హైకోర్టు విభజన: రాయలసీమ వ్యక్తిపై తెలంగాణలో కేసుంటే ఏ కోర్టులో విచారిస్తారు?

ఫొటో సోర్స్, SUNKARI JANARDHAN GOUD, TS HC ADVOCATES Assc
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తయింది. 2019 జనవరి 1 నుంచి విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గదుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పనిచేయడం ప్రారంభిస్తుంది. సంక్రాంతి సెలవుల తర్వాత పూర్తిస్థాయి కొత్త భవనాల్లోకి హైకోర్టు మారనుంది.
ప్రస్తుతం హైకోర్టు పనిచేయడం కోసం ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా కోర్టు హాళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశాలు నిర్వహించే హాల్‌లో కూడా ఒక కోర్టు హాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం 8:30కి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ఉదయం 11:30 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణం చేశారు.

ఫొటో సోర్స్, SUNKARI JANARDHAN GOUD, TS HC ADVOCATES Assc
హైకోర్టు విభజనకు చాలా తక్కువ సమయం ఇచ్చారంటూ, ఐదు రోజుల్లో హైకోర్టును విభజించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రపతి ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేసు తీసుకున్న రిజిస్ట్రార్ జనవరి 2న వాదనలకు తేదీ ఇచ్చారు. దీంతో హైకోర్టు విభజన ప్రక్రియ యథాతథంగా కొనసాగింది.
మరోవైపు హైకోర్టు విభజనపై పీవీ కృష్ణయ్య వేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టులోని జస్టిస్ రామసుబ్రమణ్యన్ ధర్మాసనం సోమవారం కొట్టేసింది.

ఫొటో సోర్స్, Krishna Sai
డిసెంబరు 31 సోమవారం ఉదయం నుంచి హైకోర్టులో సందడి వాతావరణం నెలకొంది. ఏపీ, తెలంగాణ సిబ్బంది, న్యాయవాదులు పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు.
ఏపీ హైకోర్టుకు కేటాయించిన సిబ్బంది తెలంగాణ ఆర్టీసి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో విజయవాడ తరలి వెళ్లారు. ఫైళ్లు కూడా తరలించారు.
ఏపీకి వెళ్తున్న న్యాయమూర్తులకు వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ న్యాయమూర్తులకు విజయవాడలో ఆంధప్రదేశ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
అక్కడ న్యాయమూర్తులకు వివిధ హోటళ్లలో తాత్కాలిక బస కల్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసుల విభజన ఎలా?
హైకోర్టు కేసులను రెండు రకాలుగా తీసుకుంటుంది.
1. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్: హక్కులకు సంబంధించి నేరుగా హైకోర్టులో వేసే రిట్ పిటిషన్ల వంటివి దీని కిందకు వస్తాయి. పోలీసులు తీసుకువెళ్లిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలనే హెబియస్ కార్పస్ పిటిషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈ కోవలోకి వస్తాయి.
2. అప్పీళ్లు: కింది కోర్టుల్లో విచారణ పూర్తయి తీర్పు వచ్చిన తరువాత, ఆ తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వచ్చే కేసులు ఈ కోవలోకి వస్తాయి.
అప్పీళ్లుగా వచ్చిన కేసులన్నీ ఏదో ఒక జిల్లా కోర్టు నుంచి వస్తాయి. ఆ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంటే ఆ కేసు ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అవుతుంది.

ఫొటో సోర్స్, Krishna Sai
నేరుగా హైకోర్టులో వేసిన పిటిషన్లలో కూడా ఏదో ఒక పార్టీ లేదా అంశం (సబ్జెక్ట్) ఏదో ఒక రాష్ట్రం లేదా జిల్లాకు చెంది ఉంటుంది. వాటిని సంబంధిత హైకోర్టుకు ఇస్తారు.
ఉదాహరణకు విశాఖపట్నంలో సముద్ర కాలుష్యంపై వేసిన పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్తుంది.
హైదరాబాద్‌లో భవనం వివాదానికి సంబంధించిన కేసు తెలంగాణ హైకోర్టుకు వెళ్తుంది.
కేసు వేసిన వ్యక్తుల నివాసం ఎక్కడనేది కాకుండా, కేసుకు సంబంధించిన అంశం లేదా ఘటన ఏ ప్రాంతం పరిధిలోనిదనే ప్రాతిపదికగా కేసుల విభజన జరుగుతుంది.

ఫొటో సోర్స్, Krishna Sai
ఇది కూడా చదవండి:
- 'గాంధీ జాత్యహంకారి'
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ భవనం: ఆకాశ హర్మ్యాలు ఇలా నిర్మిస్తారు
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- హార్వ ర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ‘ఆసియా దరఖాస్తుదారులపై వివక్ష’
- శక్తి టీమ్స్: పోలీస్ శాఖలో మహిళా శక్తి
- సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు: అమిత్ షా సహా నిందితులంతా నిర్దోషులు ఎలా అయ్యారు
- పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!
- బంగ్లాదేశ్: ఇద్దరి మరణం.. ఉద్యమానికి ఊపిరి పోసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








