ఆరోగ్యం: హిప్ రీప్లేస్‌మెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది?

హిప్ రీప్లేస్ మెంట్

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నా పెళ్లిలో గుర్రం ఎక్కలేదు, గుర్రపు బండిలో కూచోవాల్సి వచ్చింది. పెళ్లి తంతులో నేను నేలపై కాకుండా సోఫాలో కూచోవాల్సి వచ్చింది. అలా జరుగుతున్నందుకు ఎంత బాధపడ్డానో. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది. కానీ నేను దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయా"

దిల్లీలో ఉంటున్న 30 ఏళ్ల ఇషాన్ శర్మ ఆవేదన ఇది. రెండున్నరేళ్ల క్రితం ఇషాన్‌కు పెళ్లైంది. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక, హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోవాలనే విషయం ఆయనకు తెలిసింది.

ఆ రోజులు గుర్తు చేసుకున్న ఇషాన్ "అంతా మామూలుగానే ఉంది. ఒక రోజు నేను నా ఫ్రెండును వదలడానికి రైల్వే స్టేషన్ వెళ్లాను. తిరిగి వస్తుంటే, మెట్లు దిగేటపుడు తొడలో కలుక్కుమంది. దాంతో కుంటుతూ నడవాల్సి వచ్చింది. ఏదో నరం పట్టేసి ఉంటుందిలే అనుకున్నా. పెయిన్ కిల్లర్ వేసుకుని నిద్రపోవాలని ప్రయత్నించా. కానీ నొప్పి తగ్గలేదు" అన్నారు.

నొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు నన్ను డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెప్పారు. మొదట ఎంఆర్ఐ తీయించిన డాక్టర్, నా నరాలకు రక్తం చేరడంలో సమస్య ఉందని తెలుసుకున్నారు. నా సమస్య అడ్వాన్స్ స్టేజిలో ఉందని గుర్తించారు.

మందులతో నయం అయ్యే పరిస్థితి చేయిదాటిపోవడంతో నాకు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తప్ప వేరే దారి లేకుండా పోయింది.

హిప్ రీప్లేస్ మెంట్

ఫొటో సోర్స్, ISHAN SHARMA

ఈ సర్జరీని చిన్న వయసులో చేయరు

ఇషాన్ రెండేళ్ల ముందు సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన వయసు 28 ఏళ్లు.

హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ గురించి దిల్లీ అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ ఆర్థోసర్జన్‌గా పనిచేసిన డాక్టర్ హిమాంశు త్యాగి వివరించారు. "మేం 55 ఏళ్ల వయసు తర్వాతే హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోమని సలహా ఇస్తాం. ఎందుకంటే దాని లైఫ్ 20 నుంచి 25 ఏళ్ల వరకే ఉంటుంది" అన్నారు.

55 ఏళ్ల తర్వాత సర్జరీ చేయించుకుంటే ఇది సాధారణంగా 75-80 ఏళ్ల వరకూ వస్తుంది. ఆ వయసులో హిప్ రీప్లేస్‌మెంట్ చేస్తే, అవి పాడయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే యువకులుగా ఉన్నప్పటి కంటే ఈ వయసులో పని తక్కువగా ఉంటుంది.

సాధారణంగా సర్జరీని అంత చిన్న వయసులో చేయించుకోరు. కానీ వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో సర్జరీ చేయించుకున్నట్టు ఇషాన్ చెప్పారు.

నిజానికి హిప్ రీప్లేస్‌మెంట్ ముందు ఇషాన్ బోన్ డికంప్రెషన్ సర్జరీ చేయించుకున్నారు. దానితో ఆయనకు పూర్తి ఉపశమనం లభించలేదు. తర్వాత డాక్టర్ల సలహాతో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసుకోవడం ఇషాన్‌కు తప్పనిసరి అయ్యింది.

హిప్ రీప్లేస్ మెంట్

ఫొటో సోర్స్, Getty Images

హిప్ రీప్లేస్‌మెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది?

"సాదారణంగా మూడు విషయాల్లో, అంటే ఎవరికైనా నడుము ఆర్థరైటిస్ ఉంటే, లేదా నడుము దగ్గర రక్త ప్రసరణ సమస్య ఉంటే, లేదా చాలా తీవ్రమైన దెబ్బ తగిలితే ఇలాంటి సర్జరీ అవసరం అవుతుంది" అని డాక్టర్ హిమాంశు చెప్పారు.

దానితోపాటు అప్పుడప్పుడు ఎముకల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా ఇది చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి.

డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం సిగరెట్, మద్యం తాగేవారిలో స్టెరాయిడ్స్ లేదా డ్రగ్స్ తీసుకునేవారిలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం ఎక్కువ ఉంటుంది.

అవి వ్యసనంగా మారడంతో రక్తం సరఫరా చేసే ధమనులు కుంచించుకుపోతాయి. దాంతో రక్త ప్రవాహంలో సమస్యలు ఎదురవుతాయి.

హిప్ రీప్లేస్ మెంట్

ఫొటో సోర్స్, ISHAN SHARMA

హిప్ రీప్లేస్‌మెంట్‌లో రకాలు

హిప్ రీప్లేస్‌మెంట్‌లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో మెటల్ ఉపయోగిస్తారు. కొన్ని కేసుల్లో సిరామిక్ వాడతారు. కొన్ని కేసుల్లో అయితే ప్రత్యేక రకం ప్లాస్టిక్‌తో చేసిన మెటీరియల్ ఉపయోగిస్తారు.

కానీ ఈ మూడింటిలో ఏది సరైనది అనేది స్పష్టంగా చెప్పలేం.

"ఏ రోగికి ఎలాంటి హిప్ రీప్లేస్‌మెంట్ చేయాలి అనేది రోగి సమస్యలు, అతడి వయసు, అవసరం, ఎముకల క్వాలిటీని బట్టి నిర్ణయిస్తారు" అని డాక్టర్ హిమాంశు చెప్పారు.

కావాలనుకుంటే డాక్టర్ చాలా కేసుల్లో మెటల్ లేదా సిరామిక్ హైబ్రీడ్ కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శరీరంలో మెటల్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటే, అలాంటి పరిస్థతుల్లో మెటల్ హిప్ రీప్లేస్‌మెంట్ వల్ల సమస్యలు రావచ్చు.

హిప్ రీప్లేస్ మెంట్

సర్జరీ తర్వాత అంతా సర్దుకుంటుందా?

అదే ప్రశ్న మేం ఇషాన్‌ను, డాక్టర్లను అడిగాం.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇషాన్ చెప్పారు. ముఖ్యంగా స్క్వాట్ ( తొడల కోసం చేసే వ్యాయామం) చేయడం, కాళ్లు మడిచి కూచోవడం, నడుము మీద వాలడం లాంటి జాగ్రత్తగా చేయాలన్నారు. అవి తప్ప తన జీవితం ఇప్పుడు చాలా హాయిగా ఉందన్నారు.

సాధారణంగా ఈ సర్జరీ తర్వాత డాక్టర్లు రోగిని ఐదు రోజుల వరకూ ఆస్పత్రిలోనే ఉంచుతారు. రెండో రోజు నుంచి ఫిజియోథెరపీ నడిపించడానికి ప్రయత్నిస్తారు.

కానీ లావుగా ఉండే రోగులు తమ బరువు గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ బరువు ఉండడం వల్ల హిప్ మీద ఎక్కువ భారం పడుతుంది. అందుకే వాళ్లు శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి అని డాక్టర్ హిమాంశు చెప్పారు.

హిప్ రీప్లేస్‌మెంట్ వల్ల సెక్స్ లైఫ్‌పై ప్రభావం?

సర్జరీ చేయించుకోవడం వల్ల తన సెక్స్ లైఫ్ పై ఎలాంటి ప్రభావం పడలేదని ఇషాన్ చెప్పారు. సర్జరీ చేయించుకోకుంటే సెక్స్ లైఫ్‌లో సమస్యలు వచ్చుండేవని భావిస్తున్నారు.

అదృష్టవశాత్తూ ఇషాన్ పెళ్లికి ముందే సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నారు.

హిప్ రీప్లేస్ మెంట్

ఫొటో సోర్స్, Science Photo Library

హిప్ రీప్లేస్‌మెంట్ చేయించుకున్న వారు సెక్స్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ హిమాంశు చెప్పారు. సర్జరీ అయిన రెండు వారాల తర్వాతే మళ్లీ సెక్స్ లైఫ్ ప్రారంభించాలని అన్నారు. పురుషులు, మహిళలు వేరు వేరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

సెక్స్ సమయంలో కొన్నిప్రత్యేక పొజిషన్లు చాలా అవసరం అవుతాయి. అంటే మహిళల రెండు కాళ్లు చాలా దగ్గరగా ఉండకూడదు. అయితే సైడ్ పొజిషన్లో పడుకోవచ్చు. కానీ మోకాళ్ల మధ్యలో దిండు వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు.

హిప్ రీప్లేస్‌మెంట్ ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

రోగి కొన్ని రోజుల ముందు బాగా ఎక్సర్‌సైజ్ చేయాలి. అప్పుడే కండరాల ఒత్తిడి లేకుండా ఉంటుంది. షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఒకవేళ మద్యం తాగేవారయితే లేదా స్మోకింగ్ చేస్తుంటే మొదట ఆ వ్యసనం వదులుకోవాలి. తర్వాత హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోవాలి.

హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకూ ఖర్చు కావచ్చు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)