ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తొలి కేసు ఇదే... జీవీఎంసీ వ‌ర్సెస్ గాజుల శోభారాణి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం

ఫొటో సోర్స్, sreemannarayana.namburi/facebook

    • రచయిత, శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్య‌క‌లాపాలు బుధవారం మొద‌ల‌య్యాయి.

గ‌డిచిన 56 ఏళ్లుగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు హైద‌రాబాద్‌లో కొన‌సాగింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో జ‌న‌వ‌రి 1వ తేదీని అపాయింటెడ్‌ డే గా నిర్ణ‌యించి, హైకోర్టు విభ‌జ‌నకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్‌గా ప్ర‌వీణ్ కుమార్‌, ఆయనతో పాటు మ‌రో 13 మంది న్యాయ‌మూర్తులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

హైకోర్టు భ‌వ‌నం మరో నెలరోజుల్లో అందుబాటులోకి వ‌స్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈలోగా తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హిస్తున్నారు.

జీవీఎంసీ వ‌ర్సెస్ గాజుల శోభారాణి

ఈ రోజు (జ‌న‌వ‌రి 2వ తేదీ) నుంచి ఏపీ హైకోర్టులో కేసుల విచార‌ణను ప్రారంభించారు. తొలి కేసు విశాఖ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థకు సంబంధించినది. రిట్ పిటిష‌న్ నెం. 1731/2018 గా న‌మోద‌యిన విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ కేసు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో పిటిష‌న‌ర్లు.. జీవీఎంసీ క‌మిష‌న‌ర్, జీవీఎంసీ జోన్-2 జోన‌ల్ క‌మిష‌న‌ర్ కాగా, రెస్పాండెంట్స్ (ప్రతివాదులు) గాజుల శోభారాణి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మునిసిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ, విశాఖ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రధాన ధర్మాసనం హాలులో న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ

ఫొటో సోర్స్, sreemannarayana.namburi/facebook

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రధాన ధర్మాసనం హాలులో న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ (హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకముందు.. జనవరి 1వ తేదీన తీసిన)

ప్రతివాది నివాసం సికింద్రాబాద్

2018 న‌వంబ‌ర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఈ పిటీష‌న్ దాఖ‌ల‌య్యింది. ఈ కేసులో పిటిష‌న‌ర్ల త‌రుపున న్యాయవాది ఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ రెడ్డి వాదిస్తుండ‌గా, ప్ర‌తివాదుల ప‌క్షాన న్యాయవాది ప‌రావ‌స్తు కృష్ణ వాదిస్తున్నారు. కాగా, ఈ కేసు విచారణకు పిటిషనర్లు, ప్రతివాదులు స్వయంగా హాజరు కాలేదు. వారి తరపు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. న్యాయవాదుల తరపున జూనియర్ న్యాయవాదులు హాజరై వాయిదా కోరారు. ప్రతివాదుల్లో మొదటివారైన గాజుల శోభారాణిది సికింద్రాబాద్‌.

తొలిరోజు కేసులు 12.. విచారణ వాయిదా

దీంతో పాటు మొత్తం 12 కేసులపై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే తొలి రోజు కేసుల విచార‌ణ జ‌ర‌గ‌కుండానే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వాటిని వాయిదా వేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైకోర్టు ఏర్పాటు కావటం పట్ల బార్ కౌన్సిల్ స‌భ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. ఇదో చారిత్ర‌క ఘ‌ట్టమని, కేసుల విచార‌ణ త్వ‌ర‌తిగ‌తిన పూర్తికావ‌డానికి, వాదులు, ప్ర‌తివాదుల‌కు అందుబాటులో ఉండ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. హైకోర్టు భ‌వ‌నం పూర్త‌యితే మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఊహాచిత్రం

ఫొటో సోర్స్, http://hc.ap.nic.in/

ఫొటో క్యాప్షన్, అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఊహాచిత్రం

‘మరో నెల రోజులు ఇంతే’

హైకోర్టు కార్యకలాపాలు తొలిరోజు కావటం, వెబ్‌సైట్‌లో మార్పులు ప‌లువురు న్యాయ‌వాదులు హాజరుకాలేక‌పోవ‌డానికి కార‌ణాలని ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. ప్ర‌స్తుతం కేసుల లిస్టింగ్ జ‌రుగుతోంద‌ని, త‌దుప‌రి వాయిదాల నుంచి కేసుల విచార‌ణ జ‌రుగుతుంద‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

హైకోర్టు వెబ్‌సైట్‌లో మార్పులు మంగ‌ళ‌వారం అర్ధరాత్రికి అందుబాటులోకి వచ్చాయని, దీంతో ప‌లువురికి స‌మాచారం కూడా లేద‌న్నారు. ప్ర‌స్తుతం కోర్టులో సరిపడినన్ని మౌలిక స‌దుపాయాలు కూడా లేవ‌న్నారు. ముఖ్యమంత్రి స‌మావేశ హాలులో ఒక ధర్మాసనం, సీఎం ప్రెస్‌మీట్లు నిర్వ‌హించే హాలులో మ‌రో ధర్మాసనం కార్యకలాపాలు నిర్వ‌హిస్తున్నాయని, పూర్తిస్థాయి భ‌వ‌నం అందుబాటులోకి వ‌స్తే త‌ప్ప కోర్టు విధులు స‌క్ర‌మంగా సాగేందుకు ఆస్కారం ఉండ‌ద‌న్నారు. మ‌రో నెల రోజుల పాటు ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగ‌వ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)