుని ఆలయం వద్దకు వెళ్తున్నారు.

అయితే గురువారం ఉదయం మాత్రం ఇక్కడ ఎలాంటి ఆందోళనలూ జరుగలేదు.

అయినా ఈ ప్రాంతమంతా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.

శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలు ప్రవేశించేందుకు కొన్నేళ్లుగా ఆంక్షలున్నాయి.

అయితే ఈ ఆంక్షలను ఇటీవలే సుప్రీం కోర్టు ఎత్తేసింది.

మరోవైపు.. ఇక్కడ బంద్‌కు పిలుపునిచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)