విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి గైడెడ్ మిసైల్‌కు తేడా లేదు: ఏయూ వీసీ

ఫొటో సోర్స్, AU
కౌరవులు స్టెమ్ సెల్, టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ ద్వారా పుట్టారని, వేల ఏళ్ల కిందటే భారతదేశానికి గైడెడ్ మిసైల్స్ గురించి తెలుసని విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి జీ నాగేశ్వరరావు భారత సైన్స్ కాంగ్రెస్‌లో చెప్పారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. పంజాబ్‌లోని జలంధర్‌లో ‘ఫ్యూచర్ ఇండియా- సైన్స్ అండ్ టెక్నాలజీ’ థీమ్‌తో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది.
పీటీఐ కథనం ప్రకారం- విష్ణువు దశావతారాలు జీవపరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ థియరీకి ముందే ఉన్నాయని వీసీ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
రాముడు అస్ర్త, శస్త్రాలు వినియోగించారని, లక్ష్య చేధన కోసం విష్ణువు సుదర్శన చక్రాన్ని వాడారని, ఇవి లక్ష్యాలను చేధించి తిరిగి వచ్చేవని ఆయన తన ప్రజెంటేషనల్లో వివరించారు. వీటిని బట్టి చూస్తే గైడెడ్ మిసైల్స్ భారత్‌కు కొత్త కాదని, వేల ఏళ్ల కిందటే ఇవి ఉన్నాయని అర్థమవుతోందని తెలిపారు.
రావణుడికి కేవలం పుష్పక విమానమే కాకుండా మరో 24 రకాల విమానాలు ఉండేవని రామాయణం చెబుతోందని నాగేశ్వరరావు చెప్పారు. రావణుడు లంకలో చాలా విమానాశ్రయాలు నిర్మించారని, ఆయన చాలా విమానాలను వినియోగించారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, LPU
డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవం నీటి నుంచి పుట్టిందని, అలాగే విష్ణువు మొదటి అవతారం కూడా మత్స్యావతారమని ఆయన వివరించారు.
గాంధారి 100 మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చి ఉంటారనే ప్రశ్నకు నాగేశ్వరరావు సమాధానమిస్తూ- ''అందరూ ఆశ్చర్యపోతున్నారు కాని నమ్మడం లేదు. గాంధారి 100 మందికి ఎలా జన్మనివ్వగలరు. ఇది మనిషికి సాధ్యమా? ఓ మహిళ జీవిత కాలంలో 100 మంది పిల్లలకు జన్మనివ్వగలరా'' అని ప్రశ్నించారు.
కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలై ఉంటారని, మహాభారతం కూడా 100 అండాలను 100 మట్టికుండల్లో ఫలదీకరణ చేశారని చెప్పిందని ఆయన ప్రస్తావించారు. దీన్ని బట్టి స్టెమ్ సెల్ పరిశోధన వందల ఏళ్ల కిందటే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ టెక్నాలజీ వల్లే ఒక తల్లి నుంచి 100 మంది కౌరవులు పుట్టి ఉంటారని చెప్పారు.
ఈ వాదనను కొందరు నిపుణులు తప్పుబట్టారు. ఈ మధ్య తమకు అనుకూలమైన వాదనల కోసం పురాణాలను ఉటంకించడం పెరుగుతోందని విమర్శించారు.

ఫొటో సోర్స్, lpu
హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో రీడర్ అనికేత్ సూలే మాట్లాడుతూ- స్టెమ్ సెల్ పరిశోధన, టెస్ట్ ట్యూబ్ బేబీలు, గైడెడ్ మిసైల్స్, విమానాలు చాలా అధునాతన టెక్నాలజీలని, ఏ సమాజంలో అయినా ఇవి ఉంటే ఇలాంటి మరిన్ని టెక్నాలజీలు కూడా ఉండాలని సూచించారు. వీటి కోసం విద్యుత్తు, లోహశాస్ర్తం, మెకానిక్స్ వంటివి చాలా కావాలని, ఇవన్నీ ఇంతకు ముందు లేవని చెప్పారు.
సైన్స్ కాంగ్రెస్: గతంలోనూ వివాదాలు
భారత సైన్స్ కాంగ్రెస్‌లో గతంలోనూ పలు వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. 2015లో సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తూ కేంద్ర మంత్రి హర్షవర్దన్ మట్లాడుతూ.. ప్రపంచానికి అల్జీబ్రా, పైథాగరస్ సిద్ధాంతాలను భారత్ అందించిందని చెప్పారు. వాస్తవానికి పైథాగరస్ గ్రీకు గణిత శాస్తజ్ఞుడు, తత్వవేత్త.

ఫొటో సోర్స్, lpu
వేదకాలంలో విమానాలు
కెప్టెన్ ఆనంద్ జె బొడాస్ మాట్లాడుతూ- వేదకాలంలోనే విమానాలు ఉన్నాయన్నారు. 7000 ఏళ్ల కిందటే భరద్వాజ మహర్షి విమానాలను కనిపెట్టారని చెప్పారు.
ఆవు తన కడుపులో ఉన్న బ్యాక్టీరియా సాయంతో ఆహారాన్ని 24 కేరట్ల బంగారంగా మార్చగలదని ఓ వక్త సైన్స్ కాంగ్రెస్‌లో చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- పాస్‌పోర్టు గురించి ఈ 13 విషయాలు మీకు తెలుసా...
- మోదీపై రాహుల్ వేస్తున్న నిందలు సరే... నిజాలెక్కడ
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- అంబానీల పెళ్లి సందడి: కలవారి ఇంట తారాతోరణం
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- సిక్కిం: సుందర పర్వత సీమల్లో అద్భుత విమానాశ్రయం
- ట్రిపుల్ తలాక్ బిల్లు: ''లింగ న్యాయంపై రాజకీయం పైచేయి''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








