ట్రిపుల్ తలాక్ బిల్లు: ''లింగ న్యాయంపై పైచేయి సాధించిన రాజకీయం''

ముస్లిం యువతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జకియా సోమన్
    • హోదా, బీబీసీ కోసం

తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు) లోక్‌సభలో 245 ఓట్లతో డిసెంబరు 27న ఆమోదం పొందింది. ఆ సందర్భంగా వివిధ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇప్పుడు రాజ్యసభలో బిల్లు భవితవ్యం అనిశ్చితిలో పడింది.

మన దేశంలో న్యాయంపై రాజకీయాలే పైచేయి సాధించడం దురదృష్టకరం.

ముస్లిం మహిళలకు న్యాయం చేయాలనే అంశం పాలక, ప్రతిపక్షాల మధ్య వైరం వల్ల పక్కదోవ పట్టినట్లు కనిపిస్తోంది. మన సమాజంలో ఇప్పటికే ఉన్న పితృస్వామ్య పోకడలకు తోడుగా ఇదో కొత్త సమస్యగా మారింది. రాజ్యాంగం స్త్రీ-పురుషులిద్దరికీ సమాన న్యాయం హామీ ఇస్తుండగా, ఈ సమస్యలు ముస్లిం మహిళలకు న్యాయాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

ముమ్మారు తలాక్‌ను సుప్రీంకోర్టు 2017లో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినా, మన దేశంలో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది.

ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని బిల్లు క్రిమినల్ నేరంగా పరిగణించడంపైనే ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమవుతోంది. కానీ ముస్లిం భర్త సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలంటే ఏం చేయాలో ఎవరికీ తెలియదు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

విడాకుల విధివిధానాలను వివరించే ముస్లిం ఫ్యామిలీ లాను పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడమే ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్తమ మార్గం.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, ముస్లిం భర్త తలాక్ చెప్పి, భార్యను నిరాశ్రయురాలిని చేయడం పట్ల ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారెవరికీ పట్టింపు ఉన్నట్లు లేదు. ముస్లిం మహిళలు ప్రతికూల దృక్పథంతో ఉంటారని, తలాక్ చెప్పే భర్తలను అరెస్టు చేయిస్తారనే ఆలోచనా తీరు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.

వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. విడాకుల తర్వాత సామరస్యపూర్వక పరిష్కారం కోసం మహిళలు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.

ముమ్మారు తలాక్ ప్రకటనను నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సామాజిక కార్యకర్తలూ రంగంలోకి దిగారు. వీళ్లు ఇంతవరకు వరకట్న చట్టానికిగాని, గృహహింస నిరోధక చట్టానికిగాని, బాల్య వివాహ చట్టానికిగాని, రెండో వివాహానికి సంబంధించిన చట్టానికిగాని సవరణలు కోరలేదు. ఈ చట్టాలన్నింటిలో జైలు శిక్ష నిబంధనలు ఉన్నాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలు విస్మయం కలిగిస్తున్నాయి.

ఎవరి లక్ష్యాలు వాళ్లు సాధించుకోవడానికి ఈ తలాక్ బిల్లు ఒక సాధనంగా మారిపోయింది.

ఏకాభిప్రాయ సాధనలో ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షం కూడా సహకరించడానికి సిద్ధంగా లేదు. సరైన చట్టాల రూపకల్పన ద్వారా స్త్రీపురుషులిద్దరికీ సమాన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉంది. ముస్లిం పర్సనల్ లా తప్ప అన్నివర్గాల పర్సనల్ లాలను పార్లమెంటు సంస్కరించింది.

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, AFP

వివాహం, ముమ్మారు తలాక్, హలాలా, బహుభార్యత్వం, పిల్లల సంరక్షణ, ఆస్తిలో మహిళల వాటా, ఇతర ముఖ్యమైన అంశాల్లో ద షరియత్ అప్లికేషన్ యాక్ట్ 1937 పరిష్కారాలు చూపడం లేదు. ముస్లిం పర్సనల్ లాకు సంబంధించి వివిధ అంశాల పరిష్కారం కోసం గత దశాబ్ద కాలంలో ముస్లిం మహిళలే ప్రయత్నాలు చేశారు. తలాక్ రద్దు వీటిలో ఒకటి.

ముస్లిం మహిళలు సంఘటితమై, స్త్రీపురుషులకు సమాన న్యాయానికి సంబంధించి ఖురాన్ బోధనలు, రాజ్యాంగ నిబంధనలపై అవగాహనను పెంచేందుకు ప్రయత్నించారు. ఎంపీలకు, ప్రభుత్వానికి, మహిళా కమిషన్లకు, రాజకీయ పార్టీలకు, ఇతర ప్రజాస్వామ్య సంస్థలకు డిమాండ్లు, అభ్యర్థనలు చేశారు.

కొందరు ప్రగతిశీల ఎంపీలను మినహాయిస్తే అందరు రాజకీయ నాయకులు, సంప్రదాయ ముస్లిం మతపెద్దలు ముస్లిం మహిళల డిమాండ్లను పట్టించుకోలేదు. ఖురాన్, రాజ్యాంగం చెప్పే న్యాయం, సమానత్వం, నిష్పాక్షిత విలువలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లాను సంస్కరించాలనే వీరి అభ్యర్థనను మన్నించలేదు. స్త్రీపురుషులకు సమాన న్యాయం కోసం ముస్లిం మహిళలు చేస్తున్న న్యాయబద్ధమైన డిమాండ్లను విస్మరిస్తూ వచ్చారు. ఈ అంశాలు అసలు సమస్యలే కాదన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి దాదాపు దేశమంతా మద్దతుగా నిలిచినా కాంగ్రెస్, ఇతర లౌకికవాద పార్టీలు దానికి అనుగుణంగా వ్యవహరించలేదు. ఈ నేపథ్యంలో చూస్తే, తలాక్ బిల్లు విషయంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందాలని ఆశించడం ఆశ్చర్యం కలిగించదు. బిల్లుపై విపక్షాలతో ప్రభుత్వం తగినంతగా చర్చించలేదన్నది స్పష్టమవుతోంది.

అదే సమయంలో, ముస్లిం మహిళల డిమాండ్ల పట్ల విపక్షాలు ఆసక్తి చూపలేదన్నది, వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదన్నది కూడా నిజమే. అత్యధిక రాజకీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. హిందూ, క్రైస్తవ, జైన్ మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకూ న్యాయం అందించాల్సిన సమయం ఆసన్నమైందని ఒక్క పార్టీ కూడా స్పష్టంగా చెప్పలేదు.

తలాక్ బిల్లుపై చర్చలో సంబంధీకులందరూ రెండు వర్గాలుగా విడిపోవడం వల్ల తలాక్ బాధిత మహిళల సమస్యలు ఎవరి దృష్టికీ రాకుండా పోయాయి. ముమ్మారు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లో తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా దాదాపు 45 మంది మహిళలు తమ భర్తలు తలాక్ చెప్పారంటూ ఫిర్యాదులు చేశారు.

భర్తలు తలాక్ చెప్పడంతో నిరాశ్రయులవుతున్న ఇలాంటి మహిళల జీవితాల్లో సుప్రీంకోర్టు తీర్పు ఏ మార్పూ తీసుకురాలేకపోయింది.

సుప్రీంకోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సంప్రదాయానికి ముగింపు పలకాలంటే సుప్రీంకోర్టు తీర్పు సరిపోదని అర్థమవుతోంది.

బాధిత మహిళ తన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని చెప్పినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఆమె కోసం తీర్పును అమలు చేసే సంస్థ ఎక్కడుంది? ఆమెకు తలాక్ చెప్పిన పురుషుడు స్వేచ్ఛగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో చట్టం పట్ల భయం అంటూ ఉంటే వివాహ బంధాన్ని కాపాడుకొనేందుకు, లేదా తలాక్ చెప్పిన పురుషుడి నుంచి తగిన పరిహారం, మద్దతు కోరేందుకు బాధిత మహిళకు అవకాశం ఉంటుంది.

ఎంతో ప్రధానమైన వివాహ బంధంలో ఏకపక్షంగా వ్యవహరించేందుకు అవకాశం లేకుండా చేయడం, జవాబుదారీతనాన్ని తీసుకురావడం ముఖ్యం.

మహిళలు, ఉమ్మడి పౌర స్మృతి, హిందువులు, ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

న్యాయాన్ని కాపాడేందుకు కోర్పు తీర్పులు మాత్రమే సరిపోయే పనైతే మనకు భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షా స్మృతి(సీఆర్‌పీసీ), ఆ మాట కొస్తే పార్లమెంటు కూడా అవసరం లేదు. హంతకులకు, రేపిస్టులకు శిక్షలు విధిస్తూ అసంఖ్యాక తీర్పులు వెలువడ్డాయి. అయినప్పటికీ హత్య, అత్యాచారానికి సంబంధించి మనకు చట్టాలు ఉన్నాయి.

ముమ్మారు తలాక్‌ చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినందున తలాక్ బిల్లు అవసరం లేదనడం సరికాదు. బిల్లు నిబంధనల గురించి ఆందోళన చెందేందుకు ఎలాంటి ప్రాతిపదికా లేదు.

తలాక్ చెప్పిన పురుషుడిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే హక్కును ఈ బిల్లు భార్యకు లేదా కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తోంది. రాజకీయాలను పక్కనబెట్టి, స్త్రీపురుషులిద్దరికీ సమాన న్యాయం కోణంలో తలాక్ అంశాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)