బంగ్లాదేశ్: ఇద్దరి మరణం.. ఉద్యమానికి ఊపిరి పోసింది

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, AFP

సామూహిక నిరసనలతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అట్టుడికింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనతో వారం రోజులపాటు పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. నిరసన కార్యక్రమాలు ఉద్యమ రూపం దాల్చి, 1.8 కోట్ల జనాభా ఉన్న ఢాకా నగరాన్ని స్తంభింపచేశాయి. వీధుల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ నిరసనలు ఎలా మొదలయ్యాయి?

జూలై 29న వేగంగా వస్తున్న ఓ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారులు(ఒక అమ్మాయి, అబ్బాయి) మృతి చెందారు.

తన కంటే ముందు వెళుతోన్న బస్సును ఓవర్‌టేక్ చేసి, ప్రయాణికులను తన బస్సులో ఎక్కించుకోవాలన్న ఉద్దేశంతో బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. మితిమీరిన వేగంతో బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

గతేడాది రోడ్డు దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4,000 మంది పాదచారులు మరణించారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. కానీ ఈసారి అలా కాదు.

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, EPA

ఈ సంఘటన పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు.. పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో స్కూలు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి, వీధులు, రహదారులను దిగ్బంధించారు. దీంతో ఒక్కసారిగా ఢాకా నగరం స్తంభించింది.

ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను ఎక్కడికక్కడ ఆపి, డ్రైవర్ల లైసెన్సులు, ఆ వాహనాల కండీషన్ సర్టిఫికేట్లను పరిశీలించారు.

''డబ్బులిస్తే చాలు.. వెహికల్ లైసెన్సును చాక్లెట్లలా చేతుల్లో పెడుతున్నారు. ఇది పోవాలన్నదే మా కోరిక'' అని 17 ఏళ్ల విద్యార్థి బీబీసీతో అన్నారు.

హింసాత్మకంగా ఎలా మారింది?

బంగ్లాదేశ్‌లో నిరసనలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిది.. వేలాదిగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నగరం మొత్తాన్నీ స్తంభింపచేశారు. ఢాకా రోడ్లపై, వీధుల్లో ఎలాంటి బస్సులు తిరగలేదు. ఒక్క ఢాకాలోనే కాదు.. ఢాకా నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు. అన్ని బస్సు సర్వీసులూ రద్దయ్యాయి.

నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు.. శనివారం నాడు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

అధికార పార్టీ 'అవామీ లీగ్' అనుబంధ విద్యార్థి సంఘం 'బంగ్లాదేశ్ ఛత్రా లీగ్'(బీసీఎల్)కు, నిరసనకారులకు మధ్య కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సోమవారం కొనసాగిన ఘటనల్లో పోలీసులకు, విద్యార్థులకు మధ్య యూనివర్సిటీలు, నివాస స్థాలాల్లో గొడవలు చెలరేగాయి.

ఓ స్థానిక వైద్యుడు మాట్లాడుతూ.. ఘర్షణల్లో గాయపడ్డ 40 మందికి తాను వైద్యం చేశానని, అందులో ఎక్కువ మంది విద్యార్థులేనని అన్నారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES

ఈ ఘర్షణల్లో బీసీఎల్ కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేశారని, ఘర్షణల చిత్రీకరణ సమయంలో ఫోన్లు, కెమెరాలను లాక్కుని ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ''ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే'' అని 'డైలీ స్టార్' అనే పత్రిక తన ఎడిటోరియల్ కాలమ్‌లో ప్రచురించింది.

అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన ఒక ఫోటో జర్నలిస్టుతోపాటు చాలా మంది జర్నలిస్టులపై కూడా భౌతికంగా దాడి చేశారని విలేకరులు తెలిపారు.

ఒక మహిళా రిపోర్టర్ మాట్లాడుతూ.. చిత్రీకరణ సమయంలో తనపై కూడా దౌర్జన్యం చేశారని, వీడియో ఫుటేజ్‌ను డిలీట్ చేస్తానని చెప్పినా బీసీఎల్ కార్యకర్తలు వినలేదని అన్నారు.

''నువ్వు డిలీట్ చేయకపోతే ఇక నీ కథ ముగిసినట్లే. నిన్ను ఎవరూ రక్షించలేరు'' అని బీసీఎల్ కార్యకర్తలు తనను బెదిరించారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడేవారిని బీసీఎల్ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుంటారన్న భయం కూడా ఉంది'' అని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని మహిళా రిపోర్టర్ బీబీసీతో అన్నారు.

శనివారం రాత్రి, అమెరికా దౌత్యవేత్త వెళుతున్న కాన్వాయ్‌పై కూడా కొందరు సాయుధులు దాడి చేశారు.

టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న బలగాలు

ఫొటో సోర్స్, EPA

ప్రముఖ సామాజిక కార్యకర్త, ఫోటోగ్రాఫర్ షాహిదుల్ ఆలమ్‌ ఈ నిరసనలపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం రాస్తున్నారన్న అభియోగాలతో ఆయనపై కేసు నమోదు చేశారు. అల్ జజీరా టీవీ ఇంటర్వ్యూలో ఆందోళనల పట్ల ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించిన కొన్ని గంటలకే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆలమ్‌ను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల సంస్థ ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ డిమాండ్ చేసింది. అహింసాయుతంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలను హింసాయుతంగా అణిచేయడాన్ని ఖండించింది. ఈ దాడులకు స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని కోరింది.

విద్యార్థులు ఎలా సంఘటితమయ్యారు?

ఈ ఉద్యమంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ప్రధాన కారణమైన చిన్నారుల మృతి వార్తను అందరికీ చేరవేయడంతోపాటు, నిరసన కార్యక్రమాల నిర్వహణలో కూడా సోషల్ మీడియా కీలకంగా వ్యవహరించింది. ఈ ఉద్యమానికి వస్తున్న స్పందన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, నిరసనలను కొనసాగించాలని నెటిజన్లు స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ఉద్యమాన్ని స్థానిక మీడియా, అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకు వెళ్లడానికి కూడా నిరసనకారులు సోషల్ మీడియాను వాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. శనివారం సాయంకాలం 3జీ, 4జీ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది.

ప్రభుత్వ స్పందన ఎలా ఉంది?

రోడ్డు భద్రత సంస్కరణలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇస్తూ, చాలా కాలంగా కాగితాలకే పరిమితమైన రోడ్డు రవాణ చట్టాన్ని కేబినేట్ ఆమోదించింది. నిరసనకారులను శాంతపరచడానికి.. రోడ్డు ప్రమాదాలకు కారణమైనవారికి మరణ శిక్షను అమలు చేసే అంశం గురించి ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆందోళనలను విరమించి విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు.

అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు హింసను రేకెత్తించారన్ని ఆరోపణల నేపథ్యంలో.. తమ కార్యకర్తలను అవామీ లీగ్ పార్టీ వెనకేసుకొచ్చింది.

''నిరసనకారులు అవామీ లీగ్ పార్టీ కార్యాలయం వైపు దూసుకొస్తున్నపుడు ఏం చేయాలి? వాళ్లను ముద్దు పెట్టుకోవాలా?'' అని జనరల్ సెక్రటరీ అబైదుల్ ఖాదర్ అన్నారు.

విద్యార్థులు, ఇతరుల మధ్య ఘర్షణ

ఫొటో సోర్స్, Getty Images

ఈవిషయమై స్పందించిన ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ.. ''హింసాత్మక ఘటనల పట్ల ఆందోళన చెందుతున్నాం. నిరసనకారులను శాంతింపచేయడాన్ని స్వాగతిస్తున్నాం'' అని పేర్కొంది.

నిరసనకారుల పట్ల పోలీసుల వైఖరిని బంగ్లాదేశ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్ వేదికగా తీవ్రంగా విమర్శించింది.

''బస్సులు, ఇతర వాహనాలను తగలబెడుతున్నవారిని వదిలిపెట్టి, బలహీనులైన విద్యార్థులపై విరుచుకుపడటం ఏం న్యాయం?'' అని అమెరికా ఎంబసీ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)